ఆగాకరతో రాజభోజనం..
ABN , Publish Date - Oct 06 , 2024 | 09:30 AM
విరాజు వత్సవాయి నీలాద్రిరాజ కవి పద్యం ఇది. 1971మార్చి భారతిలో నిడదవోలు వెంకటరావుగారు దీన్ని ఉదహరించారు. మనోహరమైన మొగలి పూలరేకుల పరిమళభరిత వంటకాలకన్నా కొవ్వుపోలున్న మాంసాన్ని మర్రిపండ్లతో ఉడికించి, ఆగాకర ముక్కలు వేసి వండిన కూర రాచవారికి రాజభోజనం...ట! ఆగాకర, దొండ, ఆదొండ, వేదొండ కాయలు మెండుగా దొరికే ఊరు నివాస యోగ్యం అని సూక్తి. ‘కకారాష్టక ఫలా’లని 8 రకాల కాయగూరలున్నాయి.
‘‘కేకికచాకచోచ్చయ వికీర్ణమనోహర కేతకీదళ
స్వీకృత నూత్నసౌరభ విశేషముకంటెను మఱ్ఱిపండ్లచే
మైకొని క్రొవ్వుపోలుగుల మాంసముతో పరిపక్వమైన యా
గాకర కాయకూర నవకమ్మగు నామెత రాచవారికిన్’’
కవిరాజు వత్సవాయి నీలాద్రిరాజ కవి పద్యం ఇది. 1971మార్చి భారతిలో నిడదవోలు వెంకటరావుగారు దీన్ని ఉదహరించారు. మనోహరమైన మొగలి పూలరేకుల పరిమళభరిత వంటకాలకన్నా కొవ్వుపోలున్న మాంసాన్ని మర్రిపండ్లతో ఉడికించి, ఆగాకర ముక్కలు వేసి వండిన కూర రాచవారికి రాజభోజనం...ట! ఆగాకర, దొండ, ఆదొండ, వేదొండ కాయలు మెండుగా దొరికే ఊరు నివాస యోగ్యం అని సూక్తి. ‘కకారాష్టక ఫలా’లని 8 రకాల కాయగూరలున్నాయి. కూష్మాండం (బూడిద గుమ్మడి), కర్మటీ (దోస), కాళింగం (పుచ్చకాయ), కారవేల్లకం (కాకర), కుసుంభకం (కుసుమమొక్క), కర్కోటం (ఆగాకర), కదలీ (అరటి), కాకమాచి (కామంచి) ఈ ఎనిమిదీ పుష్టికరాలని శాస్త్రం! వీటిలో ఆగాకర విశిష్టమైనది! ముళ్ళకాకర, బుడిపికాకర, మట్టుకాకర ఇలా తెలుగువాళ్లు దీన్ని పిలుచుకుంటారు.
అడవి కాకర జనవ్యవహారంలో ఆగాకర అయి ఉంటుంది. ఇది తోటలు వేసి పండించేది కాదు. కాబట్టి నూరుశాతం ఆర్గానిక్. ఆకుపచ్చ రంగుతో ముళ్లుముళ్లుగా గుండ్రంగా ఉంటుంది. కాకర కన్నా ఆగాకరకు ఒక అక్షరం ఎక్కువున్నట్టే, రుచి, గుణాలు కూడా ఒకింత ఎక్కువే! చేదు తక్కువ, వగరు ఎక్కువ. పోషకాలతోపాటు, క్యాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం బాగా ఉన్నాయి.
షుగరు, స్థూలకాయాలలో ఆగాకర ‘గ్రీన్ మెడిసిన్’గా పనిచేస్తుంది. సింథటిక్ మందుల కన్నా ఇది మెరుగు. అమీబియాసిస్, విరేచనాలు, ఎలర్జీలు, ఉబ్బసం, తుమ్ములు, కుష్టు, బొల్లి, సొరియాసిస్, ఎగ్జిమాల్లో ఇది ఔషధం. గ్యాసుని తగ్గించి జీర్ణశక్తి పెంచుతుంది. నొప్పుల్ని, వాపుని కూడా తగ్గిస్తుంది. కీళ్లవాత రోగులు మసాలాలు, చింతపండు లేకుండా వండుకుంటే మంచిది! శరీరంలో విషదోషాల్ని హరిస్తుంది. కొవిడ్ లాంటి వైరస్ వ్యాధులు విపరీతం అయినప్పుడు ఆగాకర కూరని తరచూ తింటూ ఉంటే ఇమ్యూనిటీ బూస్టరుగానూ.. పాము, తేలు, విషపు కీటకాలు, కుక్క కాట్లకు విరుగుడుగానూ పనిచేస్తుంది. ఎంతకూ మానని పుండ్లతో బాధపడేవారు తరచూ ఆగాకర తింటూ ఉంటే పుళ్లు త్వరగా తగ్గుతాయి. ఆగకుండా వచ్చే ఎక్కిళ్లు ఆగుతాయి.
ఆగాకర కాయ లోపల గింజలు, గుజ్జు కలిపి గట్టిగా కూరినట్టుంటుంది. చిన్న గోళీకాయంత ఆగాకరలో పెద్ద కాకర కాయ కుండే గుణాలన్నీ నింపాలని ప్రకృతి చేసిన ప్రయత్నం ఇది! ఆగాకర పండితే గింజల్ని తీసేసి వండుకోవటం మంచిది.
లేత ఆగాకర కాయని మధ్యకు చీల్చి మిరియాల పొడి, సైంధవలవణం కలిపిన మిశ్రమాన్ని అందులో కూరాలి. ఒక భాండీలో కొద్దిగా నూనె తీసుకుని తాలింపు గింజలు వేగించి అందులోనే ఈ కాయల్ని పరిచి నీళ్లమూతబెట్టి మగ్గనివ్వాలి. కొద్దిగా ఇంగువని కాసిన్ని నీళ్లలో కరిగించి ఈ కాయల మీద చల్లండి. గుత్తి ఆగాకర కూరని ఇలా వండుకోవాలని నలుడు పాకదర్పణంలో వివరించాడు.
లేత ఆగాకర కాయల్ని గింజలతో సహా ముక్కలుగా తరిగి, తాలింపు గింజలతోపాటు నూనెలో వేగించి ఉల్లి, టమాటా ముక్కలు కూడా కలుపుకుని ఇగురుకూర చేసుకోవచ్చు. పాలు పోసి తియ్యకూరగా చేసుకోవచ్చు. బీపీ రోగులకు, గుండె జబ్బులున్నవారికి ఇది అనుకూలంగా ఉంటుంది. శనగపిండి, మొక్కజొన్న పిండి లేదా జొన్న పిండిని నీళ్లలో కరిగించి ఈ కూరలో కలిపి ముద్దకూరగానూ, నూనెలో ఫైపైన వేగించి వేపుడు కూరగాను, పులుపు కలిపి పులుసుకూరగానూ చేసుకోవచ్చు. ఈ ఆగాకర లేత ఆకులతో పులుసుకూర వండుతారు. మొలల వ్యాధి ఉన్నవారికి, ఆకులు, కాయలు మంచి చేస్తాయి. కాయలతో సమానంగా పనిచేస్తాయి కూడా!
వగరుగా చేదుగా ఉండే కొన్ని ద్రవ్యాలు క్షీణింపచేసే వ్యాధుల్లో బాగా పుష్టినిస్తాయి. ఆగాకర అలాంటి బిట్టర్ టానిక్. దొరికితే తప్పకుండా వండుకుని తినవలసిన గ్రీన్ మెడిసిన్ కూడా!
- డా. జి వి పూర్ణచందు, 94401 72642