Viral: తనను అడక్కుండా కన్నారంటూ తల్లిదండ్రులపై మహిళ కేసు! చివరకు..
ABN , Publish Date - May 13 , 2024 | 04:48 PM
తమ జీవితానికి తల్లిదండ్రులను బాధ్యులను చేసే వారిపై సెటైర్‌గా చేసిన ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఓ యువతి చేసిన ఈ వీడియో సెటైర్ అని గుర్తించక పొరపాటు పడ్డ కొందరు ఆమెపై విమర్శలు గుప్పించారు.
ఇంటర్నెట్ డెస్క్: తమ జీవితానికి తల్లిదండ్రులను బాధ్యులను చేసే వారిపై సెటైర్‌గా చేసిన ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఓ యువతి చేసిన ఈ వీడియో సెటైర్ అని గుర్తించక పొరపాటు పడ్డ కొందరు ఆమెపై విమర్శలు గుప్పించారు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా(Viral) మారింది.
అమెరికాలోని (USA) న్యూజెర్సీకి చెందిన కాజ్ థియాజ్‌కు టిక్‌టాక్ అకౌంట్ ఉంది. తనది సెటైరికల్ అకౌంట్ అని తన బయోలోనే ఆమె స్పష్టంగా పేర్కొంది. ఇటీవల ఓ రోజు ఆమె తన తల్లిదండ్రులపై కోర్టులో కేసు వేశానంటూ వీడియో షేర్ చేసింది. తనని అడక్కుండా, తన అనుమతి తీసుకోకుండా తనను కన్నందుకు ఈ కేసు వేసినట్టు తెలిపింది. తనకు పిల్లలు ఉన్నా వాళ్లను దత్తత తీసుకున్నానని, కాబట్టి వారు ఈలోకంలోకి రావడానికి తాను కారణం కాదని చెప్పుకొచ్చింది (US Woman Claims She Sued Parents For Giving Birth Without Permission).
Viral: వామ్మో.. పాక్‌లో భారతీయ మహిళ ఫుడ్ స్టాల్.. మరీ ఇంత పాప్యులరా!
‘‘నేను నా తల్లిదండ్రులపై కేసు వేశాను. నన్ను అడక్కుండానే వారు నన్ను కన్నారు. నా అనుమతి లేదు. నేను పుట్టి, పెరిగి పెద్దయ్యాక పొట్టి కూటి కోసం జాబ్ చేయాల్సి వస్తుందని నాకు అప్పట్లో తెలీదు. ఈ కష్టానికి నేనె ప్పుడూ అంగీకరించలేదు. నేను పుట్టకముందే నన్ను కాంటాక్ట్ చేసేందుకు నా తల్లిదండ్రులు అస్సలు ప్రయత్నించలేదు. తల్లిదండ్రులపై పిల్లలు కేసే వేసేలా ప్రోత్సహించేందుకు ఈ వీడియో చేస్తున్నా. నా జీవిత లక్ష్యం కూడా ఇదే. కానీ ఎవరినైనా దత్తత తీసుకుంటే ఈ సమస్య రాదు’’ అని చెప్పుకొచ్చింది.
ప్రతిదానికీ తల్లిదండ్రులను తప్పుపట్టేవారిపై సెటైరికల్‌గా చేసిన ఈ వీడియోు చూసిన జనాలు మహిళ నిజంగా తన తల్లిదండ్రులపై కేసు వేసిందనుకున్నారు. చిన్నారులందరినీ ఇలా చేయాలని ఆమె ప్రోత్సహిస్తోందని పొరపాటుపడ్డారు. దీంతో, ఆమెపై విమర్శలు గుప్పించారు. అది సెటైరికల్ వీడియో అని కొందరు బుద్ధిజీవులు ప్రస్తావించడంతో ఆమెపై విమర్శల జడి తగ్గింది.