Share News

Richest village : ఆసియాలోనే సంపన్న గ్రామం భారత్‌లో.. ఎక్కడుందో తెలుసా..

ABN , Publish Date - Dec 18 , 2024 | 04:48 PM

ఆసియాలో అత్యంత సంపన్న గ్రామం ఇండియాలోనే ఉంటుందని కలలో కూడా ఎవరూ ఊహించి ఉండరు. దాదాపు 99 శాతం మందికి ఈ అరుదైన సంగతి తెలీనే తెలీదు. భారతదేశానికి గర్వకారణంగా మారిన ఆ పల్లెటూరిలో నివసించే వారిలో చాలామంది కోటీశ్వరులే. మరి, ప్రపంచంలో చాలా కొద్ది మందికే తెలిసిన ఆ ఊరు ఎక్కడుందో తెలుసా?

 Richest village : ఆసియాలోనే సంపన్న గ్రామం భారత్‌లో.. ఎక్కడుందో తెలుసా..
Asia's Richest Village

ప్రపంచంలో చాలా కొద్దిమందికే తెలిసిన ఆసక్తికరమైన విషయాలు చాలానే ఉన్నాయి. అలాంటిదే ఈ గ్రామం కూడా. సాధారణంగా అందరూ భారతదేశంలో ఉండే పల్లెటూరి ప్రజల్లో ఎక్కువగా పేదవారు, నిరక్షరాస్యులు అనుకుంటుంటారు. అందువల్ల ఆసియాలో అత్యంత సంపన్న గ్రామం ఇండియాలోనే ఉంటుందని కలలో కూడా ఎవరూ ఊహించి ఉండరు. దాదాపు 99 శాతం మందికి ఈ అరుదైన సంగతి తెలీనే తెలీదు. భారతదేశానికి గర్వకారణంగా మారిన ఆ పల్లెటూరిలో నివసించే వారిలో చాలామంది కోటీశ్వరులే. మరి, ప్రపంచంలో చాలా కొద్ది మందికే తెలిసిన ఆ ఊరు ఎక్కడుందో తెలుసా?


కొత్త ప్రదేశాల్లోని మనుషులు, సంప్రదాయాలు, వారి అలవాట్లు, అక్కడి వాతావరణం ఎవరినైనా ఆశ్చర్యపరుస్తాయి. ఇక ప్రయాణాలంటే ఎక్కువమంది నగరాలు, పర్యాటక ప్రాంతాలు లేదా విదేశాలకు వెళ్లేందుకే ఆసక్తి కనబరుస్తుంటారు. భారతదేశంలోని గ్రామాలు సందర్శించేందుకు వెళ్లే వారు అందుకు. విదేశాల నుంచి వచ్చేవారూ అంతగా ఆసక్తి చూపకపోవడం గమనించే ఉంటాం. భారతీయ గ్రామాల్లో నివసించే వారిలో ఆర్థికంగా బలంగా ఉండరనే బలమైన అభిప్రాయం చాలామందికి ఉంటుంది. అలాంటిది ఆసియా ఖండంలోనే అత్యంత సంపన్న గ్రామంగా పరిగణించబడుతున్న గ్రామం భారతదేశంలో ఉందంటే ఎవరైనా ఆశ్చర్యపోకుండా ఉండలేరు.


టాప్ ఇండస్ట్రియలిస్ట్‌లకు పెట్టింది పేరు గుజరాత్. ప్రపంచ కుబేరులుగా వెలుగొందుతున్న ముకేష్ అంబానీ, గౌతం అదానీలాంటి వారంతా ఈ రాష్ట్రానికి చెందినవారేనని తెలిసిందే. ఈ స్ఫూర్తి నగరాలకే కాదు. గుజరాత్‍‌లోని పల్లెటూళ్లకూ పాకింది. ఆసియాలో అత్యంత సంపన్నమైన గ్రామంగా పేరు తెచ్చుకున్న ఆ ఊరి పేరు మాధాపుర్. కచ్ జిల్లాలో ఉంది. అవడానికి మామూలు పల్లె అయినా, ఎటుచూసినా అందమైన ప్రకృతే పలకరిస్తుంది. స్వచ్ఛమైన గాలి, సరస్సులు, ఆహ్లాదకరమైన పార్కులు చూపరులను కట్టిపడేస్తాయి. ఆకాశాన్ని తాకే భవనాలు, హెల్త్‌సెంటర్లు, ఆటస్థలాలు సహా సకల ఆధునిక సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. చారిత్రక కట్టడాలు, ఆలయాలకు నెలవైన మాధాపుర్‌లో దాదాపు 20,000 ఇళ్లు ఉన్నాయి. మనలో చాలామంది పల్లెటూళ్లల్లో 2 లేదా 3 బ్యాంకులే ఉంటాయని అనుకుంటాం. కానీ, ఈ ఊళ్లోనేమో 7600 కుటుంబాలకుగాను ఏకంగా 17 బ్యాంకులు ఉన్నాయి. ఇక మాధాపుర్ గ్రామ ప్రజలకు బ్యాంకుల్లో ఉన్న ఫిక్సిడ్ డిపాజిట్ల మొత్తం ఎంతో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఏకంగా రూ.7000 కోట్ల పైమాటే.


ఆసియాలోనే అత్యంత ధనిక గ్రామంగా మాధాపుర్ మారటానికి గల కారణం ప్రవాస భారతీయులు. ఈ గ్రామంలో 20,000 కుటుంబాలు ఉండగా.. అందులో 1200 కుటుంబాల్లో ఎక్కువ సంఖ్యలో ఆఫ్రికా దేశాలకు వలస వెళ్లారు. మధ్య ఆఫ్రికాలో నిర్మాణ రంగంలో అధికమంది వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అమెరికా, యూకే, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లోనూ చాలామంది స్థిరపడ్డారు. వీరంతా ప్రతి ఏటా కోట్ల కొద్దీ డబ్బును కుటుంబీకుల పేరిట బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తుంటారు. అందుకే ఆసియాలో సంపన్న గ్రామం కాగలిగిందీ మాధాపుర్.

Updated Date - Dec 18 , 2024 | 04:49 PM