Share News

Saudi Arabia: ప్రపంచంలోనే అతిపెద్ద భవనాన్ని నిర్మించనున్న సౌదీ అరేబియా!

ABN , Publish Date - Oct 26 , 2024 | 07:02 PM

చమురు ఎగుమతుల చుట్టూ అల్లుకున్న ఆర్థికవ్యవస్థను సమూలంగా మార్చాలనుకుంటున్న సౌదీ అరేబియా ప్రభుత్వం మరో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతుంది. ప్రపంచంలోనే అత్యంత భారీ భవనాన్ని రియాధ్‌లో నిర్మించేందుకు సన్నాహాలు ప్రారంభించింది.

Saudi Arabia: ప్రపంచంలోనే అతిపెద్ద భవనాన్ని నిర్మించనున్న సౌదీ అరేబియా!

ఇంటర్నెట్ డెస్క్: చమురు ఎగుమతుల చుట్టూ అల్లుకున్న ఆర్థికవ్యవస్థను సమూలంగా మార్చాలనుకుంటున్న సౌదీ అరేబియా ప్రభుత్వం మరో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతుంది. ప్రపంచంలోనే అత్యంత భారీ భవనాన్ని రియాధ్‌లో నిర్మించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. 50 బిలియన్ డాలర్లతో సమఘనం (క్యూబ్) ఆకారంలో నిర్మించనున్న ఈ భవనం.. ఎంపైర్ స్టేట్ భవంతి లాంటి 20 నిర్మాణాలను సులువుగా తనలో ఇముడ్చుకోగలదట. 1,300 అడుగుల ఎత్తు, 1,200 అడుగుల వైశాల్యం ఉండేలా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి (The Mukaab).

Viral: దీపావళి రోజున ఇంట్లో ఒంటరిగా మహిళ! ఇంతలో ఊహించని విధంగా..


ప్రపంచం హరిత ఇంధనాల వైపు మళ్లుతున్న నేపథ్యంలో సౌదీ ఆర్థిక వ్యవస్థను చమురు ఎగుమతుల నుంచి ఇతర రంగాల వైపు మళ్లించాలని యువరాజు ముహమ్మద్ బిన్ సల్మాన్ కంకణం కట్టుకున్నారు. ఇందుకోసం ‘ది విజన్ 2030’ పేరిట ఓ ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. సౌదీ ఆర్థిక వ్యవస్థలో చమురు-యేతర రంగాల వాటా 51 బిలియన్ డాలర్లకు పెంచి, 3.34 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఇందులో భాగంగా.. ఒక నగరం మొత్తాన్ని తనలో ఇముడ్చుకునే స్థాయిలో ఈ భారీ నిర్మాణానికి ప్లాన్ చేశారు.

‘ది ముకాబ్’ పేరిట నిర్మిస్తున్న ఈ అత్యాధునిక భవనంలో సుమారు 2 మిలియన్ చదరపు మీటర్ల ఫ్లోర్ స్పేస్ ఉంటుంది. సౌదీ భవిష్యత్ ఆర్థిక రంగానికి నగరాలను కేంద్రంగా మార్చాలన్న వ్యూహంతో ప్రభుత్వం ఈ నిర్మాణాన్ని ప్లాన్ చేసింది. ఇందులో రెసిడెన్షియల్ యూనిట్లతో పాటు హోటళ్లు, కార్యాలయాలు, షాపింగ్ మాల్స్ వంటివి అనేకం కొలువు దీరనున్నాయి. ఈ భారీ భవనాన్ని సందర్శించే వారికి అద్భుత అనుభూతి మిగిల్చేందుకు ఏఐ టెక్నాలజీని కూడా విరివిగా వినియోగించనున్నారు. లాస్ వేగస్ స్క్వేర్ మాదిరి చూపరులను కట్టిపడేసేలా భారీ స్క్రీన్స్‌ను ఏర్పాటు చేయనున్నారు.


Oxford University: బ్రిటన్‌‌లో ఎన్నారై మహిళకు షాక్! పీహెచ్‌డీ కోసం రూ.కోటి ఖర్చు పెడితే..

సౌదీ సంప్రదాయ నిర్మాణ శైలిని ప్రతిబింబించేలా ఈ ప్రాజెక్టును సిద్ధం చేస్తున్నారు. భవనం బయటి ఆకృతిని సంప్రదాయిక నజదీ ఆర్కిటెక్చరల్ స్టైల్‌లో నిర్మిస్తారు. మట్టి ఇటుకలను పోలిన నిర్మాణాలు, వివిధ జామెట్రిక్ ఆకృతుల్లో కిటికీలు, తలుపులు ఏర్పాటు చేస్తారు. ఇక భవనం చుట్టూ ప్రదేశాన్ని ఎడారి అందాలను గుర్తు తెచ్చేలా డిజైన్ చేస్తారు. ఈ భనవంలో 1.04 లక్షల రెసిడెన్షియన్ యూనిట్లు, 9 వేల హోటల్ గదులు, ఖరీదైన షాపింగ్ ఔట్‌లెట్లు, కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు. పర్యాటకులు సేద తీరేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లను రెడీ చేస్తున్నారు. ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించి ఓ వీడియోను కూడా సౌదీ అధికారులు విడుదల చేశారు.

అయితే, ఈ ప్రాజెక్టు వివాదాస్పదంగా మారిందన్న వార్తలు కూడా అంతర్జాతీయ మీడియాలో వెలువడ్డాయి. మక్కాలోని కాబాను పోలిన ఆకారంలో దీన్ని నిర్మిస్తున్నారని కొందరు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కారణంగా స్థానికులు అనేక మంది నిర్వాసితులుగా మారతారని, కార్మికుల కష్టాన్ని దోచుకునే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయని కొన్ని మానవహక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Read Latest and Travel News

Updated Date - Oct 26 , 2024 | 07:06 PM