రోడ్డుమీద ఫుడ్‌ట్రక్ జాతర..
ABN , Publish Date - Sep 29 , 2024 | 08:28 AM
వంట చేయడానికే కాదు.. తినడానికే టైమ్ లేదు.. అంటోంది నేటి తరం. ఎప్పుడు పడితే అప్పుడు.. ఎక్కడ పడితే అక్కడ గబగబా నాలుగు మెతుకులు తిని.. మూతి తుడుచుకుని.. పనులకు పరిగెత్తడమే జీవితమైనప్పుడు తప్పడం లేదు. అందుకే ఢిల్లీ నుంచి గల్లీ వరకు.. పుట్టగొడుగుల్లా ఫుడ్‌ట్రక్‌లు వచ్చేశాయ్!. అడగ్గానే క్షణాల్లో ఆహారపదార్థాలను అందించి.. ఆకట్టుకుంటున్నాయి.
వంట చేయడానికే కాదు.. తినడానికే టైమ్ లేదు.. అంటోంది నేటి తరం. ఎప్పుడు పడితే అప్పుడు.. ఎక్కడ పడితే అక్కడ గబగబా నాలుగు మెతుకులు తిని.. మూతి తుడుచుకుని.. పనులకు పరిగెత్తడమే జీవితమైనప్పుడు తప్పడం లేదు. అందుకే ఢిల్లీ నుంచి గల్లీ వరకు.. పుట్టగొడుగుల్లా ఫుడ్‌ట్రక్‌లు వచ్చేశాయ్!. అడగ్గానే క్షణాల్లో ఆహారపదార్థాలను అందించి.. ఆకట్టుకుంటున్నాయి. అందుకే మరి.. స్టార్‌హోటళ్లు సైతం ఫుడ్‌ట్రక్‌ల వ్యాపారంలోకి వచ్చేశాయి. ఇప్పుడీ బిజినెస్ భలే రుచికరంగా మారింది..
అది కోల్‌కతాని న్యూ టౌన్ క్లాక్ టవర్. వాతావరణం చల్లగా హాయిగా ఉంది. ఇళ్ల నుంచి బయటికొచ్చారంతా!. ‘ఇలాంటప్పుడు ఏదైనా వేడిగా తింటే ఎంత బావుంటుంది?’’ చెప్పింది భార్య. ‘‘మనం వెళ్లే దారిలోనే ఓ స్టార్‌హోటల్ ఉంది. అక్కడికెళ్లి వెరైటీ ఐటమ్స్ తిందాం’’ అన్నాడు భర్త. ‘‘స్టార్ హోటల్‌లోనా?’’ అంటూ ఆశ్చర్యంతోపాటు ఆనందంగా ఎగిరిగంతేశారు పిల్లలు.
ఆ స్టార్ రానే వచ్చింది. స్టయిలిష్ పెయింటింగ్‌తో ముచ్చటగొలిపే వ్యాన్ కొలువుదీరిందక్కడ. వెయిటింగ్‌లో ఉన్నారు జనం. అంత దూరం నుంచే గుప్పుమంటూ కమ్మటి వాసన తగులుతోంది. బహుశా చీజ్ ఐటమ్ అయ్యుండొచ్చు. వ్యాన్‌పైన పెద్ద పెద్ద అక్షరాలతో ‘జేడబ్ల్యు మారియట్’ అని రాసుంది. ‘ఇదే మన స్టార్ హోటల్’ అంటూ భార్యాపిల్లలకు చూపించాడు భర్త. ‘అవును, స్టార్ హోటల్ మారియట్ వాళ్లదే ఈ ఫుడ్‌ట్రక్. భలేగుందే! మేమెప్పుడూ చూడలేదు..’’ అంటూ మెనూకార్డు తీసుకున్నారు భార్యాపిల్లలు. అందులో గబగబా వెదికి ‘ఒక చికెన్‌టిక్కా కథీ రోల్, తంగ్రా స్టయిల్ చిల్లీ చికెన్, ఫ్రైడ్ ఫిష్, బ్లూబెర్రీ చీజ్ కేక్..’ అంటూ ఆర్డర్ చేశారు. ఐటెమ్స్ అన్నీ టేబుల్‌పైకి వచ్చేశాయి. వర్ణించలేనంత రుచి. అచ్చం స్టార్‌హోటల్‌లో తిన్న అనుభూతి. రుచీ శుచీ.. తిరుగులేదు. ఆఖర్న భయపెట్టేంత బిల్లు కూడా రాలేదు.
