Social Media: మారుతోంది సోషల్ మీడియా మానియా..
ABN , Publish Date - Jun 30 , 2024 | 01:46 PM
ఫోన్ లేనిదే పిల్లలు నిమిషం ఉండటం లేదు. ఫోన్‌కు అడిక్ట్ అవుతున్నారు. స్క్రీన్ టైమ్ కూడా పెరుగుతోంది. దీంతో చిన్నారులు అనారోగ్యానికి గురువుతున్నారు. తల్లిదండ్రులతో కూడా సరిగా మాట్లాడటం లేదు. ఇదే విషయం పేరంట్స్ వైద్యుల వద్దకు వచ్చారు. ఆరోగ్యంగానే ఉన్నారు.. కానీ మొబైల్ వాడటం వల్ల ఇలా ప్రవర్తిస్తున్నారని వివరించారు.
‘‘సార్.. మా అబ్బాయి ఇంట్లో రాత్రంతా మేల్కొనేవుంటాడు. స్కూల్‌లో ఆవలిస్తూ.. తూలుతుంటాడు. బుర్రపెట్టి పాఠాలను శ్రద్ధగా వినడం లేదని టీచర్ ఫిర్యాదు చేసింది. కుటుంబసభ్యులతో కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నాడు. ఒకసారి పిలిస్తే పలకడు. ఏదో పోగొట్టున్నవాడిలా పరధ్యానంలో ఉంటున్నాడు. ఏ చిన్న పని చెప్పినా సర్రున లేస్తాడు. వాడి కోపం, అసహనం, విసుగు చూస్తే మాకే భయం వేస్తుంది. ఎందుకో వీడు ఈ లోకంలోనే లేడనిపిస్తుంది.. మొబైల్ ఫోనే ప్రపంచం అయ్యింది. వీణ్ణి మీరే బాగు చేయాలి...’’ అంటూ మానసిక వైద్య నిపుణుడి దగ్గర గోడు వెల్లబోసుకుంది ఒక తల్లి. పక్కనే కూర్చున్న కొడుకు బిర్ర బిగుసుకుపోయి.. బెరుగ్గా, భయంగా, బేలగా డాక్టర్‌వైపు చూశాడు.. కుర్రాడి రోజువారీ దిన చర్య, మొబైల్ ఫోన్ వాడే సమయం (స్ర్కీన్‌టైమ్), తరచూ చూసే సామాజిక మాధ్యమాలు, అనుసరిస్తున్న స్నేహితుల జాబితా, ఇస్తున్న లైక్స్, చేస్తున్న షేర్స్, పెడుతున్న కామెంట్స్.. వంటివన్నీ ఆరాతీసి ఒక అంచనాకు వచ్చాడు డాక్టర్.
జబ్బు ఏంటంటే..?
‘‘మీ అబ్బాయికి ఎలాంటి మానసిక, శారీరక జబ్బుల్లేవు. కంగారు పడొద్దు. ఉన్న జబ్బల్లా ఆ మొబైల్ ఫోన్ ఒక్కటే!. సిగరెట్టు, మద్యపానం లాంటిదే ఫోన్ వ్యసనం. మీ అబ్బాయి రోజుకు నాలుగైదు గంటలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలోనే ఉంటున్నాడు. ఇంకో వ్యాపకం లేదు. కౌన్సెలింగ్‌తో మళ్లీ మామూలు మనిషి అవుతాడు. పిల్లలు మారాలంటే తల్లిదండ్రులైన మీ బాధ్యత కూడా అవసరం’’ అని వివరించాడు సైకియాట్రిస్ట్. ఇది హైదరాబాద్‌లోని ఒక మానసిక చికిత్స కేంద్రంలో జరిగిన వాస్తవ సంఘటన. మొబైల్‌ఫోన్లలో సోషల్‌మీడియా యాప్స్‌కు యుక్త వయసు పిల్లలు ఎంత ఘోరంగా ప్రభావితం అవుతున్నారో, ఎంత తీవ్ర వ్యసనపరులుగా మారుతున్నారో చెప్పే దృశ్యం ఇది. పొగతాగడం, మద్యం సేవించడం, డ్రగ్స్ తీసుకోవడం.. ఇవే ఆరోగ్యానికి ప్రమాదం అనుకుంటాం. కానీ, శృతిమించి మొబైల్‌ఫోన్లలో సోషల్‌మీడియా యాప్స్‌కు బందీ అయితే మాత్రం.. కచ్చితంగా ఇదొక కొత్త వ్యసనంగా మారి.. అనేక మానసిక రుగ్మతలకు.. తద్వారా శారీరక అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని అనేక అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.
