Viral: ‘ఒత్తిడి ఎక్కువైందన్నందుకు ఉద్యోగుల తొలగింపు’ వార్తపై సంస్థ క్లారిటీ!
ABN , Publish Date - Dec 10 , 2024 | 06:29 PM
ఇంటి వద్దే సెలూన్ సర్వీసుల సంస్థ.. ఒత్తిడి ఎదుర్కొంటున్న ఉద్యోగులను తొలగించిందంటూ వస్తున్న వార్తలపై సంస్థ తాజాగా స్పందించింది. ఈ వార్తల్లో నిజం లేదని, తాము ఎవరినీ తొలగించలేదని చెప్పింది. ఒత్తిడి ఎదుర్కొంటున్న వారికి రిలాక్స్ అయ్యేందుకు అవకాశం ఇచ్చామని పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇంటి వద్దే సెలూన్ సర్వీసులు అందించే స్టార్టప్ సంస్థ యస్ మేడమ్.. ఒత్తిడి ఎదుర్కొంటున్న ఉద్యోగులను తొలగించిందంటూ వస్తున్న వార్తలపై సంస్థ తాజాగా స్పందించింది. ఈ వార్తల్లో నిజం లేదని, తాము ఎవరినీ తొలగించలేదని చెప్పింది. ఒత్తిడి ఎదుర్కొంటున్న వారికి రిలాక్స్ అయ్యేందుకు అవకాశం ఇచ్చామని పేర్కొంది. పని ప్రదేశాల్లో పెరుగుతున్న ఒత్తిడిని హైలేట్ చేసేందుకు తాము ఓ పథకం ప్రకారం ఇలా చేశామని పేర్కొంది (Viral).
Elon Musk: నేను అప్పుడే చెప్పా.. కానీ నాకు మతి లేదని అన్నారు: ఎలాన్ మస్క్
ఇటీవల యస్ మేడమ్ సంస్థ ఉద్యోగులపై ఓ సర్వే నిర్వహించింది. పని కారణంగా ఒత్తిడి ఎదుర్కొంటున్నట్టు కొందరు ఈ సర్వేలో పేర్కొన్నారు. అలా చెప్పిన వారిని తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగంలోంచి తొలగిస్తున్నట్టు సంస్థ ఉద్యోగులందరికీ ఓ ఈమెయిల్ పంపించింది. ఈ లేఖ తాలూకు స్క్రీన్ షాట్ నెట్టింట వైరల్ కావడంతో కలకలం రేగింది. ఒత్తిడి ఎక్కువైందని మనసు విప్పి చెప్పిన ఉద్యోగులకు ఇంత శిక్ష వేస్తారా అంటూ నెటిజన్లు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఈ వార్త నెట్టింట దావానలంలా వ్యాపిస్తుండటంతో యస్ మేడమ్ సంస్థ తాజాగా క్లారిటీ ఇచ్చింది.
Viral: వామ్మో.. మనుషులను శుభ్రపరిచే వాషింగ్ మెషీన్!
‘‘ఈ వార్తతో బాధపడిన వారందరికీ క్షమాపణలు చెబుతున్నాము. మేము ఇలాంటి అమానవీయ చర్య ఎప్పటికీ చేపట్టమని స్పష్టం చేస్తున్నాము. మా టీం అంటే కుటుంబంతో సమానము. పని ప్రదేశంలో పెరుగుతున్న ఒత్తిడి గురించి సోషల్ మీడియాలో హైలైట్ చేయాలని ఈ ప్రయత్నం చేశాము. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వారికి మా ధన్యవాదాలు. ఈ ఆగ్రహం సమాజంపై మీకున్న బాధ్యతను ఎలుగెత్తి చూపుతోంది. ఇక మా సంస్థలో ఒత్తిడి ఎదుర్కొంటున్న ఉద్యోగులను తొలగించారా అంటే అస్సలు కాదు. వారికి పని నుంచి విరామం తీసుకోమని చెప్పాము. రిలాక్స్ కమ్మని సూచించాము. స్ట్రెస్ తగ్గించుకోమని చెప్పాము. రెస్టు తీసుకుని పునరుత్తేజితమై మళ్లీ రావాలని కోరాము. వృత్తికి వ్యక్తిగత జీవితానికి మధ్య హద్దులు చెరిగిపోతున్న నేటి తరుణంలో ఉత్పాదకత మాటున ఉద్యోగుల సుఖసంతోషాలు మరుగుపడిపోతున్నాయి. ఈ విషయాన్ని హైలేట్ చేసేందుకు మేము ప్రయత్నించాము. ఉద్యోగుల ఒత్తిడి తగ్గించేందుకు మా సంస్థలో హ్యాపీ టూ హీల్ ప్రోగ్రామ్ కూడా ప్రారంభించాము. ఇందులో భాగంగా పలు చర్యలు తీసుకుంటున్నాము. అంతేకాకుండా దేశంలోనే తొలిసారిగా ఒత్తిడి తగ్గించుకునేందుకు ఉద్యోగులకు ఏడాదికి ఆరు సెలవులు ఇచ్చే విధానాన్ని ప్రారంభించాము’’ అని సంస్థ సోషల్ మీడియాలో పేర్కొంది. దీంతో, ఈ వార్తలకు ముగింపు పడినట్టైంది.
Viral: దేవుడా! ఈ ఒక్క ప్రశ్నకు యస్ చెప్పినందుకు 100 మంది ఉద్యోగులకు ఊస్టింగ్!