Viral: శ్వాస తీసుకోకుండా 6 రోజులు బతకగల ఈ జీవి గురించి తెలుసా?
ABN , Publish Date - Aug 22 , 2024 | 02:58 PM
తేలు శ్వాస తీసుకోకుండా ఏకంగా ఆరు రోజుల పాటు జీవించగలదట. అంతేకాకుండా తిండి లేకుండా ఏడాది పాటు బతికుండగలదట. ఇలాంటి పలు విశేషాలతో కూడిన ఓ ఇన్‌స్టా పోస్టు ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రకృతిలో వింతల గురించి వర్ణించేందుకు భాష చాలదు. శాస్త్ర సాంకేతిక రంగాలు ఇంతగా అభివృద్ధి చెందినా కూడా మానవాళికి తమ చుట్టూ ఉన్న ప్రకృతి గురించి తెలిసింది తక్కువే. ఒక్కో అంశం గురించి తెలిసే కొద్దీ ఆశ్చర్యం ఆకాశాన్నంటుతుంటుంది. అలాంటి ఓ వింత గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. సాధారణంగా మనం శ్వాస తీసుకోకుండా క్షణకాలం కూడా ఉండలేము. కాస్తంత ప్రాక్టీస్ చేసిన వాళ్లు రెండు నిమిషాల పాటు ఊపిరి తీసుకోకుండా ఉండగలరట. కానీ తేలు ఏకంగా ఆరు రోజుల పాటు ఊపిరి తీసుకోకుండా బతకగలదంటే నోరెళ్లబెట్టాల్సిందే. దాని ఊపిరితిత్తుల నిర్మాణమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు (Viral).
Viral: ప్యాసెంజర్‌కు ఊహించని సర్‌ప్రైజ్! ఈ ఆటో అన్నకు మెడల్ ఇవ్వాల్సిందే!
శాస్త్రజ్ఞులు చెప్పే దాని ప్రకారం, తేలు ఊపిరితిత్తుల నిర్మాణం చాలా ప్రత్యేకమైనది. దీన్ని శాస్త్ర పరిభాషలో బుక్ లంగ్స్ అని పిలుస్తారు. తేలు ఉదరభాగంలో ఇవి ఉంటాయట. ఈ ఊపిరితిత్తుల్లో హిమోలింఫ్ అనే ద్రవంతో నిండి ఉన్న ప్లేట్ల లాంటి ఆకారాలు ఉంటాయట. వీటికి ప్రాణవాయు నిల్వ చేసుకునే సామర్థ్యం అధికం. కాబట్టి తేళ్లు గాలి పీల్చుకోకుండా ఏకంగా ఆరు రోజుల పాటు సజీవంగా ఉండగలవని నిపుణులు చెబుతున్నారు (scorpions can live upto 6 days without breathing).
దీంతో, పాటు తేళ్లకు అనేక ఇతర ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవి ఆహారం లేకుండా ఏకంగా ఏడాది పాటు జీవించగలవు. ఎటువంటి ఉపరితలాన్ని అయినా ఇవి ఎక్కగలవు. నీలలోహిత కిరణాల కాంతి వీటిపై పడినప్పుడు ఇవి మెరుస్తాయట. factbyscience అనే ఇన్‌స్టా అకౌంట్‌లో షేర్ చేసిన ఈ విషయాలు ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.
తేలు గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసుకున్న నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. తేలు ఇంత దృఢమైనదని తమకు తెలియదని అనేక మంది కామెంట్స్ చేశారు. ఇప్పటికే తేళ్లంటే నాకు భయం.. ఈ విషయాలతో భయం మరింత పెరిగిందని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు.
అయితే, తేళ్లతో పాటు టర్టల్స్ అనే ఒకరకమైన తాబేళ్లు కూడా గడ్డకట్టిన సరస్సుల అడుగున ఊపిరితిత్తులు వినియోగించకుండానే చాలా కాలం పాటు పరిమిత స్థాయిలో శ్వాస తీసుకుంటాయట. ఆక్సీజన్ వినియోగం తగ్గించేందుకు ఈ సమయంలో దాని జీవక్రియలన్నీ దాదాపుగా నిలిచిపోతాయట. ఈ సమయంలో టర్టల్ వెనక భాగంలోని ప్రత్యేక గాలితిత్తుల ద్వారా అది పరిమితస్థాయిలో శ్వాస తీసుకుంటుంది. అంతేకాకుండా, నిద్రించే సమయంలో సముద్రపు టర్టల్స్ ఏకంగా 7 గంటల పాటు శ్వాస తీసుకోకుండా ఉండగలవని నిపుణులు చెబుతున్నారు.