Viral: సొరచేప పుట్టుక.. ఈ ‘మేజిక్’ ఎప్పుడైనా చూశారా? ఎంత ముద్దొస్తోందో! వైరల్ వీడియో!
ABN , Publish Date - Jul 30 , 2024 | 07:32 PM
దుబాయ్ మాల్ అండ్ అక్వేరియంలో ఓ పిల్ల సొరచేప పుట్టుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. జనాలు షాకైపోయేలా చేస్తోంది. ఇది నిజంగా అద్భుతమంటూ పిల్ల సొరను చూసి జనాలు మురిసిపోతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఈ భూమ్మీద జీవం పుట్టుకే ఓ అద్భుతం. ఏకకణ జీవి నుంచి ధరిత్రిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్న మానవుడి వరకూ జరిగిన పరిణామక్రమం శాస్త్రవేత్తలను ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తుంటుంది. ఇదంతా ఒకెత్తైతే తల్లి నుంచి కొత్త ప్రాణి ఉద్భవించడం మరో ఎత్తు. ప్రకృతి వింతలకు సాటిరాగలది మరొకటి లేదనేందుకు ఇది అసలైన ఉదాహరణ. ఇక, సముద్రజీవాల జననం మాత్రం నిజంగా అద్భుతమే. చాలా అరుదుగా మాత్రమే కనిపించే ఈ దృశ్యం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. దుబాయ్‌లోని ఓ అక్వేరియంలో బుజ్జి సొరచేప పుట్టిన తీరు చూసి జనాలు ముచ్చటపడిపోతున్నారు.
Viral: గుండు చేయించుకునేది ఇలాగా? నెటిజన్లను షేక్ చేస్తున్న వీడియో!
దుబాయ్ ఎక్వేరియం.. ప్రపంచంలోని అతి పెద్ద సస్పెండెడ్ అక్వేరియమ్‌లలో ఒకటి. అక్కడి సందర్శకులకు ఇటీవల ఓ అరుదైన దృశ్యం ప్రత్యక్షంగా చూసే అదృష్టం దక్కింది. అక్కడ ఓ సొరచేప ఓ పిల్ల సొరచేపకు జన్మనివ్వడం చూసి సందర్శకులు ఆశ్చర్యపోయారు. తల్లి సొర ఈదుతూనే పెద్ద సొరకు జన్మనిచ్చింది. తల్లి నుంచి బయటకొచ్చిన పిల్ల సొరచేప తొలుత కదలికలు లేకుండా నీటి అడుగుకు మునిగిపోయింది. కానీ, నేలకు తాకగానే దానిలో సడెన్‌గా చలనం వచ్చి మెరుపు వేగంతో ఈత కొడుతూ ముందుకు దూసుకుపోయింది. ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోవడం జనాలవంతైంది (Video Captures Rare Birth Of Baby Shark Inside Dubai Mall Aquarium ).
ఇక ఈ వీడియో నెట్టింట కూడా వైరల్‌గా మారింది. ఇంత అందమైన దృశ్యం తామెన్నడూ చూడలేదని వేలకొద్దీ కామెంట్స్ వచ్చిపడ్డాయి. పుట్టీపుట్టగానే పిల్ల సొర చేప చురుకుగా కలదడం అనేక మందిని ఆశ్చర్యపరిచింది. పిల్ల సొర సొంతంగా తినడం నేర్చుకునే వరకూ దాన్ని మరో అక్వేరియంలో ఒంటరిగా ఒదిలిపెట్టాలని కొందరు అన్నారు. ఇతర జంతువుల మధ్యలో ఉంచడం శ్రేయస్కరం కాదని చెప్పారు. తాము ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూశామని కొందరు అక్వేరియం సందర్శకులు సంబరపడిపోతూ చెప్పారు. ఇక దుబాయ్ అక్వేరియంను చూసేందుకు జనాలు పోటెత్తుతారని కొందరు జోస్యం చెప్పారు.
ఇక దుబాయ్ అక్వేరియం వెబ్‌సైట్ ప్రకారం, అక్కడ సుమారు 400 సొర చేపలు, రే చేపలు ఉంటాయట. అక్కడి అక్వేరియంలల్లో ఏకంగా 10 మిలియన్ లీటర్ల నీరు ఉంటుందట. ఇలాంటి అద్భుత దృశ్యాలు సందర్శకులకు చూపించేందుకు వీలుగా తాము ఏర్పాట్లు చేశామని దుబాయ్ అక్వేరియం నిర్వాహకులు వ్యాఖ్యానించారు. పిల్ల సొర చేప పుట్టుకకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం తెగ ట్రెండవుతోంది. మీరూ ఓ లుక్కేయండి మరి!