Viral: ఎంత మోసం.. మంచానపడ్డ భర్తకు సేవలు చేసి కోలుకునేలా చేస్తే..
ABN , Publish Date - Nov 12 , 2024 | 10:15 PM
మంచానపడ్డ భర్తకు ఆరేళ్ల పాటు రాత్రి పగలు సేవలు చేసి అతడు కోలుకునేలా చేసిందో భార్య. ఆరోగ్యం బాగుపడ్డ రోజుల వ్యవధిలోనే అతడు మరో వివాహం చేసుకున్నాడు. మలేషియాలో ఈ ఘటన వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: భార్యాభర్తల బంధానికి పునాది నమ్మకమే. కలిమిలేముల్లో సుఖదుఃఖాల్లో జీవితభాగస్వామి వెన్నంటే ఉంటారన్న విశ్వాసమే కుటుంబాన్ని నిలబడెతుంది. ఈ విషయాన్ని మనసా వాచా కర్మణా నమ్మిందో వివాహిత. భర్త మంచాన పడితే అన్నీ తానై అతడికి అండగా నిలిచింది. రాత్రి పగలూ తేడా లేకుండా చాకిరీ చేసింది. ఆమె ఆప్యాయతానురాగాలు, నిస్వార్థ సేవ అతడిని కోలుకునేలా చేశాయి. కానీ ఆరోగ్యం మెరుగుపడ్డ వారంలోపే అతడు ఆమె నమ్మకాన్ని వమ్ము చేశాడు. పవిత్రమైన వైవాహిక బంధాన్ని అపహాస్యం చేశాడు (Viral).
Viral: జపాన్ వీధుల పరిశుభ్రతను పరీక్షించిన భారతీయ యువతి! రిజల్ట్స్ చూసి షాక్
మలేషియాకు చెందిన ఓ యువతికి 2016లో వివాహమైంది. ఆ తరువాత వివిధ కారణాల రీత్యా భార్యాభర్తలు రెండేళ్ల పాటు వేర్వేరుగా గడిపారు. ఆ తరువాత ఒక చోట కాపురం పెట్టిన వారికి సంతానం కూడా కలిగింది. అయితే, ఆ ఆనందం జంటకు ఎక్కువ కాలం మిగల్లేదు. ఓరోజు యువతి భర్తకు పెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడ్డ అతడు మంచానికి పరిమితం కావాల్సి వచ్చింది. నడుము కింద భాగం మొత్తం చచ్చుబడిపోవడంతో మరో వ్యక్తి సాయం లేనిదే క్షణం కూడా గడవని స్థితికి చేరుకున్నాడు.
Viral: పెళ్లిలో వధూవరులకు భారీ షాక్! మా తప్పేంటో చెప్పండంటూ ఆవేదన
అలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఆమె తన భర్తకు అండగా నిలిచింది. ఓవైపు కన్నబిడ్డను పెంచుతూనే భర్తకు అన్నీ తానై సేవలు చేసింది. రాత్రి పగలూ తేడా లేకుండా అతడి వెన్నంటే ఉండేది. అన్ని సపర్యలు చేసి అతడికి ఏ లోటూ రాకుండా చూసుకుంది. కష్టసమయంలో భూమాత అంత సహనం వహించి కుటుంబాన్ని కాపాడుకుంది. ఆరేళ్ల పాటు అతడికి నిర్విరామంగా చాకిరీ చేసింది. ఆమె సేవలకు తోడు అదృష్టం కూడా కలిసి అతడు కోలుకున్నాడు. పూర్వ ఆరోగ్యాన్ని సంతరించుకున్నాడు.
ఆ తరువాత అతడు తన దుర్బుద్ధిని ప్రదర్శించాడు. కోలుకున్న వారం రోజులకే అతడు మరో ఆలోచన లేకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య కుటుంబసభ్యులు ఎంత మొత్తుకున్నా అతడు వినిపించుకోలేదు. కానీ యువతి మాత్రం అతడిని ఏనాడు తప్పుబట్టలేదు సరికదా తన బిడ్డకు తండ్రి అయిన అతడికి ఎవరూ పల్లెత్తు మాట అనడానికి వీల్లేదని చెప్పుకొచ్చింది. దీంతో, ఆమె ఉదంతం దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో అంతా షాకైపోయారు. భర్తను ఎంతో ప్రేమించిన ఆమె చివరకు అతడి చేతిలోనే మోసపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Viral: ప్రసవ సమయంలో డాక్టర్ల పొరపాటు.. 18 ఏళ్లుగా మహిళకు నరకం