Share News

UP Monkeys: పాపం.. కోతులు చేసిన పనికి ఓ యువతి మృతి.. అసలేమైందంటే?

ABN , Publish Date - Feb 17 , 2024 | 05:21 PM

ఉత్తరప్రదేశ్‌లో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక కోతుల సమూహం ఇద్దరు అక్కాచెల్లెళ్లపై దాడి చేయడంతో.. ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో ఓ యువతి బావిలో పడి మృతి చెందింది. ఈ సంఘటన యూపీలోని హత్రాస్‌లో చోటు చేసుకుంది.

UP Monkeys: పాపం.. కోతులు చేసిన పనికి ఓ యువతి మృతి.. అసలేమైందంటే?

ఉత్తరప్రదేశ్‌లో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక కోతుల సమూహం ఇద్దరు అక్కాచెల్లెళ్లపై దాడి చేయడంతో.. ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో ఓ యువతి బావిలో పడి మృతి చెందింది. ఈ సంఘటన యూపీలోని హత్రాస్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొత్వాలి సదర్ ప్రాంతంలో నివాసముంటున్న శివకుమార్‌కు స్వప్న (19), సాధన (15) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శుక్రవారం వీళ్లిద్దరు టెర్రస్‌పై బట్టలు ఆరవేస్తున్నారు. ఇంతలో కొన్ని కోతులు ఒక సమూహంగా అక్కడికి వచ్చి, ఆ ఇద్దరిపై దాడి చేశాయి.


దీంతో భయభ్రాంతులకు గురైన అక్కాచెల్లెళ్లు.. ఆ కోతుల నుంచి తప్పించుకోవడం కోసం పరుగులు తీశారు. ఈ క్రమంలోనే ఇంటి పక్కనే ఉన్న బావిలో వాళ్లు పడిపోయారు. ఇది గమనించిన స్థానికులు ఎంతో కష్టపడి అక్కాచెల్లెళ్లిద్దరినీ బావిలో నుంచి బయటకు తీశారు. వాళ్లు స్పృహ కోల్పోయి ఉండటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే స్వప్న చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. మరోవైపు.. సాధన ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఆమెకు మెరుగైన చికిత్స అందించడం కోసం అలీగఢ్‌కు తరలించారు. స్వప్న మృతితో ఆమె కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్థులు సైతం శోకసంద్రంలో మునిగిపోయారు.

ఇదే సమయంలో.. కోతుల బెడదతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవి గుంపులుగా వచ్చి ఇంట్లోని వస్తువులు తీసుకొని పారిపోతున్నాయని.. ఒక్కోసారి మనుషులపై దాడులు కూడా చేస్తున్నాయని వాపోయారు. కానీ.. కోతుల వల్ల ఎప్పుడు ఒకరి ప్రాణం పోలేదని, ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి అని చెప్తున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో నిశ్శబ్ద వాతావరణం అలుముకుంది. అటు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాధన కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

Updated Date - Feb 17 , 2024 | 05:21 PM