Viral: రుచీపచీ లేని చాయ్.. రెస్టారెంట్‌పై సింగపూర్ రాయబారి గుస్సా!
ABN , Publish Date - Dec 14 , 2024 | 09:18 PM
గురుగ్రామ్‌లోని ఓ కేఫ్ రుచీపచీ లేని చాయ్ ఇచ్చిందంటూ సింగపూర్ రాయబారి సైమన్ వాంగ్ ఎక్స్ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: గురుగ్రామ్‌లోని ఓ కేఫ్ రుచీపచీ లేని చాయ్ ఇచ్చిందంటూ సింగపూర్ రాయబారి సైమన్ వాంగ్ ఎక్స్ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో, ఆయన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది (Viral).
‘‘అసాధ్యం అనుకున్నది జరిగింది. గురుగ్రామ్‌లో నేను అస్సలు రుచీపచీ లేని చాయ తాగా. కప్పు టీ కోసం పన్నుతో సహా మొత్తం రూ.169 చెల్లించా’’ అంటూ ఆయన నెత్తికొట్టుకుంటున్న ఎమోజీతో ఓ పోస్టు పెట్టారు. మట్టికప్పులో ఇచ్చిన ఆ టీ అస్సలు రుచిగా లేదని అన్నారు. అంతేకాకుండా, ఆ రెస్టారెంట్ లోపలి దృశ్యాన్ని కూడా షేర్ చేశారు. టేబుల్‌పై ఉన్న మట్టి కప్పు ఫొటోను కూడా పంచుకున్నారు.
Viral: ఏం క్రియేటివిటీ! ఇది ఆధార్ కార్డు అనుకుంటే పప్పులో కాలేసినట్టే..
ఆయన పోస్టుకు నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది సింగపూర్ రాయబారికి పలు సూచనలు చేశారు. ఇంటి చాయ్ ఎలా ఉంటుందో రుచి చూసేందుకు తమ ఇంటికి రావాలని కొందరు ఆహ్వానించారు. మరికొందరేమో వీధుల్లో టీ బండ్లపై చాయ్ రుచి చూడాలని సలహా ఇచ్చారు. ఎంత రుచిగా ఉంటుందో ధర కూడా అంతే తక్కువగా ఉంటుందని చెప్పారు. ‘‘మా ప్రాంతానికి రండి.. అసలైన రుచికరమైన దేశీ చాయ్ కేవలం రూ.5లకే లభిస్తుంది. గ్రాఫిక్స్ వంటి హడావుడేమీ ఉండదు. జనాలు పాశ్చాత్యపోకడలు ప్రదర్శించేందుకు ఆయా చోట్లకు వెళతారు కానీ రుచికరమైన చాయ్ కోసం కాదు’’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు.
Viral: సోషల్ మీడియాలో జనాల సానుభూతితో డబ్బులు దండుకున్న వ్యక్తి జైలుపాలు
ఆయన పోస్టుకు నెట్టింట పెద్ద ఎత్తున స్పందన రావడంతో సింగపూర్ రాయబారి మరో పోస్టుతో భారతీయులపై ప్రశంసలు కురిపించారు.
‘‘భారత దేశ సౌందర్యం దేశ ప్రజల్లోనే ఉంది. తమ ఇంటి చాయ్ రుచి చూడాలంటూ ఇంతపెద్ద స్థాయిలో ప్రేమపూర్వక ఆహ్వానాలు రావడం చూసి నేను ఉక్కిరిబిక్కిరి అవుతున్నా. అందరికీ ధన్యవాదాలు’’ అని పోస్టు పెట్టారు. ఈ పోస్టుకు కూడా జనాలు లైకులతో బ్రహ్మరథం పట్టారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.