కొత్త వ్యసనం..
ప్రపంచ దేశాలు, సరిహద్దులతో విడిపోయింది కానీ.. వర్చువల్ వరల్డ్‌లో మాత్రం ఒక్కటై పోయిందిప్పుడు!. సాంకేతికత జీవనశైలిలో తప్పనిసరైంది. కాదనలేం. ప్రపంచ జనాభాలో సుమారు 93 శాతం మంది ఒకరికొకరు అనుసంధానమైన ఇంటర్‌నెట్ వరల్డ్‌లో జీవిస్తున్నాం. ఒక్క భారత్‌లోనే నెటిజన్ల సంఖ్య యాభై కోట్లు. వీరిలో ముప్పయి శాతానికిపైగా పందొమ్మిదేళ్ల వయసున్న యుక్తవయస్కులు సామాజిక మాధ్యమాల్లో మునిగి తేలుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే.. మన దగ్గర ఈ వ్యసనం తక్కువే కానీ విస్మరించాల్సినంత తక్కువేం కాదు. ఇప్పటికే పలు పాశ్చాత్య దేశాల్లో సామాజిక మాధ్యమాల వాడకం కొత్త వ్యసనంగా మారింది. పిల్లల పెంపకం తల్లిదండ్రులకు ఒక సవాలైంది. గంటల తరబడి మొబైల్‌ఫోన్లకు అతుక్కుపోవడంతో కొత్త కొత్త మానసిక, శారీరక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఈ పరిణామం పట్ల మానసిక వైద్య నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్‌లో ఇటీవల చేసిన ఒక జాతీయ సర్వేలోనూ అదే విషయం స్పష్టమైంది. ఈ అధ్యయనంలో యాభైవేల మంది తల్లిదండ్రుల ద్వారా వారి పిల్లల అలవాట్ల గురించి ఆరా తీశారు. వీరంతా 9-17 ఏళ్ల వయస్కులు. ప్రతి పదిమందిలో ఆరుగురు.. రోజుకు మూడు గంటలు సోషల్ మీడియా యాప్స్ చూస్తున్నారని తేలింది. ఈ దురలవాటు మహారాష్ట్ర పిల్లల్లో అయితే అత్యధికం. సోషల్ మీడియా మితిమీరి చూస్తున్న పిల్లల్లో దుందుడుకుతనం, మానసిక అలసట, అసహనం, కోపం-చికాకు వంటి లక్షణాలు కనిపించాయని అధ్యయన కర్తలు పేర్కొన్నారు.
బుర్ర పాడవుతుంది..
రెండేళ్ల కిందట ఇలాంటిదే మరొక అధ్యయనం జరిగింది. నివేదికను పరిశీలించిన అమెరికాకు చెందిన జనరల్ సర్జన్ డా.వివేక్ మూర్తి ‘‘సామాజిక మాధ్యమాల వీక్షణం వ్యసనంగా మారితే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అనేక దుష్ప్రభావాలు తలెత్తుతాయి. నిద్రలేమి, మానసిక అలసట, ఆందోళన, కుంగుబాటుకు గురవుతారు..’’ అని విశ్లేషించారు. ఇదే అంశంపై సర్వే చేసిన లోకల్ సర్కిల్స్ సంస్థ నిపుణులు సైతం ‘‘స్ర్కీన్ అతిగా చూస్తే.. అభూత కల్పనలు, భ్రమలను బుర్రనిండా నింపుకోవాల్సి వస్తుంది. వాస్తవికతకు దూరంగా ఊహాజనిత లోకంలో విహరించే చిత్రమైన పరిస్థితి ఏర్పడుతుంది. సోషల్ మీడియా అతిగా చూడటం వల్ల మెదడు పదే పదే ప్రేరేపించి వ్యసనంగా మార్చేస్తుంది..’’ అని పేర్కొన్నారు. యుక్తవయస్కుల్లో వ్యక్తిత్వ నిర్మాణం జరిగే కీలక సమయంలో.. చదువులు, నైపుణ్యాలు ఒంటబట్టించుకునే దశలో, సామాజిక మాధ్యమాల వలలో చిక్కుకుంటే భవిష్యత్తు నష్టపోవాల్సి వస్తుందని గ్రహించారు నిపుణులు. అందుకే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో సామాజిక మాధ్యమాలపై నియంత్రణ విప్లవం మొదలైంది. స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలు, తల్లిదండ్రులు మార్పునకు మద్దతు పలుకుతున్నారు. ఆయా దేశాల మీద ఒత్తిడి పెరుగుతోంది. ఫలితంగా పిల్లలు సామాజిక మాధ్యమాలను అతిగా వాడకుండా నియంత్రణలు, చట్టాలు, నిబంధనలు వచ్చేశాయి.
