Miss Japan: పెళ్లైన వ్యక్తితో అఫైర్.. మిస్ జపాన్ టైటిల్ వెనక్కి ఇచ్చేసిన సుందరి!
ABN , Publish Date - Feb 06 , 2024 | 04:35 PM
ఈ ఏడాది మిస్ జపాన్‌గా నిలిచిన 26 ఏళ్ల మోడల్ కరోలినా షినో ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌లో పుట్టి జపాన్‌లో పెరిగిన ఈ సుందరి తను గెలుచుకున్న ``మిస్ జపాన్`` టైటిల్‌ను వెనక్కి ఇచ్చెయ్యాలని నిర్ణయించుకుంది.
ఈ ఏడాది ``మిస్ జపాన్`` (Miss Japan)గా నిలిచిన 26 ఏళ్ల మోడల్ కరోలినా షినో (Karolina Shiino) ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌లో పుట్టి జపాన్‌లో పెరిగిన ఈ సుందరి తను గెలుచుకున్న ``మిస్ జపాన్`` టైటిల్‌ను వెనక్కి ఇచ్చెయ్యాలని నిర్ణయించుకుంది. దానికి కారణం ఆమె అఫైర్ (Affair) గురించి జపాన్ (Japan)లో తీవ్ర దుమారం చెలరేగడమే. రెండు వారాల క్రితం జపాన్‌లో జరిగిన అందాల పోటీల్లో కరోలినా ``మిస్ జపాన్`` కిరీటాన్ని కైవసం చేసుకుంది.
ఆ అందాల పోటీలకు సంబంధించి ఓ సంచలన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ పోటీలకు జడ్జిగా వ్యవహరించిన వారిలో తకుమా మేడా అనే ప్లాస్టిక్ సర్జన్ కూడా ఉన్నారు. పెళ్లై, పిల్లలను కూడా కలిగి ఉన్న తకుమాతో కరోలినాకు అఫైర్ ఉన్నట్టు తాజాగా బయటకు వచ్చింది. ఆ అఫైర్ కారణంగానే కరోలినాకు అనుకూలంగా తకుమా వ్యవహరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. కాగా, కరోలినా టైటిల్ గెలిచిన దగ్గర్నుంచి రకరకాల విమర్శలు వస్తున్నాయి.
కరోలినా జపాన్ సిటిజన్ అయినప్పటికీ, ఆమెలో సాంప్రదాయ జపనీస్ అందాలు లేవని, ఆమెను మిస్ జపాన్‌గా ఎందుకు ఎంపిక చేశారని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఆ విమర్శలు కొనసాగుతుండగానే తాజాగా ఈ అఫైర్ విషయం బయటపడింది. కాగా, అందాల పోటీల నిర్వాహకుల ముందు తన అఫైర్ విషయాన్ని కరోలినా అంగీకరించినట్టు సమాచారం. తన తప్పును అంగీకరించి టైటిల్ వెనక్కి ఇచ్చేసిన కరోలినా తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు క్షమాపణలు చెప్పింది.