ఒకవేళ ఇదే తిండి స్టార్‌హోటళ్లలో తినుంటే మూడురెట్లు ఎక్కువ ఖర్చు అయ్యేది. కోల్‌కతాలోని ఐటీ ఉద్యోగులు, కాలేజీ విద్యార్థులు, యువతీ యువకులతో పాటు మధ్యతరగతి కుటుంబాలన్నీ మారియట్ ఫుడ్‌ట్రక్ వద్దకు వచ్చి.. ఆరుబయట కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ.. ఇష్టమైన ఐటమ్స్‌ను తిని వెళుతున్నారు. ఇలాంటి దృశ్యం ఒక్క కోల్‌కతాకే పరిమితం కాదు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి, కరీంనగర్, ఖమ్మంలతోపాటు.. దేశవ్యాప్తంగా కనిపిస్తోందిప్పుడు. ఎక్కడ రద్దీ కూడలి ఉంటే అక్కడ ఓ అందమైన ఫుడ్‌ట్రక్ ప్రత్యక్షమవుతోంది. ‘మీల్స్ ఆన్ వీల్స్’ అంటూ కావాల్సిన ఆహారపదార్థాలను అందిస్త్ను ఈ ట్రక్స్ ఏటికేడు పెరుగుతున్నాయి.
దేశవ్యాప్తంగా ఈ పదేళ్లలో.. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఫుడ్‌ట్రక్‌లకు కొదవలేదు. జాతీయరహదారుల వెంబడి కూడా వెలిశాయి. ఎంత ఖరీదైన హోటళ్లు అయినా మార్కెట్‌ను అందిపుచ్చుకోవాలంటే.. కొత్త ట్రెండ్‌లోకి అడుగుపెట్టక తప్పదు. అందుకే స్టార్‌హోటళ్లు సైతం ఫుడ్‌ట్రక్‌లను ఏర్పాటుచేస్తేకానీ బ్రాండ్ విస్తరణకు అవకాశం ఏర్పడదు. లేకపోతే లాభదాయకంగా మారిన స్ట్రీట్‌ఫుడ్ వ్యాపారం కోల్పోవాల్సి వస్తుంది.
ఇలా మొదలైంది..
ఫుడ్‌ట్రక్ అనేది పురాతన రోమ్‌లో పుట్టిందనే చెప్పవచ్చు. అప్పట్లో అక్కడ పురాతన ఆహారబండ్లు ఉండేవి. వీటిద్వారా చౌకఽధరల్లో కూలీలకు భోజనాన్ని అందించి ఉపాధిపొందే వర్గం ఉండేది. పాత కాలంలో మన దగ్గర పూటకూళ్లమ్మల్లాగ అన్నమాట!. ఇలా రాను రాను కాలంతోపాటు ఆహారబండ్ల స్వరూపం మారుతూ వచ్చింది. శ్రామికవర్గం ఆకలితో అలమటించకుండా ఇలాంటి ‘మొబైల్ కిచెన్’లు అవసరమని ప్రపంచం గుర్తించింది. ఇప్పుడు మనకు రోడ్ల పక్కన కనిపించే ఫుడ్‌ట్రక్‌లు అలనాటి రోమ్ నగర ఆహారబండ్ల నుంచే ఉద్భవించాయన్నది చరిత్రకారుల అభిప్రాయం. ఆ తర్వాత కాలంలో వీటికి ‘చక్‌వాగన్’లన్న పేరొచ్చింది. ఆహారవంట సామాగ్రితో కూడిన బండి ఇది. గొర్రెలు, పశువులను పోషించే కాపర్లు, పొలాల్లో పనిచేసే కూలీలకు చక్‌వాగన్‌లు తిండిని విక్రయించేవి.
