Viral News: సినిమాకు మించిన ట్విస్ట్.. మత్తు మందిచ్చి, లింగమార్పిడి చేసి..
ABN , Publish Date - Jun 21 , 2024 | 10:18 AM
తాము ఇష్టపడే వ్యక్తుల కోసం కొందరు ఎంతకైనా తెగిస్తుంటారు. ప్రాణాలమీదకు వచ్చినా సరే.. వెనకడుగు వేయరు. అయితే.. కొన్ని కథల్లో మాత్రం ఎవ్వరూ ఊహించని ట్విస్టులు వెలుగు చూస్తుంటాయి. ఇప్పుడు అలాంటి పరిణామమే...
తాము ఇష్టపడే వ్యక్తుల కోసం కొందరు ఎంతకైనా తెగిస్తుంటారు. ప్రాణాలమీదకు వచ్చినా సరే.. వెనకడుగు వేయరు. అయితే.. కొన్ని కథల్లో మాత్రం ఎవ్వరూ ఊహించని ట్విస్టులు వెలుగు చూస్తుంటాయి. ఇప్పుడు అలాంటి పరిణామమే ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) చోటు చేసుకుంది. తనకు నచ్చిన యువకుడిని పెళ్లి చేసుకోవడం కోసం పెద్ద డ్రామాకే తెరలేపాడు. అతనికి తెలియకుండానే లింగమార్పిడి చికిత్స చేయించాడు. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఆ వివరాల్లోకి వెళ్తే..
ముజఫర్‌నగర్‌లోని సంజక్ గ్రామానికి చెందిన ముజాహిద్ (20) (Mujahid) అనే అబ్బాయికి రెండేళ్ల క్రితం ఓంప్రకాశ్ (Om Prakash) అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి వీళ్లిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్‌గా మెలుగుతున్నారు. అయితే.. ఓం ప్రకాశ్ మాత్రం ఆ యువకుడిపై మనసు పారేసుకున్నాడు. అంతేకాదు.. అతని తండ్రి ఆస్తిపై కూడా కన్నేశాడు. ఆ అబ్బాయితో పాటు ఆస్తి కూడా తన సొంతం చేసుకోవడానికి.. ఓం ప్రకాశ్ ఓ పన్నాగం పన్నాడు. ముజాహిద్‌ను లింగమార్పిడి చికిత్స (Gender Change Operation) ద్వారా అమ్మాయిగా మార్చి, ఆపై పెళ్లి చేసుకుంటే.. తాను అనుకున్నది సాధించవచ్చని ఓం ప్రకాశ్ భావించాడు. అనుకున్నదే తడువుగా.. లింగమార్పిడి చికిత్స చేయించడం కోసం డాక్టర్లతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
జూన్ 3వ తేదీన నీకు వైద్యపరమైన సమస్య ఉందని, ఆసుపత్రిలో చూపిస్తే మంచిదని నమ్మించి.. ముజాహిద్‌ను ఓంప్రకాశ్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడికెళ్లాక వైద్యులతో కలిసి నాటకమాడి.. చిన్న సర్జరీ చేయాలని చెప్పాడు. అందుకు ముజాహిద్ ఒప్పుకోవడంతో.. అతనికి మత్తుమందు ఇచ్చారు. ఇక ఆ తర్వాత పురుష అవయవాలను తొలగించి, లింగమార్పిడి చికిత్స చేశారు. ఆ యువకుడు స్పృహలోకి వచ్చాక.. నిన్ను అమ్మాయిగా మార్చానని, ఇకనుంచి నువ్వు నాతోనే కలిసి ఉండాలని ఓం ప్రకాశ్ చెప్పాడు. నీ తండ్రి ఆస్తి కూడా నాకు సొంతం అవుతుందన్నాడు. తాను చెప్పినట్లు చేయకపోతే.. తీవ్ర పరిణామాలు తప్పవని ఓం ప్రకాశ్ బెదిరింపులకు పాల్పడ్డాడు.
తనకు లింగమార్పిడి ఆపరేషన్ జరిగిందన్న సంగతి తెలిసి ముజాహిద్ లబోదిబోమన్నాడు. ఓం ప్రకాశ్ బెదిరింపులకు లొంగని అతను.. తనకు జరిగిన అన్యాయాన్ని తల్లిదండ్రులకు వివరించాడు. దీంతో.. బాధితుడి తండ్రి జూన్ 16వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. అలాగే.. శస్త్రచికిత్సలో అతనికి సహకరించిన వైద్యులపై కూడా చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. తనతో పాటు తన తండ్రి ఆస్తిని కాజేయడం కోసమే ఓం ప్రకాశ్ ఈ దారుణానికి పాల్పడ్డాడని, చెప్పినట్లు చేయకపోతే తన తండ్రిని చంపుతానని బెదిరించాడని కూడా ముజాహిద్ తన ఆవేదన వ్యక్తం చేశాడు.
Read Latest Viral News and Telugu News