NRI: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు అవమానం! జాతీయపతాకాన్ని రూపొందించమని అడగడంతో..
ABN , Publish Date - Oct 15 , 2024 | 03:04 PM
పదేళ్ల అనుభవం ఉన్న తనను ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి సీఎస్ఎస్ ఉపయోగించి జాతీయపతాకాన్ని వేసి చూపించాలని అడగడంపై ఓ మహిళ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు నెట్టింట ఆమె పెట్టిన పోస్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఆమెకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా 10 ఏళ్ల అనుభవం. ఇటీవలే ఓ సంస్థలో ఇంటర్వ్యూకు హాజరైంది. అక్కడ ఎదురైన ప్రశ్నకు కంగుతిన్న ఆమె చివరకు ఇంటర్వ్యూ నుంచి మధ్యలో తిరిగొచ్చేసింది. ఆ తరువాత ఈ ఉదంతం గురించి నెట్టింట పంచుకుంది. ఈ ఉదంతంపై జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తుండటంతో ఇది ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది (viral).
Viral: నన్ను భయ్యా అని పిలవొద్దు.. ప్రయాణికులకు క్యాబ్ డ్రైవర్ వింత కండీషన్
మహిళ చెప్పిన వివరాల ప్రకారం, ఆమెది బెంగళూరు. టెకీగా ఆమెకు ఫ్రంట్‌ఎండ్ డెవలప్మెంట్‌లో పదేళ్లకు పైగానే అనుభవం ఉంది. ఇటీవల ఆమె ఓ చిన్న కంపెనీలో ఇంటర్వ్యూకు హాజరరైంది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి ఆమెను మొదట సీఎస్ఎస్‌కు సంబంధించి కొన్ని సిద్ధాంతపరమైన ప్రశ్నలు అడిగింది. అంతవరకూ బాగానే ఉన్నా ఆ తరువాత ఇంటర్వ్యూ ఊహించని మలుపు తిరిగింది. టెకీని ఇంటర్వ్యూవర్..సీఎస్ఎస్ (ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్) సాయంతో జాతీయపతాకం డిజైన్ చేయాలని కోరింది. ఇది అనుభవజ్ఞులను అడగాల్సిన ప్రశ్న కాకపోయినా కొంత తమాయించుకున్న ఆమె ఇంటర్వ్యూవర్ కోరినట్టే డిజైన్ చేసి ఇచ్చింది. కానీ, అశోకచక్రం మధ్యలో స్పోక్స్‌కు (చక్రానికి ఉండే ఆకులు) వేయమని కోరడంతో టెకీకి తిక్కరేగి వెంటనే ఇంటర్వ్యూ నుంచి బయటకు వచ్చేసింది. ఈ ఉదంతాన్ని నెట్టింట షేర్ చేస్తూ ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వాస్తవప్రపంచంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం కోరమని అడగొచ్చు కానీ డిజైనింగ్‌కు సంబంధించి ఇలాంటి అసంబద్ధమైన ప్రశ్నలు వేయొచ్చా అని ప్రశ్నించింది.
Viral: వామ్మో.. ఇది రావణ దహనమా..అణుబాంబు విస్ఫోటనమా! షాకింగ్ సీన్స్
మహిళకు పోస్టుకు నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఇంటర్వ్యూవర్ అడిగిన ప్రశ్న సబబుగా లేదని అనేక మంది అన్నారు. తమ అనుభవానికి తగిన విలువ ఇవ్వని సందర్భాలను తాము చూశామని కొందరు చెప్పుకొచ్చారు. ఫ్రెషర్లను ఇలాంటి ప్రశ్న అడగొచ్చు కానీ అనుభవజ్ఞులకు ఇది సరైన ప్రశ్న కాదని అన్నారు. టెకీలో సృజనాత్మకతను పరీక్షించేందుకు ఇంటర్వ్యూవర్ ప్రయత్నించి ఉండొచ్చని కొందరు అన్నారు. బహుశా అభ్యర్థి సహనానికి పరీక్ష పెట్టి ఉండొచ్చు అని కొందరు సందేహం వెలిబుచ్చారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ వైరల్ అవుతోంది.
Viral: కోడి ముందా? గుడ్డు ముందా? ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే..