Viral: రూ.70 లక్షల క్యాష్‌తో లగ్జరీ షాపులోకి వెళ్లిన మహిళ ఏం చేసిందో చూస్తే..
ABN , Publish Date - Aug 23 , 2024 | 09:01 PM
లగ్జరీ షాపు సిబ్బంది తనతో అవమానకరంగా వ్యవహరించడంతో ఆగ్రహానికి గురైన ఓ చైనా మహిళ ఊహించని విధంగా ప్రతీకారం తీర్చుంది. తన వద్ద ఉన్న రూ.70 లక్షల నగదును వారితో లెక్కించమని చెప్పి చివరి నిమిషంలో ఏదీ కొనకుండా వెనుదిరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: అది ప్రముఖ లగ్జరీ బ్రాండ్ లూయీ వుటాన్‌కు చెందిన షాపు. నచ్చిన వస్తువులు కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో ఓ చైనా మహిళ ఆ షాపులో అడుగుపెట్టింది. ఆమె తమ తాహతుకు సరితూగదనుకున్నారో ఏమో కానీ షాపులోని సిబ్బంది మాత్రం ఆమెతో సరిగా వ్యవహరించలేదు. కోరిన ఖరీదైన వస్తువులు కాకుండా చౌకబారు వస్తువులు చూపించారు. ఆమె విజ్ఞప్తుల్ని పలుమార్లు బుట్టదాఖలు చేశారు. వారి తీరును అవమానంగా భావించిన ఆమె ఊహించని రివెంజ్ తీర్చుకుంది. ఈ ఘటన ప్రస్తుతం చైనాలోనే కాకుండా నెట్టింట కూడా వైరల్‌గా (Viral) మారింది.
Viral: భార్యపై డౌట్‌తో పడక గదిలో సీక్రెట్ కెమెరాలు! చివరకు ఏమైందో తెలిస్తే..
చాంగ్‌కింగ్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. లూయీ వుటాన్ షాపులోని సిబ్బంది తీరుతో తీవ్ర ఆగ్రహం చెందిన ఆమె వారిపై గతంలో ఎవ్వరు ఊహించని తీరులో ప్రతీకారం తీర్చుకుంది. ఏకంగా రూ.70 లక్షల క్యాష్‌తో రెండోసారి షాపులో కాలుపెట్టిన ఆమె అవీఇవీ కొంటానంటూ వారి చేతిలో తన నగదు మొత్తం పెట్టింది. మంచి క్యాష్ పార్టీ అన్న ఉద్దేశంతో సంబరపడ్డ వారు ఆమె ఇచ్చిన నగదు మొత్తం చాలా కష్టపడి లెక్కపెట్టారు. అయితే, చివరి నిమిషంలో ప్లేట్ మార్చిన ఆమె తనకు ఏ వస్తువూ నచ్చలేదంటూ వారికిచ్చిన క్యాష్ మొత్తం వెనక్కు తీసేసుకుంది. దీంతో, క్యాష్ లెక్కపెట్టేందుకు వారు పడ్డ కష్టమంతా వృథా అయిపోయింది. అయితే, ఈ ఘటనపై సంస్థకు చెందిన వారెవరూ స్పందించలేదని సమాచారం.
అచ్చు హాలీవుడ్ సినిమాలో మహిళ తీర్చుకున్న ప్రతీకారం నెట్టింట వైరల్‌గా మారింది. జనాలు ఆమెపై ప్రశంసలు కురిపించారు. ఇలాంటి ప్రతీకారాలతోనే కళ్లునెత్తికెక్కిన వారికి బుద్ధి వస్తుందని కొందరు కామెంట్ చేశారు. మంచి పనిచేశావంటూ పలువురు మహిళను పొగడ్తల్లో ముంచెత్తారు. కాగా, 2021లో కూడా ఓ లగ్జరీ బ్రాండ్ స్టోర్‌లో ఓ కస్టమర్‌కు ఇదే తరహా అనుభవం ఎదురైంది. సాధారణ దుస్తుల్లో మేకప్ లేకుండా వచ్చిన ఆమెతో షాపు సిబ్బంది అమర్యాదకరంగా ప్రవర్తించారు. అలసటతో ఉన్న ఆమె చిన్న కునుకులోకి జారుకోవడంతో వారు నిద్రలేపి ఆమెను బయటకు వెళ్లమని పలుమార్లు చెప్పారు. ఈ విషయాన్ని ఆమె నెట్టింట పంచుకోవడంతో సదరు షాపు యాజమాన్యం చివరకు క్షమాపణలు చెప్పింది.