యజమానులు లేదా కూలీల వద్ద నుంచే ఆదాయం వచ్చేది. 1890 ప్రాంతంలో అమెరికాలో ఇవి బాగా పెరిగాయి. ఉడకబెట్టిన బీన్స్, మాంసం వేపుడు, ఆకుకూరలు,-కూరగాయలతో చేసిన వంటలు, కాఫీలు, బిస్కెట్లు, మంచినీళ్లు, కలపను చక్‌వాగన్‌లలో అమ్మేవారు. ఆశించినంత ఆదాయం వచ్చేది. శతాబ్దం తర్వాత.. విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులకు ఆహారపదార్థాలను విక్రయించడం ప్రారంభించాయి. యువతకు ఇష్టమైన హాట్‌డాగ్స్, బార్బిక్యు, సాసెజ్ వంటివన్నీ ఎక్కువగా అమ్ముడయ్యేవి. యేల్, ప్రిన్స్‌టన్, హార్వర్డ్ వంటి ప్రసిద్ధ ప్రాచీన విశ్వవిద్యాలయాల వెలుపల పలు ఫుడ్‌ట్రక్‌లు వచ్చేశాయి. వీటిలో విక్రయించే ఆహారపదార్థాలను అమెరికాలోని విశ్వ విద్యాలయ విద్యార్థులు అమితంగా ఇష్టపడేవారు. అందుకే అప్పట్లోనే ఫుడ్‌ట్రక్‌లు ట్రెండింగ్‌లో నిలిచాయి.
ఫుడ్‌ట్రక్‌ల ఆస్కార్..
‘ఆస్కార్ మేయర్’.. అమెరికాలోని చికాగో వాసులందరికీ సుపరిచితమైన పేరు. మాంసంతోపాటు వాటి ఆధారిత ఉత్పత్తులైన హాట్‌డాగ్, బొలోగ్నా, బేకన్, హామ్‌లను విక్రయించే అతి పెద్ద సంస్థ. అప్పట్లో (1873) ఆస్కార్‌మేయర్ మాంసం దుకాణాల్లో పనిచేసేవాడు. పద్నాలుగేళ్ల వయసు నుంచే మాంసాన్ని కొట్టడం, ప్యాక్ చేయడం, విక్రయించడం ఆయన వృత్తి. చిన్నప్పుడే అబ్బిన వ్యాపారవిద్యతో 1936లో ‘వీనర్ మొబైల్’ అనే ఫుడ్‌ట్రక్‌ను ఏర్పాటు చేశాడు. అందులో మాసంతో వండిన హాట్‌డాగ్‌లు, బేకన్, హామ్‌లను అమ్మడం మొదలెట్టాడు. అప్పటికి అది కొత్త కాబట్టి వ్యాపారం అనూహ్యంగా పుంజుకుంది. ఈ చేత్తో అమ్మడం.. ఆ చేత్తో డాలర్లను తీసుకోవడం.. ఎక్కడా ఆగలేదాయన. ‘ఇదేదో బాగుందే.. అమెరికా మొత్తం విస్తరిస్తే ఇక తిరుగుండదు...’ అని కలలు కన్నాడు. ప్రణాళిక రచిస్తుండగానే రెండో ప్రపంచ యుద్ధం ముంచుకొచ్చింది.