అలా మొదలైంది..
అతి పెద్ద ఐటీ సంస్థల్లో మైక్రోసాఫ్ట్ ఒకటి. నాటి సంస్థ అధినేత బిల్‌గేట్స్‌కు ఒక సమస్య ఎదురైంది. ప్రపంచానికి సాంకేతికత అందించిన ఆయన ఇంట్లో.. అదే సమస్యగా మారి.. పెను సవాలైంది. అందరి పిల్లల్లాగే తన పిల్లలు కూడా టెక్నాలజీకి అతుక్కుపోయారు. చదువులు అటకెక్కాయి. నేర్చుకునే శ్రద్ధ తగ్గిపోయింది. ఇదే కనక కొనసాగితే మొదటికే ముప్పు వస్తుందని ముందే కళ్లు తెరిచాడు బిల్‌గేట్స్. టెక్నాలజీ మన చేతుల్లో ఉండాలి కానీ, దాని చేతుల్లో మనం బందీలు కాకూడదన్న కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదు. తన పిల్లలకు పద్నాలుగేళ్ల వయసు వచ్చే వరకు సెల్‌ఫోన్ ఇవ్వకూడదన్నది ఆ నిర్ణయం!. అప్పట్లో ఆయన ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించడంతో.. ఎంతోమంది తల్లిదండ్రులు అభినందించి.. అనుసరించారు కూడా!. పిల్లల్లో డిజిటల్ అడిక్షన్ కట్టడిపై పెద్ద చర్చకు కారణమైంది. కొందరేమో గేట్స్ నిర్ణయాన్ని మెచ్చుకోగా.. మరికొందరు పిల్లల్ని కట్టడి చేయడం సరికాదని తప్పుపట్టారు. బ్రిటన్ రాజవంశానికి చెందిన ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్టన్ దంపతులు కూడా తమ పిల్లల స్ర్కీన్‌టైమ్‌కు కల్లెం వేశారు. రోజుకు ఇంతసేపు మాత్రమే మొబైళ్లు, ట్యాబ్‌లు, టీవీలు చూడాలన్న షరతులు పెట్టారు. ప్రముఖ పాప్ సింగర్ మడోన్నా మొబైళ్ల వాడకంలో- తన పిల్లలకు కాస్త స్వేచ్ఛనిచ్చింది. సోషల్‌మీడియా, వీడియోగేమ్స్ విపరీతంగా వాడేవారు. ఆ పిల్లల వ్యవహారశైలిలో వచ్చిన విపరీత పోకడలు విస్తుపోయేలా చేశాయి. కనీసం చిన్న పిల్లలనైనా కట్టడి చేస్తే తప్ప ఫలితం లేదనిపించింది. ‘‘నా చిన్న పిల్లలకు ఒక వయసు వచ్చే వరకు సోషల్ మీడియా జోలికి వెళ్లనీయలేదు. పెద్ద పిల్లలకు కల్లెం వేయలేకపోయా. అందుకే నష్టం జరిగింది. నా పిల్లల్లో .. ఎవరికైతే డిజిటల్ అడిక్షన్ తక్కువగా ఉందో వారితోనే నా బంధం బలోపేతమైంది. ఎందుకంటే కలిసి మాట్లాడుకునే సమయం దొరికేది కాబట్టి!..’’ అని పేర్కొంది మడోన్నా.
ఆయన పిల్లలకే ఇవ్వలేదు..
