ఇది నా స్టయిల్...
ABN , Publish Date - Nov 10 , 2024 | 06:30 AM
భూమి పెడ్నేకర్... చేసే పాత్రల కన్నా, ధరించే దుస్తులతోనే అందరి చూపు తన వైపు తిప్పుకునేలా చేస్తుంది. ఒక స్టార్‌గా ఫ్యాషన్ ప్రపంచంలో తనను తాను ఎప్పుడూ సరికొత్తగా ఆవిష్కరించుకుంటూ ప్రత్యేకతను చాటుకుంటోంది. ‘తను ధరించే దుస్తులే తనేమిటో చెప్తాయ’నే ఈ బోల్డ్ బ్యూటీ ఫ్యాషన్ మంత్ర ఏమిటంటే...
భూమి పెడ్నేకర్... చేసే పాత్రల కన్నా, ధరించే దుస్తులతోనే అందరి చూపు తన వైపు తిప్పుకునేలా చేస్తుంది. ఒక స్టార్‌గా ఫ్యాషన్ ప్రపంచంలో తనను తాను ఎప్పుడూ సరికొత్తగా ఆవిష్కరించుకుంటూ ప్రత్యేకతను చాటుకుంటోంది. ‘తను ధరించే దుస్తులే తనేమిటో చెప్తాయ’నే ఈ బోల్డ్ బ్యూటీ ఫ్యాషన్ మంత్ర ఏమిటంటే...
చిన్నప్పటి నుంచే...
ఫ్యాషన్ అంటే నాకు మక్కువ ఎక్కువ. చిన్నప్పుడే తెరపై హీరోయిన్లు వేసుకునే దుస్తులను చూసి, అలాంటివి కొనివ్వమని అమ్మ దగ్గర మారాం చేసేదాన్ని. నటిని కాకముందు నా ఔట్‌ఫిట్స్ అన్నీ ఢిల్లీలోని సరోజినీ మార్కెట్‌లో కొనేదాన్ని. ప్రతీ వారంతాల్లో అక్కడికి వెళ్లి దుస్తులు కొనుక్కుని, వాటిని స్థానిక టైలర్ దగ్గరికి తీసుకెళ్లి ఆలే్ట్రషన్ చేయించుకునేదాన్ని. అందంగా ముస్తాబవ్వటం అనేది నాకు చిన్నప్పటి నుంచే అలవాటయ్యింది.
తప్పేం లేదు కదా!
జనం మనల్ని ఒక చట్రంలో బిగించి, అలాగే ఉండాలని రూల్సు పెడతారు. ఒక్కసారి ఆ చట్రం నుంచి బయటకు వస్తే మనం ఎలా కంఫర్ట్‌గా ఉంటామో తెలుస్తుంది. ‘దమ్‌లగాకే హైసా’ సమయంలో నేను చాలా లావుగా ఉండేదాన్ని. అయినా కూడా నా శరీరాకృతి పట్ల కాన్ఫిడెంట్‌గా ఉండేదాన్ని. లావుగా ఉన్నాను కాబట్టి సౌందర్య ప్రదర్శన చేయనని నేను ఏనాడూ చెప్పలేదు. ఆ తర్వాత నాకు వచ్చిన పాత్రలకు తగ్గట్టుగా సన్నబడాలనుకున్నా. అంతేగాని గ్లామరస్ దుస్తుల కోసమే సన్నబడలేదు. నాకు నచ్చేవిధంగా నేనుండాలనుకోవడంలో తప్పేం లేదు కదా.
రేఖాజీ తర్వాతే...
నా ఫేవరేట్ ఫ్యాషన్ ఐకాన్ అంటే... కచ్చితంగా ‘రేఖా జీ’ అంటాను. తెర మీద, బయట కూడా ఆమెలాగే ఉండాలనుకుంటా. ‘ఇప్పటి నుంచి 20 ఏళ్ల పాటు... మీలాగే నా గురించి కూడా చెప్పుకుంటార’ని రేఖాజీతో ఒకసారి చెప్పాను. అమెరికన్ గాయని, నటి ‘చెర్’ ప్రభావం కూడా నాపై ఉంది. ఆమె హెయిర్‌స్టయిల్ బాగా నచ్చుతుంది. సోనమ్ కపూర్, నటాషా పూనావాలా ఫ్యాషన్స్ ఇష్టపడతాను. రేఖాజీ తర్వాత నా కళ్లకు అంత గొప్పగా కనిపించేది ఇషా అంబానీ మాత్రమే.
మూడ్‌ను బట్టి...
నా స్టయిల్ అనేది ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. నా మూడ్‌ను బట్టి దుస్తులు ధరిస్తుంటా. స్టయిల్ విషయంలో నాకు నేనుగా అనేక ప్రయోగాలు చేసుకుంటా. రెగ్యులర్‌గా కనిపించకుండా స్టయిల్‌కు ఎలాంటి ట్విస్ట్ ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తుంటా. యాక్ససరీస్‌తో కొత్త లుక్ తీసుకొస్తా.
గ్లామర్ డాల్‌గా...
నేను ప్రస్తుతం ‘థాంక్యూ ఫర్ కమింగ్’ సినిమా చేస్తున్నా. అందులో నేను చాలా గ్లామరస్‌గా కనిపించబోతున్నా. గత సినిమాల్లో వార్డ్‌రోబ్‌తో నాకు పని పడలేదు. కానీ ఈ సినిమాలో నేను ధరించే స్టయిలిష్ దుస్తులకు లెక్కేలేదు. ఒక చిన్నపిల్లను చాక్లెట్ల దుకాణంలో వదిలేస్తే ఎలా ఉంటుందో అలా ఫీలయ్యాను. నేను వేసుకునే దుస్తులతో ఒక ఫ్లాట్ నిండిపోయిందంటే నమ్మండి.
మై ఛాయిస్
- మాడ్రిడ్‌లో నేను మొదటిసారిగా కొన్న బర్‌బెర్రీ బ్యాగ్ ఇప్పటికీ నా దగ్గర ఉంది.
- సోనమ్ కపూర్ వార్డ్‌రోబ్‌ను దోచుకెళ్లాలనే కోరిక ఉంటుంది.
- మిలన్, జైపూర్ నా షాపింగ్ డెస్టినేషన్స్.
- లిప్‌బామ్, కన్సీలర్, బ్రౌన్ ఐ షాడో నా మేకప్ కిట్‌లో ఉండాల్సిందే.
- చోకర్స్ ధరించడమంటే నాకు చాలా ఇష్టం.