ప్రజలకు తినడానికి తిండిలేదు. తీవ్ర ఆహారకొరత ఏర్పడింది. యుద్ధ బాధితుల ఆకలిమంటను చూస్తుంటే ఆస్కార్‌మేయర్ కడుపు తరుక్కుపోయింది. మరిన్ని ‘వీనర్ మొబైల్’ ఫుడ్‌ట్రక్‌లను తయారుచేశాడు. వాటి నిండా ఆహారపదార్థాలను నింపుకుని.. పాఠశాలలు, ఆనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, ఆస్పత్రులు, పబ్లిక్‌పరేడ్స్‌లకు వెళ్లి.. ఉచితంగా అన్నదానం చేశాడు. అనతికాలంలోనే పాపులారిటీ అమాంతం పెరిగింది. ఎవరైనా ఎక్కడైనా ఆకలితో అల్లాడుతుంటే.. అక్కడ ఆస్కార్ ఆహారబండి ఒకటి ఉండేంది. వీనర్ మొబైల్ అనబడే ఫుడ్‌ట్రక్‌లు ఒక్క అమెరికాలోనే కాదు.. ప్రపంచాన్ని ఆకర్షించడానికి రెండో ప్రపంచ యుద్ధం కూడా ఒక కారణం అయ్యింది. ఒక రకంగా చెప్పాలంటే ఫుడ్‌ట్రక్‌ల ఆలోచన మరింత విస్తరించేందుకు, జనామోదం పొందేందుకు ఆస్కార్‌మేయర్ పాత్ర ఎనలేనిది.
ఇంకేముంది? వీనర్‌లను పోలిన బుల్లి ఐస్‌క్రీమ్ బండ్లు రోడ్ల మీదికి వచ్చేశాయి. ఇప్పుడు మన వీధుల్లో కనిపించే ఐస్‌క్రీమ్ బండ్ల వాళ్లు పీకలు ఊదినట్లే.. ఆ రోజుల్లో ఆటపాటలతో విజిళ్లు కొడుతూ ఆకర్షించేవాళ్లు. ఆ సందడిని గుర్తించిన పిల్లలు ఐస్‌క్రీమ్‌ల కోసం పరిగెడుతూ వీధుల్లోకి వచ్చేవారు. ఐస్‌క్రీమ్ బండ్లు ఎప్పుడైతే ఆకట్టుకున్నాయో.. అప్పుడు మెల్లగా ఫుడ్‌ట్రక్‌లు బయలుదేరాయి. వాటిలో శాండ్‌విచ్‌లు, హాంబర్గర్స్, సాఫ్ట్‌డ్రింక్స్, కాఫీ, జ్యూస్‌లు, హాట్‌డాగ్స్, చికెన్, టాకోలు, పిజ్జాలు, ఫ్రెంచ్‌ప్రైస్ వంటివన్నీ అమ్మడం మొదలైంది.
అమెరికా వీధుల్లో..
కాలం మారింది. ఏళ్లు గడుస్తున్నాయి. ఫుడ్‌ట్రక్‌లకు ఎక్కడా బ్రేక్‌లు పడలేదు. ఎప్పటికప్పుడు కొత్త అవతారం ఎత్తుతూనే ఉన్నాయి. ఔత్సాహిక వ్యాపారవేత్తలు వస్తూనే ఉన్నారు. అందుకు నిదర్శనమే అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌కు చెందిన రౌల్‌మార్టినెజ్. ఇతనో మెక్సికన్ ఫుడ్‌పెడ్లర్. 1970లో లాజ్‌ఏంజెల్స్‌లోని స్ట్రీట్‌ఫుడ్ ధోరణినే మార్చేయాలని కంకణం కట్టుకున్నాడు. ఎడాపెడా ఫుడ్‌ట్రక్‌లను తయారుచేసి.. లాస్‌ఏంజెల్స్ వీధుల్లోకి తీసుకొచ్చాడాయన. అప్పటికి ఆ నగరంలో ఎక్కువమంది సంపన్నవర్గమే ఉంది. వాళ్లు వీధుల్లోని బండ్లపై ఆహారపదార్థాలను కొనడానికి నామోషీగా భావించారు. రౌల్‌కు పరిస్థితి అర్థమైంది. వెంటనే ఆలోచన మార్చుకున్నాడు. పాత ఐస్‌క్రీమ్ వ్యాన్‌లను కొని.. వాటిని టాకో కార్నర్‌ర్లుగా మార్చేశాడు. ఆ ఫుడ్‌ట్రక్‌లకు ఆయన పెట్టిన పేరు ‘కింగ్ టాకో’. ఈసారి సంపన్నవర్గం నివసించే వీధుల్లో కాకుండా.. మద్యం విక్రయించే బార్‌ల వద్ద బండ్లను పెట్టాడు.
