Viral: గంటలకొద్దీ ఒకే చోట నిలబడ్డ గుర్రంతో ఫొటో కోసం ట్రై చేస్తే.. !
ABN , Publish Date - Jul 23 , 2024 | 07:57 PM
కింగ్స్ గార్డు గుర్రం పక్కన నిలబడి ఫొటో దిగేందుకు ప్రయత్నించిన ఓ మహిళను గుర్రం కరిచిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. హెచ్చరిక బోర్డులను చూసి కూడా ఖాతరు చేయకపోతే ఇలాగే జరుగుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్ పర్యటనకు వచ్చే వివిధ దేశాల టూరిస్టులు అక్కడి రాయల్ గార్డ్స్‌ను (రాజభటులు) చూసేందుకు ఇష్టపడుతుంటారు. గుర్రాలపై ఠీవీగా ఉన్న వారితో సెల్ఫీలు దిగేందుకు ఎగబడుతుంటారు. ఇలా చేయొద్దని పక్కనే హెచ్చరిక సంకేతాలు ఉన్నా ఖాతరు చేయరు. వారి సమీపంలోకి వెళ్లి ఫొటోలు దిగే ప్రయత్నం చేస్తారు. చివరకు ఊహించని చిక్కుల్లో పడతారు. తాజాగా లండన్ మ్యూజియంలో ఇలాంటి ఘటన వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో (Viral) చూసి జనాలు షాకైపోతున్నారు.
Viral: ఫ్యాక్టరీ మూతపడ్డాక ఉద్యోగులు కనిపించట్లేదని ప్రకటన! ఎందుకో తెలిస్తే..
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, లండన్ మ్యూజియం వద్ద ఓ కింగ్స్ గార్డు గుర్రంపై కూర్చుని పహారా కాస్తున్నాడు. గుర్రం కరిచే ప్రమాదం ఉందన్న హెచ్చరిక రాసున్న బోర్డును ఆ పక్కనే గోడపై తగిలించారు. దాన్ని చూసినా కూడా టూరిస్టులు లెక్కచేయట్లేదు. ఈ క్రమంలో ఓ మహిళ గుర్రం పక్కగా నిలబడి ఫొటో దిగేందుకు ప్రయత్నించింది. ఈ లోపు గుర్రం సడెన్‌గా మహిళ చేయిని కరిచేసింది. ఆమె నొప్పితో విలవిల్లాడగా అప్రమత్తమైన గార్డు గుర్రాన్ని అదిలించడంతో అది మహిళను వదిలిపెట్టింది. దీంతో, మహిళ ఊపిరిపీల్చుకుంది (Kings Guard Horse Bites Tourist Trying To Get A Picture With It ).
వీడియోలో ఇదంతా చూసిన నెటిజన్లు మహిళనే తప్పు పడుతున్నారు. గోడ మీద ఉన్న హెచ్చరిక బోర్డును పట్టించుకోకపోతే ఇలాగే జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు, గుర్రాలకు శిక్షణ ఇచ్చే వాళ్లు కూడా ఈ ఘటనపై స్పందించారు. రాయల్ గార్డ్స్ ఆ గుర్రాలను కొన్ని గంటల పాటు ఒకే చోట నిలబెడతారని చెప్పారు. దీంతో, అవి తీవ్ర అసహనానికి లోనవుతుంటాయని అన్నారు. చిరాకులో ఉండే గుర్రాలు ఎవరైనా తమ సమీపంలోకి వస్తుంటే ప్రమాదంగా భావించి దాడికి దిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే, వీడియో మాత్రం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.