Share News

శనగల కథ

ABN , Publish Date - Oct 20 , 2024 | 08:56 AM

‘‘చణ్యతే దీయతే ఇతి చణక:’’ ‘చణ’ అంటే, ఇవ్వబడినది అని! శ్రావణమాసంలో ముత్తైదువలు వాయనంగా శనగలు, పండు, భక్ష్యాలు ఒక పళ్ళెంలో పెట్టి ఇస్తినమ్మా వాయనం అని ఇస్తే, పుచ్చుకొంటినమ్మా వాయనం అని పుచ్చుకుంటారు. మానవ సంబంధాలు పెంచేవి శనగలు.

శనగల కథ

చణక అంటే శనగలు.

‘‘చణ్యతే దీయతే ఇతి చణక:’’ ‘చణ’ అంటే, ఇవ్వబడినది అని! శ్రావణమాసంలో ముత్తైదువలు వాయనంగా శనగలు, పండు, భక్ష్యాలు ఒక పళ్ళెంలో పెట్టి ఇస్తినమ్మా వాయనం అని ఇస్తే, పుచ్చుకొంటినమ్మా వాయనం అని పుచ్చుకుంటారు. మానవ సంబంధాలు పెంచేవి శనగలు.

శనగల్లో ‘శ’, సీతలో ‘స’ అంటూ ఏది ఎక్కడ రాయాలో చిన్నప్పుడు గురువులు చెప్పే వాళ్లు. వడ్లమూడి గోపాలకృష్ణయ్య సనగలు- సెనగలు- శెనగలు- శెనిగలు- శనగలుగా పరిణమించిన వైనాన్ని ధ్వని-లిపి- పరిణామము’ అనే గ్రంథంలో వివరించారు. తమిళులు ‘కటలై’, కన్నడిగులు ‘కడలె’, ‘కడ్లె’, మలయాళీలు ‘కటలె’ అని పిలుస్తారు. శనగలకు బెంగాల్‌ గ్రామ్‌ అనే ఇంగ్లీషు పేరు మన దేశంలో మాత్రమే కనిపిస్తుంది. తక్కిన ప్రపంచం అంతా చిక్‌ పీ అంటారు. శనగగింజ (చిక్‌ పీ) ఆకారంలో పొక్కులొస్తాయి కాబట్టి, చిన్నమ్మవారు వ్యాధిని ‘చికెన్‌పాక్స్‌’ అన్నారు. అది చిక్‌ అనే ఫ్రెంచి పదంలోంచి వచ్చింది!


తెలుగులో ‘ద’ అక్షరం ఆకారంలో ఉండే శనగల్ని చిర్రిశనగలు, దేశీ శనగలు, నల్ల శనగలు, చోళాలు అంటారు. సైసర్‌ ఆరియంటం అనేది దీని వృక్షనామం, చని, చెన్నా అని హిందీ ప్రాంతాల్లో పిలుస్తారు. రెండు శనగ బద్దలు అంటుకుని ఒక శనగ గింజ ఏర్పడుతుంది కాబట్టి, వీటిని ద్విదళ బీజాలంటారు. ద్విదళ-బైదళంగా, బేడగా మారింది. శనగ పప్పుని శనగబేడలనటం కొన్ని తెలుగు ప్రాంతాల్లో ఉంది.

మెడిటేరియన్‌ ప్రాంతాల్లో పండే గుండ్రటి శనగల్ని మనదేశంలో బఠాణీ శనగలు, బోడిశనగలు, బొంబాయి శనగలు, కాబూలీ శనగలు ఇలా పిలుస్తారు. ఇవి ఆఫ్ఘన్ల ద్వారా మొఘల్‌ పాలనా కాలంలో మనదేశంలోకి ప్రవేశించి ఉంటాయి. అమెరికాలో వీటిని గార్భంజో శనగలంటారు. ఈ బొంబాయి బోడిశనగల్లో ఫైబర్‌ తక్కువ. పేగులకు హాని చేస్తాయి. పురుషత్వాన్ని దెబ్బతీస్తాయి. షుగరును పెంచుతాయని కూడా ఇటీవలి పరిశోధనలు చెప్తున్నాయి. దేశీయమైన మన ఎర్ర శనగలు షుగర్ని తగ్గిస్తాయి.


మొలకలొచ్చిన శనగల్ని మిరియాలపొడి, ఆవాలు, జీలకర్రలతో సాతాళించి, బడినుంచి అలిసి వచ్చే పిల్లలకు పెడితే, తక్షణ శక్తి నిస్తాయి. స్థూలకాయాన్ని తగ్గిస్తాయి. నీళ్లలో శనగల్ని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగితే చలవ నిస్తాయి. పచ్చి శనగలతో కూర, శనగ ఆకులతో పప్పు వండుకుంటారు. ఇవి శనగలతో సమానమైన పోషకాలు కలిగి ఉంటాయి. దొరికితే వాటిని వదలకండి!

కడుపులో ఇంధనం (జఠరాగ్ని) సమృద్ధిగా ఉన్నవాడే అసలైన ధనవంతుడు. పోషకాల పుట్ట అనదగిన శనగలు అలాంటి ఇం‘ధనవంతు’లకే అనుకూలంగా ఉంటాయి. చక్కగా అరిగితే దేశవాళీ శనగలు చలవ చేస్తాయి. రక్తదోషాల్నీ తగ్గిస్తాయి. కానీ, జీర్ణశక్తి బలంగా లేకపోతే, వాతం చేస్తాయి. కడుపు ఉబ్బరం, మలబద్ధకం ఏర్పడతాయి. పుట్నాల పప్పు కూడా ఇదే గుణాలు కలిగి వుంటుంది. శనగపప్పుని మరపట్టించుకుని శనగపిండిగా వాడుకుంటే బోడి బఠాణీ పిండి కల్తీ కలిసిందనే భయం ఉండదు.


నానబెట్టిన శనగపప్పు (లేదా పెసరపప్పు), కొబ్బరిముక్కలు, అరటిపండు ఈ మూడింటినీ ప్రసాదంగా పంచుతారు. ఒక రోజుకి శరీరానికి ఎన్ని పోషకాలు కావాలో అన్నీ ఈ మూడింటిద్వారా అందుతాయి కాబట్టే, నైవేద్యానికి ఈ మూడింటినీ ఎంచుకున్నారు. ఉపవాసాలున్నవారికి ఈ మూడూ తింటే చాలు కడుపారా తిన్నదాంతో సమానం. నీరసం రాదు. ఎండిన శనగపప్పు కన్నా నానబెట్టిన శనగపప్పుని తాలింపుల్లోనూ కూరల్లోనూ పప్పుగానూ వాడుకోవటం మంచిది. పుట్నాలపప్పుతో చేసే సున్నిపొడి కన్నా నానబెట్టిన శనగపప్పుతో పచ్చడి చేసుకుంటే తేలికగా అరుగుతుంది.


మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో కాఫీ గింజలకు కరువు ఏర్పడి జర్మన్లు తమ సైనికులకి శనగల్ని నల్లగా వేగించి దంచిన పొడిని కాఫీపొడికి బదులుగా అందించారట. నిజానికి కాఫీ కన్నా శనగలు ఎక్కువ ఉత్తేజదాయకం, తక్కువ హానికారకం. శనగ కాఫీని గ్రీన్‌ కాఫీ అనుకుని తాగటం మంచిది.

- డా. జి వి పూర్ణచందు, 94401 72642

Updated Date - Oct 20 , 2024 | 08:56 AM