మన తెలుగు ప్రాంతాల్లో కనిపించే బొరుగుల బండ్లు, ముంతకింద పుప్పుల్లాంటివే ఇవి. అమెరికాలో కొన్ని చోట్ల నేటికీ టాకోలకు అత్యధిక డిమాండ్ ఉంది. ఫుడ్‌ట్రక్‌ల చరిత్రపై పుస్తకం రాస్తే.. టాకోలకు కొన్ని పేజీలు కేటాయించాల్సిందే! టాకో.. మెక్సికన్ స్ట్రీట్‌ఫుడ్. మొక్కజొన్న, గోధుమ పిండి ద్వారా అరచేతిలో పట్టేంత రొట్టెలను చేస్తారు. ఆ రొట్టెల మధ్యలో ఉడికించిన మాంసం లేదా చికెన్‌తో పాటు ఆకుకూరలు, కూరగాయలు, పచ్చిమిరప, ఉల్లి , కొత్తిమీర తరుగును కుప్పగా పేరుస్తారు. రొట్టెను తుంచుకుని, ఆ తరుగును కలుపుకుని తింటారు. నమిలితే కానీ ఆ రుచి తెలియదు అంటారు అమెరికన్లు, మెక్సికన్లు. అందుకే ‘టాకో’లు ప్రపంచవ్యాప్తంగా అంత ఫేమస్ అయ్యాయి. ముఖ్యంగా మద్యం ప్రియులకు మందులోకి నంజుకుని తినేందుకు మహా రుచిగా ఉంటుంది. ధర కూడా తక్కువే!. ఆ వ్యాపార కిటుకు తెలుసుకున్న రౌల్‌మార్టినెజ్ ‘కింగ్‌టాకో’ల పేరుతో ఫుడ్‌ట్రక్‌లను బార్‌ల ఎదురుగా పెట్టాడు. ‘‘నేను ఫుడ్‌ట్రక్‌లు ప్రారంభించిన తొలినాళ్లలోనే గంటకు 70 డాలర్లు సంపాదించేవాణ్ణి. కొన్ని నెలల్లోనే నా వ్యాపారం ఊహించనంత ఎత్తుకు ఎదిగింది..’’ అన్నాడాయన. ఆ తర్వాత కాలిఫోర్నియాకు తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు.
