Share News

‘కౌన్‌ బనేగా...’ నీరజ్‌ సక్సేనా!

ABN , Publish Date - Nov 10 , 2024 | 09:04 AM

సత్తువుంది... మేధస్సుంది... అయినా ఆటను మధ్యలోనే ఆపారు. అది కూడా ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ (కేబీసీ) గేమ్‌లో మూడున్నర లక్షల రూపాయలు గెలుచుకున్నాక... హెల్ప్‌లైన్‌లు ఉన్నప్పటికీ అనూహ్యంగా ‘క్విట్‌’ అయ్యారు. ఆయన నిర్ణయానికి ‘బిగ్‌బీ’ అమితాబ్‌ ఆశ్చర్యపోయారు... ఆనక అభినందించారు. ఆ కంటెస్టెంట్‌ పేరు డాక్టర్‌ నీరజ్‌ సక్సేనా. ఎవరీయన? ఏమా కథ...

‘కౌన్‌ బనేగా...’ నీరజ్‌ సక్సేనా!

సత్తువుంది... మేధస్సుంది... అయినా ఆటను మధ్యలోనే ఆపారు. అది కూడా ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ (కేబీసీ) గేమ్‌లో మూడున్నర లక్షల రూపాయలు గెలుచుకున్నాక... హెల్ప్‌లైన్‌లు ఉన్నప్పటికీ అనూహ్యంగా ‘క్విట్‌’ అయ్యారు. ఆయన నిర్ణయానికి ‘బిగ్‌బీ’ అమితాబ్‌ ఆశ్చర్యపోయారు... ఆనక అభినందించారు. ఆ కంటెస్టెంట్‌ పేరు డాక్టర్‌ నీరజ్‌ సక్సేనా. ఎవరీయన? ఏమా కథ...

కొన్ని అరుదైన దృశ్యాలు అప్పుడప్పుడు వెలుగు చూస్తుంటాయి. అలాంటి అరుదైన దృశ్యమే.. ఈమధ్య ‘కేబీసీ’లో జరిగింది. హోస్ట్‌ అమితాబ్‌తో పాటు ప్రేక్షకులూ షాకయ్యారు. ఇప్పటిదాకా జరిగిన 16 సీజన్‌లలో కూడా అలాంటి సన్నివేశాన్ని అస్సలు ఊహించలేదు. ఒకరకంగా కేబీసీ కంటెస్టెంట్‌ నీరజ్‌ సక్సేనా వైరల్‌ కావటానికి కారణం ఆయన వ్యక్తిత్వమే! ఆ మంచి మనసుకు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు.


ఎవరీయన... ఏం జరిగింది?

నీరజ్‌ సక్సేనా ఒక సైంటిస్టు. సైన్సులో డాక్టరేట్‌ చేశారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంతో కలసి పని చేసిన వ్యక్తి. కలాం ప్రశంసలు అందుకున్న సైంటిస్ట్‌ కూడా. ‘కలాం నా ఫస్ట్‌ బాస్‌’ అంటూ ఈ షోలో చెప్పుకొచ్చారు. ‘ఆయనతో కలసి పని చేయటం వల్ల ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. ‘థింక్‌ బిగ్‌’ అనేది అబ్దుల్‌ కలాం మాట. ఆయన వల్లనే నా జీవితంలో మార్పు వచ్చింది’ అంటారీయన. నీరజ్‌ సక్సేనా పశ్చిమబెంగాల్‌కు చెందిన వ్యక్తి. తన సొంత రాష్ట్రంలోనిఅగర్పరా పట్టణంలో ఉన్న ‘జెఐఎస్‌’ విశ్వవిద్యాలయానికి ప్రో ఛాన్సలర్‌గా పని చేస్తున్నారు. విజ్ఞానం ఉంది. ధనం ఉంది. అయితే ఇతరులకూ అవకాశం కల్పించాలి.


ముఖ్యంగా తనొక్కరే ‘కేబీసీ’ హాట్‌సీట్‌ మీద కూర్చుని ఆడటం కన్నా పిల్లలకు అవకాశం ఇవ్వాలనుకున్నారు. అందుకే అమితాబ్‌ 11వ ప్రశ్న అడిగేందుకు సంసిద్ధం అవ్వగానే... ఒక్క క్షణంలో ‘క్షమించమం’టూ ఆట నుంచి వెను దిరిగారు. నిజంగా కేబీసీ చరిత్రలో ఇదో అరుదైన ఘట్టం. అద్భుతమైన సన్నివేశం. కేబీసీ ప్రారంభమై ఇరవై నాలుగేళ్లయ్యింది. అయితే ఇన్నేళ్లలో ఎవరూ ఇలా త్యాగం చేయలేదు. ఆటలో స్వార్థం లేకుండా క్విట్‌ కావటం ఆయన గొప్ప దనానికి నిదర్శనం. గురువులోని త్యాగశీలతే ఆయనతో ఈ పని చేయించిందని కొందరు కొనియాడుతున్నారు. అయితే ఇవేమీ పట్టించుకోలేదు నీరజ్‌ సక్సేనా.


నిరుపేదకు అవకాశం...

వినోదం, విజ్ఞానం ఇచ్చే ‘కౌన్‌బనేగా కరోడ్‌ పతి’కి రేటింగ్‌ ఎక్కువే. ఇలాంటి షోలో కోటి రూపాయలు గెలుచుకునే ప్రతిభ ఉన్నా సరే.. హాట్‌సీట్‌లోకి వచ్చి కూర్చోవటమే గొప్ప అన్నారు నీరజ్‌. ‘‘నాతో పాటు ఈ సీట్‌పైకి రావడానికి మిగతా పోటీదారులు కూడా వేచి చూస్తున్నారు. వాళ్లు నాకన్నా వయసులో చిన్నవారు. వాళ్లకు కూడా ఒక ఛాన్స్‌ ఇవ్వాలి కదా... నేనిప్పటికే కొంత డబ్బు గెలుచుకుని ఉన్నాను. కాబట్టి క్విట్‌ అవుతాను’ అన్నారు చిన్నగా నవ్వుతూ. డబ్బుల వెంట పరుగెత్తే ఈ రోజుల్లో ఇలా నిర్ణయం తీసుకోవటం గొప్ప విషయం. ‘కేబీసీలో ఇదివరకెన్నడూ చూడలేదు ఇలాంటి వ్యక్తిని. ఈ రోజు చాలా నేర్చుకున్నాం’ అంటూ అమితాబ్‌ కొనియాడారు.


మొత్తానికి 6 లక్షల 40 వేల రూపాయలు మాత్రమే సక్సేనా తన ఇంటికి తీసుకెళ్లారు. ఇకపోతే ఆయన త్యాగం వల్ల సోనియా రిజ్వాని అనే పేద అమ్మాయికి హాట్‌సీట్‌పై కూర్చునే అవకాశం వచ్చింది. ఆమె తన జీవితం గురించి చెప్పినప్పుడు సక్సేనా త్యాగం విలువ తెలిసింది. సోనియా తండ్రి ఆమె చిన్నప్పుడే తల్లితో పాటూ ఇంట్లో నుంచి గెంటేశాడు. ‘ఆడపిల్ల వద్దు అనే కారణంతోనే మా తండ్రి వదిలేశాడు. అనాఽథ శరణాలయాల్లో బతికాం’ అన్నదామె. మొత్తానికి నీరజ్‌ సక్సేనా క్విట్‌ అయినా.. తన వల్ల ఇంకో కుటుంబానికి సాయం చేశారు. హాట్‌సీట్‌లోని సోనియా రిజ్వానీ 3 లక్షల 20 వేల రూపాయలు గెలుచు కున్నారు. ఈ సంఘటన తర్వాత నీరజ్‌ సక్సేనా సెలబ్రిటీగా మారారు. గెలుపంటే తాను మాత్రమే గెలవడం కాదని, మిగతా వారికీ అవకాశం ఇవ్వాలనే గొప్ప సందేశాన్ని ఆయన ఈ షో ద్వారా అందించారు.

Updated Date - Nov 10 , 2024 | 09:06 AM