Viral: ఎంతో ముచ్చటపడి ఎలక్ట్రిక్ బైక్ కొంటే.. ఎలాంటి గతి పట్టిందో చూడండి!
ABN , Publish Date - Aug 19 , 2024 | 05:04 PM
తన ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్న కొద్ది రోజులకే పాడవడంతో ఓ వ్యక్తి విస్తుపోయాడు. స్కూటర్ సంస్థ రిపేర్ కూడా చేయకపోవడంతో మండిపడ్డ అతడు పాడైన స్కూటర్‌తో షోరూం ముందు నిరసనకు దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగిపోయింది. విద్యుత్‌తో నడిచే వాహనాల కోసం కాస్త అధిక ధర చెల్లించేందుకూ జనాలు వెనకాడట్లేదు. అయితే, కొందరికి ఈ సంబరం మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిపోతోంది. వాహనం కొన్న కొన్ని రోజులు, నెలలకే అది పాడవడంతో అనేక మంది తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ఇబ్బందిలో పడ్డ ఓ వ్యక్తి వినూత్న రీతిలో నిరసన తెలియజేస్తున్న వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో (Viral) కొనసాగుతోంది.
Viral: ఫిల్టర్ నీటితో స్నానం జుట్టు రాలడాన్ని తగ్గిస్తుందా..?
ఘటన ఎక్కడ జరిగిందీ తెలియకపోయినప్పటికీ ఈ ఉదంతం మాత్రం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. వీడియోలోని వ్యక్తి ఈ మధ్య కాలంలో ఓలా ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేశాడు. కానీ, అది కొన్న కొన్ని నెలలకే సమస్యలు మొదలయ్యాయి. దాన్ని రిపేర్ చేసేందుకు ఓలా సర్వీస్ సెంటర్ల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా ఉపయోగం లేకపోయింది. తన స్కూటర్ రిపేర్ కాకపోవడంతో విసిగిపోయిన ఆ వ్యక్తి చివరకు వినూత్న రీతిలో నిరసనలకు తెరలేపాడు (Mans hilarious song in front of electric scooter showroom after his EV breaks down).
పాడైన తన ఓలా స్కూటర్‌ను రిక్షాలో తీసుకొచ్చి సంస్థ షోరూం ఎదురుగా నిరసనకు దిగాడు. ఓ బాలీవుడ్ పాటను పాడుతూ తాను ఏ తప్పు చేశానని ఈ శిక్ష అంటూ నిలదీశాడు. పెద్ద స్పీకర్లతో పాటను ప్లే చేస్తూ నిరసన తెలియజేశాడు. గుండె మండిపోతోందని, సర్వం నష్టపోయాననే అర్థం వచ్చే పాటను పాడుతూ తన నిరసన తెలియజేశాడు.
కాగా, ఘటన నెట్టింట వైరల్ కావడంతో సదరు వ్యక్తికి మద్దతు పెల్లుబికింది. అనేక మంది అతడికి అండగా నిలిచారు. బాధితుడికి న్యాయం జరగాలంటూ కామెంట్లు పొటెత్తించారు. ఇక ఘటనపై ఓలా ఇంకా స్పందించలేదని తెలుస్తోంది. అయితే, స్కూటర్ యజమాని వినూత్న నిరసన మాత్రం నెట్టింట హాట్ హాటాపిక్‌గా మారింది.