బొరుగులబండిలాంటి ‘కింగ్‌టాకో’లు ఫుడ్‌ట్రక్‌ల స్వరూపాన్నే మార్చేశాయి. రౌల్ మార్టినెజ్ స్ఫూర్తితో అనేకమంది తిండిబండ్ల వ్యాపారంలోకి అడుగుపెట్టారు. న్యూయార్క్‌లోని రిక్షాడంప్లింగ్ బార్ ఎదురుగా కోజీ బీబీక్యు వెలిసింది. చూస్తుండగానే ఫుడ్‌ట్రక్‌ల విప్లవం తారాస్థాయికి చేరింది. శాండ్‌విచ్‌లు, బర్గర్లు, పిజ్జాలు, రోల్స్, హాట్‌డాగ్స్, ఫ్రెంచ్‌ప్రైస్.. ఇలా రకరకాల ఆహారపదార్థాలను వీధుల్లో వడ్డించాయి ఫుడ్‌ట్రక్‌లు. 2008 నాటికి అమెరికా అంతటా వచ్చేశాయి. ప్రజల జీవనశైలిలో మార్పులు, బిజీ ఉద్యోగాలు, వండుకునే సమయం లేకపోవడం, హోటళ్లలో ధరల భారం.. ఇవన్నీ జనాన్ని ఫుడ్‌ట్రక్‌లవైపు మళ్లించాయి. ఇదొక నయాట్రెండ్‌గా మారింది. ఏకంగా ఫుడ్‌ట్రక్‌లపైన ‘చెఫ్’ అనే చిత్రం కూడా వచ్చింది. రెస్టారెంట్‌లో చెఫ్‌గా చేస్తున్న ఓ యువకుడికి ఉద్యోగం పోయాక.. అతని పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని నిరూపించుకునేందుకు ఫుడ్‌ట్రక్‌లో బయలుదేరి అమెరికా అంతటా తిరుగుతాడు. ఆయనలాగే ఇప్పుడు చాలామంది యువతీయువకులు ఉద్యోగాలు మానేసి ఫుడ్‌ట్రక్‌లపైన దోశలు, ఇడ్లీలు అమ్ముతూ సంపాదిస్తున్న దృశ్యాలను నిజజీవితంలో చూస్తున్నాం.
మన దగ్గర..
హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ, శిల్పారామం, ఫైనాన్సియల్ డిస్ట్రిక్, డీఎల్‌ఎఫ్, ఫిల్మ్‌నగర్... ఇలా ఏ సెంటర్‌లో చూసినా... ఓ నాలుగైదు ఫుడ్‌ట్రక్‌లు కనిపిస్తాయి.. వీటిలో ఇడ్లీ, దోశలతో పాటు రోటీలు, కర్రీలు, బిర్యానీలు.. ఇలా దొరకని ఐటమ్ అంటూ ఉండదు. వ్యాన్ ముందు అలా నిల్చోగానే.. ఇలా చేతిలోకి ఫుడ్‌ఐటమ్ వచ్చేస్తుంది. గబగబా తినేసి వెళ్లాల్సిన చోటకు వెళ్లొచ్చు. ఏం తిన్నా రేటు కూడా తక్కువే!. అందుకే ఏ ఫుడ్‌ట్రక్ దగ్గర చూసినా ఒకటే రద్దీ. ఇంత డిమాండ్ ఉన్నప్పుడు పెద్ద సంస్థలు ఇందులోకి రాకుండా ఉంటాయా? వచ్చేశాయి. చెయిన్ సిస్టమ్ ద్వారా కొత్త కొత్త సంస్థలు వస్తూనే ఉన్నాయి. మన దేశంలో ఫుడ్‌ట్రక్‌ల ట్రెండ్ తొలుత ఢిల్లీలో మొదలైంది. 1977లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్ ఫ్యాకల్టీ పక్కన లేత పసుపు-తెలుపు రంగుల్లో ఓ ఫుడ్‌ట్రక్ ప్రత్యక్షమైంది. ఆ తర్వాత ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ (డి-స్కూల్) వద్దకు వచ్చేసింది. తిండి కోసం విద్యార్థులు ఎగబడ్డారు.