ఆపిల్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఎంత పేరుందో తెలిసిందే! కొత్త ఐఫోన్, ఐపాడ్ విడుదల అవుతున్నాయంటే.. అభిమాన హీరోల సినిమా రిలీజ్‌ల కంటే ఎక్కువ భావోద్వేగంతో దుకాణాల ముందు క్యూ కడతారు కొనుగోలుదారులు. ఇక్కడో విచిత్రం...? ఆపిల్ వ్యవస్థాపకుడైన స్టీవ్‌జాబ్స్ కొత్తగా విడుదలైన ఐప్యాడ్‌ను వెంటనే తన పిల్లలకు ఇవ్వలేదట!. అప్పట్లో ఆయన న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘‘మా ఇంట్లో టెక్నాలజీ వాడకాన్ని పరిమితం చేశాం. కొత్తగా విడుదలైన ఐప్యాడ్‌ను కూడా నా పిల్లలకు ఇవ్వలేదు’’ అని స్టీవ్‌జాబ్స్ స్వయంగా పేర్కొన్నాడు. హాలీవుడ్ ప్రముఖ నటి ఏంజెలినా జోలీ కూడా పిల్లల పెంపకంలో టెక్నాలజీ పాత్రను బాగా తగ్గించేసింది. ‘‘మా తరం వాళ్లు సాంకేతికతతో పెరగలేదు కాబట్టి అంత అవగాహన ఉండదు. నేటి తరం పిల్లలు టెక్నాలజీతోనే పుట్టి పెరిగారు. అందుకే వారు ఆన్‌లైన్‌లో ఏం చూస్తున్నారు? ఏం చేస్తున్నారు? అన్న విషయాలను పసిగట్టడం నాలాంటి తల్లికి కష్టమే! అలాగని వదిలేస్తే ఇంకా ప్రమాదకరం. అందుకే నా పిల్లల్ని వీలైనంత వరకు ఆఫ్‌లైన్‌లో ఉంచేందుకే ప్రయత్నిస్తుంటాను. వాళ్లెంత గింజుకున్నా.. బతిమాలినా.. ఒక వయసు వచ్చే వరకు సోషల్‌మీడియాలో ఖాతాలు తెరిచేందుకు అస్సలు ఒప్పుకోలేదు..’’ అంటూ ఖరాకండిగా చెప్పిందామె. వీళ్లే కాదు.. మార్క్ జూకర్‌బర్గ్, కిమ్ కర్దాసియన్, సెరీనా విలియమ్స్, జెన్నీఫర్ లోపేజ్ వంటి ప్రపంచప్రఖ్యాత సెలబ్రిటీలు సైతం తమ పిల్లలకు అంత త్వరగా ఫోన్లు, టెక్నాలజీ, సోషల్ మీడియా వాడేందుకు అనుమతివ్వలేదు. ఒక మోస్తరు వయసు వచ్చాక ఒప్పుకుని.. పరిమితులు విధించారు. ఫలానా సమయంలో చూడాలనే నిబంధనలతో స్ర్కీన్‌టైమ్‌ను తగ్గించగలిగారు. సామాన్య తల్లిదండ్రుల్లో మాత్రం ఈ మార్పు కనిపించడం లేదు. అందుకే ఆయా దేశాల ప్రభుత్వాలు పిల్లలకు సంబంధించి సోషల్ మీడియా వాడకంపై నియంత్రణ చట్టాలను తీసుకురాక తప్పడం లేదు.
చైనా ముందడుగు..
