Share News

Viral: ఆగకుండా డోర్ బెల్ కొట్టిన అపరిచిత మహిళ! తలుపు తెరిచి చూస్తే..

ABN , Publish Date - Sep 02 , 2024 | 01:43 PM

బెంగళూరులో ఉంటున్న ఓ వ్యక్తికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఇంటికొచ్చిన ఓ అపరిచిత మహిళ తనను ఏకంగా రూ.15 వేలు అడగడంతో నివ్వెరపోయిన అతడు ఈ ఉదంతాన్ని నెట్టింట పంచుకున్నాడు.

Viral: ఆగకుండా డోర్ బెల్ కొట్టిన అపరిచిత మహిళ! తలుపు తెరిచి చూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరులో ఉంటున్న ఓ వ్యక్తికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఇంటికొచ్చిన ఓ అపరిచిత మహిళ తనను ఏకంగా రూ.15 వేలు అడగడంతో నివ్వెరపోయిన అతడు ఈ ఉదంతాన్ని నెట్టింట పంచుకున్నాడు. అతడు చెప్పింది విని నెటిజన్లు కూడా షాకైపోతున్నారు (Viral).

kvak95 పేరిట రెడిట్‌లో సదరు వ్యక్తి తనకెదురైన అనుభవాన్ని పంచుకున్నాడు. ఇటీవల ఓ రోజు ఓటీటీలో ఏదో సినిమా చూస్తూ నిద్రలోకి జారుకోగా సడెన్‌గా తలుపు చప్పుడు అవడంతో మెళకువ వచ్చిందని అన్నాడు. తలుపు తీసి చూస్తే ఎదురుగా ఓ 40 ఏళ్ల అపరిచిత మహిళ తన మైనర్ కూతురితో నిలబడి కనిపించిందని అన్నాడు. ఏం జరిగిందని ఆరా తీస్తే తన బిడ్డ పెళ్లని, రూ.15 వేలు ఇవ్వాలని కోరినట్టు చెప్పుకొచ్చాడు. ఆమె అంత మొత్తం చాలా సింపుల్‌గా అడిగేయడంతో తాను అవాక్కయ్యానని చెప్పుకొచ్చాడు.

Viral: బ్రిడ్జి పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం! కారుపై పడటంతో ప్యాసెంజర్ మృతి


‘‘నాకు కన్నడ రాకపోయినా కూడా పెళ్లి అన్న మాట వినపడగానే షాకైపోయా. మైనర్‌కు పెళ్లి ఏమిటని ప్రశ్నించా. నీకు తెలుగు గానీ హిందీ గానీ వచ్చా అని ఆమె అడిగింది. నాకు తెలుగు వచ్చని చెప్పడంతో తన కూతురికి పక్కనే గుళ్లో వివాహమని చెప్పింది. పెళ్లికి డబ్బులు తక్కువ పడటంతో నా సాయం కావాలని కోరింది. నేను కోపంలో ఆమెపై అరిచా. నా నిద్ర చెడగొట్టినందుకు విసురుగా తలుపు వేశా. కానీ అలా చేయడం తప్పని అనిపించి ఆ తరువాత బాధపడ్డా. ఇదేమైనా కొత్త స్కామా. అత్యవసరం పేరిట జనాల నుంచి ఇలా డబ్బులు వసూలు చేస్తున్నారా?’’ అని ప్రశ్నించాడు. బాలిక మైనర్ అయినందుకు ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేయాలో వద్దో చెప్పండంటూ నెటిజన్ల సలహా కోరాడు.


ఈ పోస్టుకు నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఇది కచ్చితంగా స్కామే అని కొందరు బదులిచ్చారు. ‘‘మొదటి సారి నేను ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు బాధపడ్డా. ఎంతో కొంత డబ్బు ఇచ్చుంటే బాగుండేదని అనిపించింది. కానీ ఆ తరువాత ఇలాంటి వారు ముగ్గురు నలుగురు తారసపడ్డారు. దీంతో, వాళ్లతో మాట్లాడటం మానేసి నా పని నేను చేసుకోవడం ప్రారంభించా’’ అని చెప్పుకొచ్చారు. దేశంలో చాలా చోట్ల కొందరు ఇలాంటి టెక్నిక్‌లతో భిక్షాటనకు యత్నిస్తున్నారని మరికొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం నెట్టింట ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

Read Latest and Viral News

Updated Date - Sep 02 , 2024 | 01:48 PM