Viral: ఇండియాకొచ్చాక నా లైఫ్ పూర్తిగా మారిపోయింది.. అమెరికా మహిళ వీడియో వైరల్
ABN , Publish Date - Sep 14 , 2024 | 05:14 PM
కొంతకాలంగా ఇండియాలో ఉంటున్న ఓ అమెరికా మహిళ తన జీవితం ఇక్కడకు వచ్చాక ఎలా మారిపోయిందీ చెబుతూ నెట్టింట పోస్టు చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: నేటి జమానాలో ప్రజలు వివిధ దేశాల్లో సెటిలవడం సాధారణమైపోయింది. ఉద్యోగ ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ భారతీయులు ప్రపంచంలోని అనేక దేశాల్లో స్థిరపడ్డారు. ఇక విదేశస్తులు కూడా రకరకాల కారణాలతో భారత్‌లో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఇలా కొంత కాలంగా భారత్‌లో నివసిస్తున్న ఓ అమెరికా మహిళ తన జీవితం పూర్తిగా మారిపోయిందని చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించి ఆమె నెట్టింట పంచుకున్న వీడియోకు ఏకంగా 20 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి (viral).
తన జీవితం ఎలా గుర్తుపట్టలేనంతగా మారిపోయిందీ చెబుతూ ఫిషర్ అనే మహిళ ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేసింది. ఆయా మార్పులను పాయింట్ల వారీగా రాసుకొచ్చింది.
తాను వెజిటేరియన్‌గా మారిపోయానని ఆమె చెప్పింది. శాకాహారంతో ఉన్న ఉపయోగాలు, జంతు హింస నచ్చకపోవడంతో తీరు మార్చుకున్నట్టు తెలిపింది.
భారతీయ సంప్రదాయక వస్త్రాలనే ప్రస్తుతం ధరిస్తున్నట్టు వివరించింది. ఇక్కడి వేడి వాతావరణానికి లైట్ వెయిట్ కాటన్ దుస్తులు అత్యంత అనుకూలమని వ్యాఖ్యానించింది.
ఢిల్లీలో ప్రజారవాణా వ్యవస్థ ప్రపంచంలోని అత్యధ్భుత వ్యవస్థల్లో ఒకటని ఫిషర్ ప్రశంసలు కురిపించింది. అదే అమెరికాలో ఇలా ఉండదని, ఎక్కడికి వెళ్లాలన్నా సొంత కారు తప్పనిసరి అని చెప్పుకొచ్చింది.
Viral: విమానం ఎంట్రీ డోర్స్ ఎడమ వైపే ఎందుకుంటాయో తెలుసా?
భారతీయతకు ప్రతిబింబంగా నిలిచే టీకి తానూ అలవాటు పడిపోయానని చెప్పుకొచ్చింది. పనిలో మునిగిపోయినా అప్పుడప్పుడూ టీ కోసం బ్రేక్ తీసుకుని కాస్తంత సేద తీరుతానని వివరించింది.
తన పిల్లలను ఢిల్లీలోని ప్రైవేటు స్కూలుకు పంపించగలుగుతున్నాయని ఆమె చెప్పింది. అమెరికాలో నాణ్యతాపరంగా ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ల మధ్య పెద్దగా వ్యత్యాసం లేకపోయినా ప్రైవేటు స్కూళ్ల ఫీజులు ఆకాశాన్నంటుతాయని చెప్పింది. ఇక ప్రైవేటు స్కూళ్లల్లో నాణ్యత అద్భుతమని తెలిపింది.
ఆహారాన్ని చేతులతో తినడం కూడా అలవాటైపోయిందని పేర్కొంది. మొదట్లో ఇలా తినడం వింతగా అనిపించినా ప్రస్తుతం ఈ విధానాన్నే బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు చెప్పింది. చేతులతో తింటే ఆహారం మరింత రుచిగా ఉన్నట్టు కూడా అనిపిస్తోందని తెలిపింది.
Viral: డైవర్స్ తీసుకున్న మహిళ రెండో పెళ్లికి పెట్టిన కండీషన్స్.. జనాలకు షాక్!
ఢిల్లీలో హిందీ రాని వాళ్లు ఇబ్బంది పడతారని చెప్పిన ఆమె తాను ఇప్పుడు సులభంగా హిందీ మాట్లాడతానని చెప్పుకొచ్చింది. మొదట్లో ఆ భాష నేర్చుకునేందుకు కాస్త కష్టపడ్డా చివరకు విజయం సాధించినందుకు తనకెంతో గర్వంగా అనిపిస్తోందని చెప్పింది.
అమెరికాలో అంట్లను శుభ్రం చేసేందుకు డిషవాషర్లు, డ్రయ్యర్లు ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని ఆమె తెలిపింది. సులువుగా వండుకునేందుకు వీలైన ఆహార పదార్రథఆలు కూడా ఉంటాయని తెలిపింది. కానీ ఇండియాకు వచ్చాక ఈ పనులన్నీ సొంతంగా చేసుకోవడం నేర్చుకున్నానని వివరించింది. ఆహారాన్ని అప్పటికప్పుడు ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకోవడం తనకెంతో నచ్చిందని చెప్పింది.
ఒకప్పుడు బాత్రూమ్‌లో టాయిలెట్ స్ప్రెయర్ వాడేందుకు ఇబ్బంది పడేదాన్ని కానీ, ఇప్పుడు ఇది లేకుండా ఉండలేనని కూడా ఫిషర్ చెప్పింది.
ఇలా ఆమె అమెరికా, ఇండియా జీవన విధానాల మధ్య తేడాను కళ్లకుకట్టినట్టు వివరించడంతో ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.