Lightning Strike: గాల్లో విమానంపై పిడుగు పడితే జరిగేది ఇదా!
ABN , Publish Date - Jul 26 , 2024 | 05:45 PM
గాల్లో విమానంపై పిడుగుపడితే సమస్యలేవీ ఉండవని నిపుణులు చెబుతున్నారు. విమానం ఉపరితలంపై నుంచే విద్యుత్ ప్రవహిస్తుందని, లోపల ప్రయాణికులకు, ఎలక్ట్రానిక్ పరికరాలకు ఎటువంటి అపాయం ఉండదని చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: విమాన ప్రయాణాల్లో విండోలోంచి చూస్తున్నప్పుడు క్షణకాలం పాటు తెల్లని వెలుగు కనిపించి మాయమైందా? ఆ వెంటనే పెద్ద శబ్దం వినపడిందా? అయితే విమానంపై పిడుగు పడినట్టే! ఒకానొక అంచనా ప్రకారం ప్రతి మూడు వేల విమానాల్లో ఒకదానిపై పిడుగు పడుతుందట! మరి విమానంపై పిడుగు పడ్డాక ఏమవుతుంది? ఇది ప్రమాదకరమా? అనే ఆసక్తికర ప్రశ్నలకు ఈ కథనంలో (Viral) సమాధానం తెలుసుకుందాం.
విమానాలను నిపుణులు గాల్లో ఎగిరే లోహపు గొట్టాలుగా అభివర్ణిస్తారు. సాధారణంగా పిడుగు పడినప్పుడు విమానం ఉపరితలం పైనుంచి విద్యుత్ ప్రవహిస్తుంది. అంటే, ఇది ఓ ఫారెడే కేజ్‌లాగా పనిచేస్తుంది. పిడుగుపాటు వల్ల జనించే విద్యుత్ విమానంపై ఒక వైపు నుంచి మరో వైపునకు ప్రయాణించి బయటకు వెళ్లిపోతుంది. లోపలున్న ప్రయాణికులను, ఇతర యంత్ర పరికరాలను చేరదు (what happens when a plane is struck by lightning).
Viral: పురుగుపై కోపంతో రెచ్చిపోయాడు.. చివరకు తన కన్నునే పోగొట్టుకున్నాడు
అంతేకాకుండా, విమానాన్ని పిడుగుపాటు నుంచి రక్షించేందుకు ఇంజినీర్లు అనేక ఇతర వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో విమానాల విడిభాగాలను విద్యుత్ నిరోధక లక్షణాలు ఎక్కువగా ఉన్న కాంపోజిట్ పాదార్థాలు, లోహాలతో తయారు చేస్తున్నారు. దీంతో, పిడుగుపడినా వాటిల్లో విద్యుత్ ప్రవహించే అవకాశం బాగా తగ్గిపోతుంది. ఇక, విమానం రెక్కల చివరన చిన్న చిన్న లోహ రాడ్లు కూడా ఉంటాయి. పిడుగుపడినప్పుడు ఈ రాడ్ల మీదుగా విద్యుత్ నిర్దేశిత మార్గాల్లో విమానానికి ఎటువంటి అపాయం లేకుండా ప్రయాణించేలా ఏర్పాట్లు ఉంటాయి. అయితే, కొన్ని సందర్భాల్లో పిడుగుపాటు తరువాత విమానంలోని పరికరాల స్క్రీన్లు లిప్తకాలం పాటు ఆగిపోయినట్టు కనిపిస్తాయి కానీ ఇదేమంత పెద్ద సమస్య కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రయాణికులకు పెద్ద శబ్దం వినబడటం మినహా మరే అపాయం ఉండదని అంటున్నారు.
పిడుగుపాటుతో విమానాలకు సాధారణంగా ఎటువంటి ప్రమాదం లేకపోయినప్పటికీ పైలట్లు మాత్రం అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఇలాంటి సందర్భాలు తలెత్తినప్పుడు ముందుగా వారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందికి సమాచారం అందిస్తారు. అవసరమనుకుంటే విమానాన్ని సమీపంలోని ఎయిర్‌పోర్టులో దింపేస్తారు. ఆ తరువాత విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసి, అంతా సవ్యంగా ఉందని నిర్ధారించుకున్నాకే విమానం బయలుదేరుతుంది. ఇక టైమ్ మ్యాగజైన్ ప్రకారం, పిడుగుపాటు కారణంగా విమానాలు కూలిన ఘటనలు 1967 తరువాత ఒక్కటి కూడా జరగలేదట.