Viral: ఇండిగోపై ప్యాసెంజర్ ఆగ్రహం! రూ.45 వేల వస్తువులు పోగొట్టింది చాలక..
ABN , Publish Date - Aug 26 , 2024 | 03:34 PM
తాజాగా ఓ ఇండిగో ప్రయాణికుడికి దారుణ అనుభవం ఎదురైంది. దాదాపు 45 వేల రూపాయాల విలువైన వస్తువులు, ఇతర డాక్యుమెంట్లు ఉన్న తన బ్యాగు పోగొట్టి, చివరకు రెండున్నర వేల పరిహారం ఇవ్వచూపినందుకు సంస్థపై అతడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలంలో విమానయాన సంస్థలపై తరచూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఎయిర్ లైన్స్ సంస్థల సేవాలోపంతో విసిగిపోతున్న ప్రయాణికులు నెట్టింట దుమ్మెత్తిపోస్తున్నారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ ఇండిగో ప్రయాణికుడికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. దాదాపు 45 వేల రూపాయాల విలువైన వస్తువులు, ఇతర డాక్యుమెంట్లు ఉన్న తన బ్యాగు పోగొట్టి, చివరకు రెండున్నర వేల పరిహారం ఇవ్వచూపినందుకు సంస్థపై అతడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు (Viral).
Anand Mahindra: అప్పట్లో ఈ టెక్నిక్ తెలిసుంటే నేనే నెం.1 అయ్యేవాడిని: ఆనంద్ మహీంద్రా
మోనిక్ శర్మ అనే ప్రయాణికుడు ఎదుర్కొన్న అనుభవాన్ని అతడి స్నేహితుడు రవి హండా నెట్టింట పంచుకున్నాడు. ఎక్స్ వేదికగా అతడు పెట్టిన పోస్టుకు దాదాపు 3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. శర్మ బ్యాగులో డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటి పలు కీలక డాక్యుమెంట్లు ఉన్నాయని అతడు చెప్పుకొచ్చాడు (Man claims IndiGo offered Rs 2450 for lost bag with items worth Rs 45000 ).
‘‘రోజుకో కొత్త విధానంలో ప్రయాణికులు ఇక్కట్ల పాలవుతున్నారు. కోల్‌కతా-గువాహటీ విమానంలో ప్రయాణించిన నా ఫ్రెండ్ తన బ్యాగును పోగొట్టుకున్నాడు. అందులో దాదాపు రూ.45 వేల విలువైన వస్తువులతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ లాంటి కీలక డాక్యుమెంట్లు ఉన్నాయి. కోల్‌కతా ఎయిర్‌పోర్టులో లగేజీ చెకిన్ అయినట్టు వచ్చింది కానీ అది గువాహటీకి మాత్రం చేరుకోలేదు. మార్గమధ్యంలో లగేజీ ఎలా మాయమైందో అర్థం కావట్లేదు. ప్లేన్‌లోని బ్యాగులేమైనా కింద పడిపోతున్నాయా’’ అని హండా ఆగ్రహం వ్యక్తం చేశాడు.
బ్యాగు పోగొట్టింన ఇండిగో ఆ తరువాత ఆఫర్ చేసిన పరిహారంపై కూడా హండా విమర్శలు గుప్పించాడు. ‘‘బ్యాగు పోయిన దాదాపు నెల రోజుల తరువాత ఇండిగో సంస్థ పరిహారం కింద రూ.2,450 ఇవ్వచూపింది. ఇది నిజంగా హాస్యాస్పదం. కేవలం బ్యాగు ఖరీదే ఇంతకు మించి ఉంటుంది. ఎయిర్‌లైన్స్ సంస్థ నిబంధనల ప్రకారం, లగేజీ బరువుకు సంబంధించి కేజీకి రూ.350 మించి పరిహారం ఇవ్వరట. ఇది నిజంగా పుండు మీద కారం జల్లడమే. ఇండిగో సంస్థ ఈ విషయంలో స్పందించాలి’’ అని పోస్టు చేశాడు.
పోస్టు వైరల్ కావడంతో ఇండిగో సంస్థ స్పందించింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మరోమారు నెటిజన్లతో పంచుకున్నారు. ‘‘ఇండిగో సోషల్ మీడియా టీం నుంచి కాల్ వచ్చింది. అసలేం జరిగిందో లోతుగా పరిశీలిస్తామని చెప్పారు. నా స్నేహితుడి సమస్యకు త్వరగా పరిష్కారం లభించాలని ఆశిస్తున్నా’’ అని చెప్పుకొచ్చారు.
కాగా, ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్ష భోగ్లే కూడా ఇటీవల ఇండిగోపై ఫైరయ్యారు. ఓ వృద్ధ జంట రిజర్వ్ చేసుకున్న సీట్లను కాదని విమానం వెనకవైపు దూరంలో ఉన్న సీట్లను కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానంలో అంత వెనక వరకూ నడుస్తూ వెళ్లలేకే వారు దగ్గర్లోని సీట్లను ఎంచుకున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోకపోతే ఎలా ప్రశ్నించారు.