అప్పటికిది కొత్త కాన్సెప్ట్ కాబట్టి ఢిల్లీ వాసులను ఇట్టే ఆకట్టుకుంది. పత్రికల్లో ఆసక్తికర కథనాలు వచ్చాయి. మీల్స్ ఆన్ వీల్స్.. జనంలోకి బాగా వెళ్లింది. మెల్లమెల్లగా ఇతర రాష్ట్రాలకు పాకిందీ వ్యాపారం. తక్కువ పెట్టుబడి, తక్షణ లాభాలు, ఎక్కడ రద్దీ ఉంటే అక్కడికి వెళ్లే వెసులుబాటు, చిన్న పట్టణాల్లో సైతం నడిపే సౌలభ్యం.. ఇవన్నీ ఫుడ్‌ట్రక్‌ల బిజినెస్‌కు కలిసొచ్చాయి. ఆధునిక తరం అభిరుచులకు అనుగుణంగా ఆహారపదార్థాలనే కాదు.. ఫుడ్‌ట్రక్ వ్యాన్‌లను కూడా డిజైన్ చేస్తూ వచ్చారు యజమానులు. ఈ ట్రెండ్ దేశ రాజధాని ఢిల్లీలో బాగా పాపులర్ అయ్యింది. అక్కడ ఏకంగా ఫుడ్‌ట్రక్ ఫెస్టివల్స్ వెలిశాయి. పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు ఇందులో భాగస్వాములు.
హార్న్ ఓకే ప్లీజ్ పేరుతో నిర్వహించే ఆహారవేడుకలో జపనీస్, చైనీస్, థాయ్, మెక్సికన్, ఇటాలియన్, ఇండియన్, పంజాబీ వంటల్ని అందించాయి ఫుడ్‌ట్రక్‌లు. దేశీబర్గర్, ముంబయి వడాపావ్, హాట్‌డాగ్స్ వంటివన్నీ బాగా అమ్ముడయ్యాయి. ఈ వ్యాపారం ఎంత ప్రాధాన్యతను సంతరించుకుందంటే.. ఫుడ్‌ట్రక్‌లను థీమ్, కాన్సెప్ట్‌లతో రూపొందించడం, ఉద్యోగులు యూనిఫాం ధరించడం, ఖరీదైన వాణిజ్య ప్రకటనలు ఇవ్వడం, నగరాల్లోని పెద్ద పెద్ద కూడళ్లలో బిల్‌బోర్డుల ద్వారా ప్రచారం చేసేదాకా వెళ్లింది. కొన్నిచోట్ల ఆరుబయట సంగీతోత్సవం మధ్య ఫుడ్‌ట్రక్‌లను నిర్వహించడం నయా ధోరణిగా మారింది.
స్టార్‌హోటళ్లు సైతం..
భారత్‌లో మీల్స్ ఆన్ వీల్స్ నగరాల నుంచి పట్టణాలకు సైతం చేరుకుంది. ఇప్పటికే పేరున్న హోటళ్లతోపాటు, కొన్ని సంస్థలు చైన్‌సిస్టమ్‌తో పలు ప్రాంతాల్లో ఫుడ్‌ట్రక్‌లను నడుపుతున్నాయి. ముంబయిలోని ఇండియన్ హోటల్స్ కంపెనీ క్యుమిన్ ఫుడ్‌ట్రక్‌ను ఏర్పాటు చేసింది. నివాసప్రాంతాలు, ఐటీ ఉద్యోగులే లక్ష్యం. గోవాలోని మారియట్ హోటల్ వాళ్లు కూడా జీబీసీ ఆన్ వీల్స్ పేరుతో ఈ విభాగంలో చేరారు. లలిత్ ఫుడ్ ట్రక్ కంపెనీ అయితే ఏకంగా... ఢిల్లీ, ముంబయి, జైపూర్, బెంగళూరులలో ఆహారవాహనాలను ఏర్పాటు చేసింది. కార్పొరేట్ కార్యాలయాలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల వద్ద ఎక్కువగా ఫుడ్‌ట్రక్‌లను పెట్టింది. వేడుకలు, కిట్టీ పార్టీలకు సైతం ఆర్డర్లు తీసుకుని తిండిని సరఫరా చేస్తోందీ లలిత్. ‘వెరైటీ ఫుడ్, చౌకధరలు, క్విక్ సర్వింగ్.. ఇవే ఫుడ్‌ట్రక్‌ల విజయానికి మూలసూత్రాలు. వీటిని విస్మరిస్తే ఈ వ్యాపారంలో నిలబడలేం‘ అంటారు ఆ గ్రూప్ ఉన్నతోద్యోగులు.
