Viral: మార్చరీలో జాబ్‌కు వింత పరీక్ష.. శవాల మధ్య 10 నిమిషాల పాటు..
ABN , Publish Date - Dec 27 , 2024 | 12:10 PM
మార్చరీలో ఉద్యోగానికి సంబంధించిన ఓ యాడ్ చైనాలో సంచలనంగా మారింది. శవాల మధ్య 10 నిమిషాలు ఉండగలిగిన వారినే ఉద్యోగంలోకి తీసుకుంటామని సదరు సంస్థ పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: జాబ్ దొరకడమే కష్టంగా మారిన రోజులివి. అందుకే ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలనే తాపత్రయంలో అభ్యర్థులు ఏం చేసేందుకైనా వెనకాడట్లేదు. ఇదిలా ఉంటే, తాజాగా మార్చరీలో ఉద్యోగానికి సంబంధించి ఓ ప్రకటన సంచలనంగా మారింది. అభ్యర్థులు పాసవ్వాల్సిన ఓ వింత పరీక్ష గురించి యాడ్‌లో చదివి జనాలు షాకైపోతున్నారు. ఇదేం పరీక్ష అంటూ నోరెళ్లబెడుతున్నారు. చైనాలో ప్రస్తుతం ఈ ఉదంతం ట్రెండింగ్‌లో ఉంది (Viral).
చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్‌లోగల రూషాన్ ప్రాంతంలోని మార్చరీలో ఉద్యోగానికి ఇటీవల ప్రకటన విడుదలైంది. ఇది సాధారణ ఉద్యోగమే. మన లెక్కల ప్రకారం జీతం నెలకు రూ.25 వేలు. అయితే, తమ అవసరాలకు అనుగూణమైన అభ్యర్థుల కోసం మార్చరీ వారు కఠిన పరీక్షే పెట్టారు. ఇందులో భాగంగా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారు మార్చరీలో గడ్డకట్టే చలిలో శవాల మధ్య 10 నిమిషాలు ఉండాలి. ఎటువంటి విసుగు, చికాకు, చీదరభావం లేకుండా ఆ సమయంలో మార్చరీలో ఉన్న వారినే ఉద్యోగంలోకి తీసుకుంటామని సంస్థ పేర్కొంది.
Viral: వాహనదారుడికి షాక్.. రోడ్డుపై వెళుతుండగా హెల్మెట్‌లోని పాము కాటేయడంతో..
అయితే, అభ్యర్థుల కష్టాలు అక్కడితో ముగిసిపోయాయనుకుంటే పొరబడినట్టే. ఎందుకంటే.. ఉద్యోగంలోకి చేరాక కూడా అభ్యర్థులకు ఆరు నెలల పాటు అప్రెంటిస్‌షిప్ ఉంటుంది. ఆ సమయంలో కూడా కఠిన పని పరిస్థితులకు నిలదొక్కుకున్న వారినే పూర్తిస్థాయి జీతంతో ఉద్యోగంలోకి తీసుకుంటారు. లేకపోతే, ఇంటికి సాగనంపుతారు. అయితే, ఈ పోస్టుకు కేవలం 45 ఏళ్లు లోపు పురుషులే దరఖాస్తు చేసుకోవాలని కూడా సంస్థ స్పష్టంగా చెప్పింది. శవాగారంలో 10 నిమిషాల పరీక్షకు తోడు అభ్యర్థుల నేపథ్యం, ఆరోగ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తామని కూడా చెప్పింది. చివరి దశ ఇంటర్వ్యూ తరువాతే అప్రెంటిస్ షిప్‌లోకి తీసుకుంటామని చెప్పుకొచ్చింది. ఈ ఉద్యోగంలో ఒక్కోసారి 24 గంటల షిష్టులు కూడా పనిచేయాల్సి ఉంటుందని, రాత్రి షిష్టులకు అదనంగా పరిహారం ఇస్తామని వివరించింది.
Viral: మీ వల్లే నాకీ జాబ్ వచ్చింది.. భారతీయ సీఈఓపై ప్రశంస
ఈ యాడ్‌పై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. మార్చరీలో జాబ్ కోసం ఇన్ని కఠిన పరీక్షలా అని కొందరు ఆశ్చర్యపోయారు. మరికొందరు సంస్థను సమర్థించారు. తమ పరిస్థితులకు తగ్గట్టు ఉద్యోగులను కోరుకోవడంలో తప్పేమీ లేదని అన్నారు. ఇంత తక్కువ జీతానికి అంత ఎక్కువ శ్రమ అనవసరమని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో వైరల్ అవుతోంది.
Viral: భర్త నుంచి విడాకుల కోసం సెక్స్ వర్కర్‌ను ఎరగా వేసి మాస్టర్ ప్లాన్!