Share News

మూగజీవులకో సూపర్‌ స్పెషాలిటీ..

ABN , Publish Date - Nov 03 , 2024 | 07:17 AM

రతన్‌టాటా జీవితంలోని ఏ సంఘటన తీసుకున్నా హృదయం కదిలించే కథలే కనిపిస్తాయి. ఇంట్లో తన ప్రియమైన శునకం మరణించినప్పుడు మూగజీవాల రోదనకు ఆయన గుండె చలించింది. ‘‘మనుషులకేనా? జంతువులకు సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఎందుకు ఉండకూడదు?’’ అని ఆలోచించారు. దేశంలోనే తొలిసారి అత్యాధునిక వైద్య సదుపాయాలతో ముంబయిలో ‘స్మాల్‌ యానిమల్‌ హాస్పిటల్‌’ ప్రారంభించారు..

మూగజీవులకో సూపర్‌ స్పెషాలిటీ..

రతన్‌టాటా జీవితంలోని ఏ సంఘటన తీసుకున్నా హృదయం కదిలించే కథలే కనిపిస్తాయి. ఇంట్లో తన ప్రియమైన శునకం మరణించినప్పుడు మూగజీవాల రోదనకు ఆయన గుండె చలించింది. ‘‘మనుషులకేనా? జంతువులకు సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఎందుకు ఉండకూడదు?’’ అని ఆలోచించారు. దేశంలోనే తొలిసారి అత్యాధునిక వైద్య సదుపాయాలతో ముంబయిలో ‘స్మాల్‌ యానిమల్‌ హాస్పిటల్‌’ ప్రారంభించారు..

‘‘సార్‌.. రతన్‌జీ! మీ నుంచి నాలుగైదు మిస్డ్‌కాల్స్‌ పడ్డాయి. ఎందుకో ఫోన్‌ చేసినట్లున్నారు..? మనం రేపు లండన్‌ బయలుదేరుతున్నాం కదా..!. లగేజీ సర్దుకుంటున్నా..’’


sun2.jpg

..అంటూ రతన్‌టాటాకు ఫోన్‌లో చెప్పాడు ఆయన మిత్రుడు సుమేల్‌సేథ్‌.

‘‘సారీ సేథ్‌జీ. నేను రావడం లేదు. మా ఇంట్లో రెండు శునకాలు ఉన్నాయి నీకు తెలుసు కదా..! టాంగో, టిటోల ఆరోగ్యం బాలేదు. ఒకటేమో ఎప్పుడూ లేనంతగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆ బాధ నేను చూడలేకపోతున్నా. ఇలాంటి క్లిష్ట సమయంలో వాటిని వదిలి రాలేను..’’ అన్నారు రతన్‌టాటా.

.. వారం తర్వాత లండన్‌లోని కింగ్‌ చార్లెస్‌ -3 కి విషయం తెలిసింది. ‘‘దటీజ్‌ రతన్‌ టాటా!. అసలైన మానవతావాది.. నికార్సయిన మనీషి, మహనీయుడు. వారి టాటా సంస్థకు అందుకే అంత విలువ’’ అన్నారు.


2018లో జరిగిందీ ఘటన. అలుపెరుగని సామాజిక సేవ చేసినందుకు రతన్‌టాటాకు అత్యంత గౌరవప్రదమైన ‘లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌’ అవార్డును ప్రకటించారు. బ్రిటిష్‌ ఏసియన్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బకింగ్‌హామ్‌లో జరిగే కార్యక్రమంలో రతన్‌టాటా ఇంగ్లండ్‌ రాజు చార్లెస్‌-3 చేతుల మీదుగా అవార్డు అందుకోవాల్సి ఉంది. అంతలోనే తన పెంపుడు శునకాలు అనారోగ్యం పాలవ్వడంతో లండన్‌ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు రతన్‌. దీనినిబట్టి ఆయనకు మూగజీవులంటే ఎంత ప్రేమో అర్థం చేసుకోవచ్చు. విషయం తెలుసుకున్న కింగ్‌ చార్లెస్‌ సైతం రతన్‌ను అభినందించక తప్పలేదు.


మూగజీవాల బాధల కోసం..

రతన్‌ టాటాకున్న రెండు పెంపుడు శునకాల్లో ఒకటి చనిపోయింది. ఆ రోజే ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. మూగజీవాలకు ఒక సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పెట్టాలని!. అలా రూ.165 కోట్లతో ముంబయిలో వెలసిన టాటాల చికిత్సాలయమే ‘స్మాల్‌ యానిమల్‌ హాస్పిటల్‌’. దేశంలోనే ఇలాంటి ఆస్పత్రిని ఏర్పాటు చేయడం ప్రప్రథం. ‘‘మనం మానవత్వం కలిగిన మనుషులం. శునకాలు, పిల్లులు కూడా మనుషుల్లాంటివే!. వాటికొచ్చే బాధలు మనవిగా భావించి స్పందించాలి.

sun2.3.jpg


సరైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడాలి’’ అంటుంది టాటా. ప్రభుత్వ పశువైద్యశాలలు, ప్రైవేటు పెట్‌ క్లినిక్‌లు ఎన్ని ఉన్నప్పటికీ.. మన దేశంలోని పెంపుడు జంతువుల కోసం అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునిక వైద్య సదుపాయాలు పెద్దగా లేవు. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజలతో సమానంగా మూగజీవాలకు వైద్య సేవలు అందుతున్నాయి. భారత్‌లో కూడా ఈ తరహా చికిత్సలు మొదలవ్వాలని భావించిన రతన్‌టాటా ముంబయిలో ఈ ప్రత్యేక ఆస్పత్రి నెలకొల్పడం విశేషం.

sun2.4.jpg


అత్యాధునిక సదుపాయాలతో..

‘స్మాల్‌ యానిమల్‌ హాస్పిటల్‌’ ఎంతోమంది పెట్‌ ప్రియులను ఆకట్టుకుంది. స్టేట్‌ ఆఫ్‌ ద ఆర్ట్‌ సౌకర్యాలు దీని సొంతం. కొత్తగా ఆస్పత్రిలోకి వెళ్లేవారికి.. ఇదొక పెంపుడు జంతువుల ఆస్పత్రి అంటే నమ్మశక్యం కాదు. మనుషులకు వైద్య సేవలు అందించే సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లాగే.. ఇది కూడా ఏడాది పొడవునా.. ఇరవైనాలుగ్గంటలూ పనిచేస్తుంది. ఆస్పత్రిలో అత్యవసర వైద్య సేవల విభాగం, హై డిపెండెన్సీ యూనిట్‌, ఎంఆర్‌ఐ, సీటీస్కాన్‌, డెంటల్‌, డెర్మటాలజీ, ఆప్తమాలజీ సేవలు అందిస్తున్నారు. హాస్పిటల్‌కు ఛైర్మన్‌ రతన్‌టాటా, ఆయన స్నేహితుడు శంతను నాయుడు డైరెక్టర్‌. ‘‘టాటాల రక్తంలోనే ఉంది సేవాదృక్పథం. అది మన భారత ఔన్యత్యానికి ప్రతీక. అన్ని రంగాల్లో వారి సేవలు అజరామరం. పెంపుడు జంతువుల కోసం మరిన్ని ఆస్పత్రులు వచ్చేందుకు టాటాలు బాటలు వేశారనే చెప్పవచ్చు..’’ అన్నారు ముంబయిలోని బాంద్రా వాసి నవాబ్‌మాలిక్‌.

Updated Date - Nov 03 , 2024 | 07:17 AM