Viral: గడ్డకట్టే చలిలో నదీ తీరంలోనే ఉండిపోయిన శునకం! హృదయం ద్రవించే ఘటన
ABN , Publish Date - Nov 30 , 2024 | 10:23 PM
నదిలో పడి మరణించిన యజమాని కోసం తీరం వద్దే గడ్డకట్టే చలిలో రోజుల తరబడి ఎదురు చూసిన శునకం ఉదంతం రష్యాలో వెలుగు చూసింది. అసలు జరిగిందేంటో తెలుసుకున్న నెటిజన్లు దాని పరిస్థితి తలుచుకుని కన్నీరుకారుస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: శునకానికి మించిన నేస్తం మనిషికి మరొకరు ఉండరంటారు. ఇది నిజమని రుజువు చేసే మరో ఘటన రష్యాలో వెలుగు చూసింది. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన యజమాని కోసం రోజుల తరబడి వేచి చూసిన ఆ శునకం తీరు అనేక మందిని కదిలించింది (Viral). తన యజమాని పట్ల ఆ శునకానికి ఉన్న విశ్వాసం చూసి స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఇటీవల 59 ఏళ్ల వృద్ధుడు ఒకరు సైకిల్ తొక్కుతుండగా ప్రమాదవశాత్తూ నదిలో పడి కన్నుమూశారు. అక్కడ చలి కాలంకావడంతో నది ఉపరితలం అంతా గడ్డకట్టుకుపోయింది. ఈ క్రమంలో తీరం వెంబడి ఆ వ్యక్తి సైకిల్ తొక్కుతుండగా టైర్ల కింద మంచు విరిగింది. ఈ క్రమంలో అతడు సైకిల్ మీద నుంచి జారిపడటంతో నదిపై ఉన్న మంచువిరిగి నీట మునిగిపోయారు. ఉపరితలం కింద ప్రవాహం తీవ్రంగా ఉండటంతో కొట్టుకుపోయాడు. స్థానికులు అతడిని కాపాడేందుకు వెంటనే రంగంలోకి దిగినా ఉపయోగం లేకపోయింది. నది దిగువన చాలా దూరంలో అతడి మృతదేహం లభించింది.
Viral: వామ్మో.. ఇలాంటి వాళ్లు వస్తే ఫైవ్ స్టార్ హోటళ్లూ మూసేసుకోవాల్సిందే!
అయితే, దుర్ఘటన సమయంలో సదరు వ్యక్తి పెంపుడు శునకం అతడి వెంటే ఉంది. జరిగిందేంటో అర్థం కాక తన యజమాని కోసం నది తీరం వద్దే ఉండిపోయింది. రోజులు గడుస్తున్నా కూడా అది అక్కడి నుంచి కదలకుండా ఉండిపోయింది. చివరకు మృతుడి బంధువులు వచ్చి దాన్ని తీసుకెళ్లారు. ఆ తరువాత కూడా పలు మార్లు అది ఘటన జరిగిన ప్రాంతానికి వచ్చేసింది.
ఇదంతా తెలిసి స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు. తన యజమానికి కోసం ఆ శునకం ఎదురుచూపులు వారిని కదిలించింది. యజమాని కనిపించక తల్లడిల్లుతున్న శునకాన్ని చూసి అనేక మంది కన్నీరు కార్చారు. ఈ శునకం ఉదంతం సోషల్ మీడియా బాట పట్టి నెటిజన్ల హృదయాల్నీ స్ఫృశించింది.
షాకింగ్! పెళ్లివేదికపై ఉన్న ఈ వరుడు ఫోన్‌లో ఏం చూస్తున్నాడో తెలిస్తే..
ఈ ఘటనపై స్పందించిన అనేక మంది మనుషులకంటే శునకాలు ఎన్నో రెట్లు గొప్పవని కితాబునిచ్చారు. నమ్మిన వారికి అపకారం చేసేందుకు ఏమాత్రం సంశయించని జనాలు ఉన్న ఈ రోజుల్లో శునకాల విశ్వాసం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని కీర్తించారు. వాటి విశ్వాసానికి మనుషులు అర్హులు కారని కొందరు అన్నారు.
ఈ ఉదంతం గురించి తెలుసుకున్న అనేక మంది జపాన్ కుక్క హచీకూ శునకాన్ని గుర్తు చేసుకున్నారు. రోజూ యజమానితో పాటు రైల్వే స్టేషన్‌కు వెళ్లి వచ్చే ఆ కుక్క అతడి మరణం తరువాత అక్కడే ఉండిపోయింది. అతడి రాకకోసం ఎదురు చూస్తూ స్టేషన్ ముందరే ఏకంగా 9 సంవత్సరాల పాటు ఎదరు చూసి చివరకు కన్నుమూసింది.
Viral: యువతులతో కలిసి ఏనుగు భరతనాట్యం! జరిగింది తెలిస్తే కన్నీళ్లు ఆగవ్!