Viral: 35 రోజుల వ్యవధిలో యువకుడికి 6 సార్లు పాము కాటు.. చివరకు ఏమైందంటే..
ABN , Publish Date - Jul 09 , 2024 | 04:09 PM
ముప్ఫైఐదు రోజుల వ్యవధిలో ఆరు సార్లు పాము కాటుకు గురైన ఓ వ్యక్తి ప్రతిసారీ ప్రాణాలతో బయటపడ్డాడు. స్థానికులతో మృత్యుంజయుడు అనిపించుకుంటున్న ఈ ఉత్తర్‌ప్రదేశ్ యువకుడికి ఉదంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ముప్ఫైఐదు రోజుల వ్యవధిలో ఆరు సార్లు పాము కాటుకు గురైన ఓ వ్యక్తి ప్రతిసారీ ప్రాణాలతో బయటపడ్డాడు. స్థానికులతో మృత్యుంజయుడు అనిపించుకుంటున్న ఈ ఉత్తర్‌ప్రదేశ్ (Uttapradesh) యువకుడికి ఉదంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం (Viral) అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఫతేపూర్ జిల్లాకు చెందిన వికాస్ దూబే (24) జూన్ 2న తన ఇంట్లోని మంచంపై నుంచి లేస్తుండగా పాము కాటేసింది. దీంతో, కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత అతడు కోలుకున్నారు. అది మొదలు అతడు తరచూ పాము కాటుకు గురవుతునే ఉన్నాడు. జులై 6 నాటికి ఏకంగా ఆరు సార్లు పాము కాటుకు గురయ్యాడు. నాలుగో పాము కాటు తరువాత వైద్యులు అతడిని ఇల్లు విడిచి మరో చోటకు వెళ్లాలని సూచించారు (Uttar Pradesh man bitten by snakes 6 times in 35 days).
Viral: సింహం వర్సెస్ పులి.. ఏది పవర్‌ఫుల్! ఈ వీడియోతో క్లారిటీ!
దీంతో, అతడు తమ బంధువు ఇంట్లో కొన్ని రోజులు ఉన్నారు. ఆ తరువాత తల్లిదండ్రులు మళ్లీ అతడిని ఇంటికి తీసుకొచ్చారు. ఆ వెంటనే మరోసారి పాము కాటుకు గురయ్యాడు. ఇక చివరి సారిగా జులై 6న అతడిని మరోసారి పాము కాటు వేసింది. ఈ క్రమంలో అతడి ఆరోగ్య పరిస్థితి దిగజారింది. బిడ్డను చూసి ఆందోళన చెందిన తల్లిదండ్రులు మరోసారి ఆసుపత్రిలో చేర్పించారు. అదృష్టం, వైద్యుల ప్రయత్నం ఫలించింది అతడు కోలుకున్నారు.
ఈ ఉదంతంపై స్థానిక మీడియాతో మాట్లాడిన అతడు తనను పాములు శని, ఆదివారాల్లోనే కాటేస్తున్నాయని తెలిపాడు. అంతేకాకుండా, పాము కాటుకు ముందు ప్రతిసారీ మనసు ఏదో కీడు శంకించి అశాంతికి లోనవుతుందని చెప్పుకొచ్చాడు.
ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం, ఏటా ప్రపంచవ్యాప్తంగా 27 లక్షల మంది పాముకాటుకు గురవుతున్నారు. వీరిలో 1.3 లక్షల మంది పాముకాటుకు బలవుతున్నారు. కొన్ని సందర్భాల్లో బాధితులను కాపాడేందుకు శస్త్రచికిత్స ద్వారా అవయవాలను కూడా తీసేయాల్సి రావడంతో శాశ్వత అంగవైకల్యం బారిన పడుతున్నారు.