‘‘నేటి బాలలే రేపటి పౌరులు..’’ భారత్ పదే పదే వల్లెవేసే నినాదం ఇది. కానీ.. పిల్లల ప్రాథమిక హక్కులు, ఆరోగ్య సంరక్షణ, గోప్యత, సామాజిక భద్రత, వ్యక్తిత్వ వికాసాల కోసం తీసుకునే చర్యల్లో చైనా కంటే మనం వెనకబడే ఉన్నాం. రెండేళ్ల క్రితం చైనా తీసుకున్న ఒక నిర్ణయం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులను అసూయపడేలా చేసింది. ‘‘ఇక నుంచి పిల్లలు వారానికి మూడు గంటలకు మించి వీడియోగేమ్స్ ఆడేందుకు వీల్లేదు..’’ ఇదీ ఆ విప్లవాత్మక నిర్ణయం. మైనర్ల ఇంటర్‌నెట్ వాడకాన్ని తగ్గించేందుకు ఒక సమగ్ర విధానాన్ని రూపొందించిన తొలి దేశంగా నిలిచింది చైనా. యాప్ డెవలపర్లు, కంపెనీలు, యాప్ స్టోర్ ప్రొవైడర్లు, స్మార్ట్‌ఫోన్లు, డివైజ్‌ల తయారీదారులు.. ఒకరికొకరు అనుసంధానమై.. కొత్త విధానాన్ని అనుసరించాలంది ప్రభుత్వం. ఎలాంటి డిజిటల్ పరికరం మార్కెట్‌లోకి వచ్చినా.. ఎలాంటి అప్లికేషన్లు, వీడియో గేమ్‌లు, యాప్స్ రూపొందించినా.. ‘మైనర్స్ మోడ్’లోనే ఉండాలని చైనీ సైబర్‌స్పేస్ అడ్మినిస్ట్రేటర్ ప్రకటించింది. అప్పటి నుంచి టిక్‌టాక్ లాంటి సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఫిల్టర్ చేసిన కంటెంట్‌ను పిల్లలకు అందించే ప్రక్రియ మొదలైంది. ఆ దేశ కొత్త విధానం ప్రకారం... ఎనిమిదేళ్ల లోపు పిల్లలు రోజుకు 40 నిమిషాలకంటే ఎక్కువ సేపు మొబైళ్లు, ట్యాబ్‌లు చూసేందుకు వీళ్లేదు. ఆ మేరకు స్మార్ట్ పరికరాలన్నీ ‘డిఫాల్ట్ సెట్టింగ్స్’తోనే తయారు చేయాలి. ఆ రోజుకు నిర్దేశించిన సమయం పూర్తవ్వగానే యాప్స్ వాటంతట అవే ఆగిపోతాయి. ప్రాథమికవిద్య, వ్యక్తిగత అభిరుచులు, దేశ ఆసక్తులు, కళలు, వికాసానికి సంబంధించిన కంటెంటే అయ్యుండాలి. ఇది కూడా సెన్సార్‌ను దాటుకుని బయటికి వస్తుంది. ఇక, ఎనిమిదేళ్లు దాటిన పిల్లల స్ర్కీన్ టైమ్ కేవలం గంట మాత్రమే!. టీనేజర్లు వారానికి మూడు గంటలు వీడియో గేమ్స్ ఆడుకునేందుకు వీలుంది. సోషల్ మీడియా, వీడియో గేమ్స్ యాప్స్‌లో అకౌంట్ ఓపెన్ చేయడానికి వయో ధృవీకరణ పత్రం తప్పనిసరి అని చైనా పేర్కొంది.
అన్ని దేశాల్లో కదలిక..
సామాజిక మాధ్యమాలకు కల్లెం వేసిన చైనా లాగే ఫ్రాన్స్ రంగంలోకి దిగింది. తల్లిదండ్రులకు అవగాహన లేకనో, ముచ్చట పడో, పదిమందికి తెలియాలన్న ఆత్రుతతో.. తమ పిల్లల ఫోటోలను పదే పదే సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తుంటారు. ఆ చిత్రాలే సైబర్ నేరగాళ్లకు, బుల్లీయింగ్ బడుద్ధాయిలకు ఆయుధాలవుతున్నాయి. చైల్డ్ ఫోర్నోగ్రఫీ వెబ్‌సైట్లలో సైతం పిల్లలు, టీనేజర్ల ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలు పెట్టి తల్లిదండ్రులను డబ్బు కోసం వేధించే సైబర్ ముఠాలు పెరిగిపోతున్నాయి. అందుకే ఫ్రాన్స్‌లోని నేషనల్ అసెంబ్లీ తాజాగా చట్టం చేసింది. ‘ఇక నుంచి తల్లిదండ్రులు తమ పిల్లల ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయకూడదు’ అని బాలల హక్కుల సంరక్షణ, భద్రత కోసమే ఇలాంటి బిల్లును ప్రవేశపెట్టినట్లు ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచంలో ఇలాంటి చట్టం రావడం ఇదే ప్రథమం. ఇంగ్లండ్ కూడా ఇదే దారిని ఎంచుకుంది. ఆ మధ్య లండన్‌లో ఒక టీనేజ్ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆమె వాడిన సామాజిక మాధ్యమ ఖాతాల్లోని రెండువేల లైక్‌లు, షేర్‌లు, కంటెంట్‌లను పరిశీలించారు పోలీసులు. అందులో విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. ఆమె చూసినదంతా ప్రతికూల ప్రభావాన్ని (నెగిటివ్) కలిగించే కంటెంట్. అదే ఆత్మహత్యకు ప్రేరేపించి ఉంటుందని తేల్చారు మానసిక నిపుణులు. ఈ తరహా ఘటనలు జరక్కుండా ఇంగ్లండ్ ప్రభుత్వం సోషల్‌మీడియాపై పంజా విసిరింది. పిల్లల నిద్ర వేళల్లో ఎలాంటి కొత్త పోస్టులు, నోటిఫికేషన్లను యాప్ కంపెనీలు (టిక్‌టాక్ లాంటివి) పంపకూడదు. పద్దెనిమిదేళ్ల వయస్కుల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలకు ఎలాంటి వాణిజ్య ప్రకటనలు ఇవ్వకూడదు. యూట్యూబ్ ఆటోప్లేను ఆపేయాలి.. ఇవీ కొత్త నిబంధనలు. ఆస్ట్రేలియాలో అయితే తల్లిదండ్రుల సమ్మతి లేకుండా పదహారేళ్ల పిల్లలు ఫేస్‌బుక్ ఖాతా తెరవలేరు. ఫేస్‌బుక్, డేటింగ్ యాప్స్, వీడియో గేమింగ్ ప్లాట్‌ఫామ్స్, వీడియో కాన్ఫరెన్సింగ్ సర్వీసులు, ఆన్‌లైన్ మెసేజింగ్ ప్లాట్‌ఫాంలైన జూమ్, వాట్సప్‌లను పిల్లలు వాడినా సరే.. తల్లిదండ్రులకు కూడా అందులో ప్రవేశం ఉండాల్సిందే! అంటోంది ప్రభుత్వం.
అగ్రరాజ్యం అమెరికాలోని పలు రాష్ట్రాలు ఇదే పంథాతో దూసుకెళుతున్నాయి. ఫ్లోరిడాలో పద్నాలుగేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు సోషల్ మీడియాలో ప్రవేశం నిషిద్ధం. పదిహేనేళ్లు పైబడితే తల్లిదండ్రుల అనుమతితో అకౌంట్ ప్రారంభించవచ్చు. ఈ మేరకు చట్టం వచ్చింది. వీటిని ధిక్కరించిన తల్లిదండ్రులు 50 వేల డాలర్ల జరిమానా చెల్లించాల్సిందే!. న్యూయార్క్ కూడా ఆల్గారిధమ్‌ల ద్వారా మైనర్లకు కుప్పలు తెప్పలుగా కంటెంట్‌ను కుమ్మరించకుండా కట్టడి చేసింది. వియత్నాం మరింత ముందుకెళ్లి.. అసలీ సామాజిక మాధ్యమాల్లో యువతరం ఏం చేస్తోంది? ఎటువైపు వెళుతోంది? అని అధ్యయనం చేసింది. దేశ యువత సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక బాధ్యతలను విస్మరించే విషతుల్య సమాచారానికి ప్రభావితం అవుతోందని నిర్ధారించింది. దీనిపై వెంటనే స్పందించిన టిక్‌టాక్ యాజమాన్యం ‘‘పిల్లల సామాజిక భద్రత కోసం పాఠశాల స్థాయిలో మరిన్ని అవగాహన కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉంద’’ని తప్పించుకునే ప్రయత్నం చేసింది. ‘‘ఈ రోజుల్లో సామాజిక సంబంధాలను నెరపాలంటే సోషల్ మీడియా అవసరమే! అయితే పాఠశాల విద్యార్థులు, టీనేజర్లకు చదువు కీలకం. వ్యక్తిత్వ నిర్మాణం జరిగే వయసు కాబట్టి.. ఏది తప్పు? ఏది ఒప్పు? నిర్ణయించుకోలేని సందిగ్ధంలో ఉంటారు. ఇలాంటి సమయంలో సోషల్ మీడియాను అతిగా వాడితే అనర్థాలే ఎక్కువ. కాబట్టి తల్లిదండ్రుల పర్యవేక్షణలో మాత్రమే సామాజిక మాధ్యమాలను అనుసరించవచ్చు..’’ అని నిపుణులు చెబుతున్నారు.