ఇక, బెంగళూరులోని జిప్సీ కిచెన్ అయితే పలుచోట్ల ఫుడ్‌ట్రక్‌లను ఏర్పాటు చేసింది. స్పైసీ చికెన్ శాండ్‌విచ్, బీబీక్యు చికెన్ బర్గర్‌లను వేడివేడిగా, రుచికరంగా అందించడం వీరి ప్రత్యేకత. అహ్మదాబాద్‌లో ఆటోరిక్షానే ఫుడ్‌ట్రక్‌గా అలంకరించి మసాలాకప్ ఇడ్లీ, చట్‌పట్టా నాచోస్ వంటివన్నీ విక్రయిస్తోంది సౌత్ 2 మౌత్ కంపెనీ. ఫుడ్‌ట్రక్‌లకు ఢిల్లీ తర్వాత ముంబయి పెట్టింది పేరు. ఆ మహానగరంలో ఎరుపురంగు వ్యాన్ కనిపించిందంటే చాలు... యువతీ యువకులు, ఉద్యోగులు అక్కడ వాలిపోతుంటారు. ఎందుకంటే అక్కడికి వచ్చింది బాంబే ఫుడ్ ట్రక్ మరి. స్థానిక ఆహారప్రియుల హృదయాన్ని దోచుకున్న ట్రక్ అది. నగరంలో పలు చోట్ల వీటిని ఏర్పాటు చేశారు. పుణెలోని ద చీజ్ ట్రక్ ది మరో ప్రత్యేకత. పసుపురంగును పులుముకుని ప్రతి రోజూ సీసీడీ కూడలిలో కనిపించే ఈ ఫుడ్‌ట్రక్ చీజ్ ఉత్పత్తుల్ని అమ్ముతోంది. నోయిడాలోని ఓహ్ బాయ్ ఫుడ్‌ట్రక్ కూడా అమెరికన్, మెక్సికన్ ఆహారపదార్థాలను అందిస్తోంది.
ఆన్‌లైన్ ఆర్డర్లను సైతం స్వీకరిస్తుంది. హైదరాబాద్‌లోని పరాటావాలాస్ అండ్ గ్రిల్స్, చండీగఢ్‌లోని దేశీ ఫిరంగి, ముంబయిలోని ఈట్ అండ్ రన్, బెంగళూరులోని రోడ్‌కిల్, గుర్‌గ్రామ్‌లోని ఢిల్లీ ఫుడ్‌ట్రక్,.. ఇలా చెప్పుకుంటూపోతే చాలానే ఉన్నాయి. వీటికున్న డిమాండ్ రీత్యా ఫుడ్‌ట్రక్‌లను యజమానులకు నచ్చినట్లు అందంగా తయారుచేసే కంపెనీలు సైతం పుట్టుకొచ్చాయి., అందులో ఒకటి అజిముత్ సంస్థ. నోయిడా, గోవా, తమిళనాడులలో తయారీ శాఖలను ఏర్పాటు చేసుకుంది. స్టార్‌బక్స్, చాయ్‌పాయింట్, హోమ్‌చెఫ్, నెస్‌కెఫె, డాబర్, రూట్స్, పన్సారీ, జిగ్లీ, వెల్‌వెట్ స్పా వంటి అనేక సంస్థలకు ఫుడ్‌ట్రక్‌లను తయారుచేసిందీ అజిముత్ కంపెనీ. శుచీ, శుభ్రత, రుచీ, నాణ్యత, నమ్మకం ఇవన్నీ కలగలిపి నడిపితే... ఫుడ్‌ట్రక్‌ల వ్యాపారం లాభదాయకమే. ఆ దిశగా ప్రస్తుతం ఫుడ్‌ట్రక్‌లు దూసుకుపోతున్నాయి.
- సండే డెస్క్