-మల్లెంపూటి ఆదినారాయణ
పెద్దలదే బాధ్యత..
ఒకప్పుడు పత్రికలు, పుస్తకాలు, టీవీలు సమాచార మాధ్యమాలు. ఇప్పుడు సోషల్ మీడియా మరో ప్రత్యామ్నాయ మాధ్యమంగా మారింది. ఎవరితోనైనా సులభంగా కనెక్ట్ కావొచ్చు. కమ్యూనికేషన్ అనేది వేగంగా మారిపోయింది. ప్రధానమంత్రికి కూడా సామాజిక మాధ్యమాల ద్వారా వినతులను పంపిస్తే, తిరిగి సమాధానాలు అందుకున్న సంఘటనలను చూశాం. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టా తదితర యాప్స్ నుంచి పిల్లలను విడదీయలేం. నియంత్రణ అవసరం. ఇప్పుడంతా యాప్ ప్రపంచమే నడుస్తోంది. ఎవరైనా స్మార్ట్ కావాల్సిందే!. తిండి తెప్పించుకోవాలన్నా, సినిమాకు వెళ్లాలన్నా, షాపింగ్ చేయాలన్నా యాప్స్ పైన ఆధారపడాల్సి వస్తున్నది. ఇవన్నీ సోషల్ మీడియా లాంటివే. కొత్తను నేర్చుకోవడానికి, చదువుకోవడానికి, యాక్సెస్ చేయడానికీ సోషల్‌మీడియా ఎంతో ఉపయోగపడుతోంది. ఒక రకంగా చెప్పాలంటే పిల్లలు స్మార్ట్‌గా, చురుగ్గా మారతారు.. ఇవన్నీ పాజిటివ్ కోణంలో చూసినప్పుడు అర్థమయ్యే అంశాలు. సోషల్‌మీడియా అతిగా వాడితే వచ్చే అనర్థాలను చూద్దాం. చదువుకునే పిల్లలు ఎక్కువ సమయం కోల్పోతారు. సైబర్ బుల్లీయింగ్‌లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అమెరికా వంటి దేశాల్లో ఇళ్లను ‘చైల్డ్ ఫ్రూపింగ్’ పద్ధతిలో నిర్మిస్తారు. అంటే పిల్లలకు సురక్షితమైన ఇల్లు అన్నమాట. చిన్న ప్రమాదం కూడా రాకూడదన్నది వారి ఉద్దేశ్యం. ఇదే పద్ధతిని పిల్లల పెంపకంలోనూ అనుసరించవచ్చు. స్ర్కీన్ టైమ్‌ను అదుపులో పెట్టవచ్చు. పేరెంటల్ కంట్రోల్ యాప్స్ ద్వారా పిల్లల ఆన్‌లైన్ వ్యవహారశైలిని గమనించాలి. ఇంట్లో పెద్దలు కూడా మారాలి. రాత్రి పొద్దుపోయే వరకు తల్లిదండ్రులు మొబైల్ చూస్తూనే గడిపితే పిల్లలు కూడా అదే పని చేస్తారు. నియంత్రించాలని ప్రయత్నించినా మాట వినరు. పిల్లలకు ఇతర వ్యాపకాలను అలవాటు చేయాలి. ఇంట్లో చిన్న లైబ్రరీని ఏర్పాటు చేయడం, కొత్త ఆటలు ఆడించడం, చిన్న చిన్న పర్యటనలకు తీసుకెళ్లడం వంటివన్నీ చేయాలి. పిల్లలతో ఎక్కువసేపు మాట్లాడే వాతావరణాన్ని కల్పించాలి. వాళ్ల మనస్తత్వం, నమ్మకాలు, విలువలు, మంచి చెడులను చూసే విధానం వంటివన్నీ అభివృద్ధి చేయాలి. ఇవన్నీ చేసినప్పుడు సహజంగానే మొబైల్ ఫోన్లు, సోషల్‌మీడియాలపై మోజు తగ్గుతుంది. అవసరం అయితే తప్ప వాడని పరిస్థితి ఏర్పడుతుంది. ఇందుకు పెద్దలే బాధ్యత వహించాలి.
- డాక్టర్ గీత చల్లా, సైకాలజిస్ట్,
సుధీశా కౌన్సెలింగ్ సెంటర్, హైదరాబాద్.