Viral: విమానంలో టీ ఒలకడంతో గాయాలు! రూ.12 కోట్ల పరిహారం కోరుతూ కేసు!
ABN , Publish Date - Jul 15 , 2024 | 07:21 PM
ఒంటిపై టీ ఒలకడంతో తీవ్ర గాయాల పాలైన విమానప్రయాణికురాలు ఎయిర్‌లైన్స్ నుంచి రూ.12 కోట్ల పరిహారం కోరుతూ కేసు దాఖలు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఒంటిపై టీ ఒలకడంతో తీవ్ర గాయాల పాలైన విమానప్రయాణికురాలు ఎయిర్‌లైన్స్ నుంచి రూ.12 కోట్ల పరిహారం కోరుతూ కేసు దాఖలు చేసింది. అమెరికాలో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
టజానా లూయిస్ అనే మహిళ తన ఐదేళ్ల చిన్నారితో కలిసి ఫ్లోరిడాలోని ఓర్లాండో నుంచి కనెక్టీకట్ లోని హార్ట్‌ఫోర్డ్‌కు జెట్‌బ్లూ ఎయిర్‌లైన్స్ విమానంలో బయలుదేరింది. విమానం మార్గమధ్యంలో ఉండగా సిబ్బంది ప్యాసెంజర్లకు టీ ఇచ్చారు. ఆ సమయంలో విమానంలో సీటు బెల్టు పెట్టుకునే ఉండాలన్న సంకేతం కనిపించిందని ఆమె చెప్పింది. ఇక టీ ఇచ్చే సమయంలో టర్బులెన్స్ కారణంగా విమానం గాల్లో ఒడిదుడుకులకు లోను కావడంతో వేడి వేడి టీ తనపై ఒలికి తీవ్ర గాయాల పాలయ్యాయని చెప్పుకొచ్చింది (Woman Seeks Rs 12 Crore Compensation After Traumatic Incident In Flight Turbulence).
Viral: వీడసలు మనిషేనా!? రైలు బయలుదేరగానే డోర్ పక్కన రాడ్ పట్టుకుని..
సీటు బెట్లు పెట్టుకోవాలన్న సంకేతం ఉండగా టీ సరఫరా ఎలా చేస్తారని లూయిస్ ప్రశ్నించింది. విమానంలో అంత వేడి టీ ఎలా ఇచ్చారని ప్రశ్నించింది. వేడి వేడి పానీయాలను అందించే విషయంలో సిబ్బంది ప్రమాణాలను పాటించలేదని ఆలోపించింది. తన గాయాలు తీవ్రమైనవని, అందవిహీనంగా మారిన తనకు స్కిన్ గ్రాఫ్టింగ్ అవసరమవుతుందని చెప్పింది. ఆ తరువాత కూడా ఒంటిపై గాయం తాలూకు మచ్చ శాశ్వతంగా మిగిలిపోతుందని పేర్కొంది.
తన గాయం చూసి పక్కనే ఉన్న చిన్నారి కూడా తల్లిడిల్లిపోయిందని చెప్పింది. ఘటన తరువాత తాను తీవ్ర ఒత్తిడి వేదన ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. గాయం కారణంగా తన పనిచేసే సామర్థ్యం కూడా సన్నగిల్లిందని, రోజు వారి పనులు కూడా ఇబ్బంది కరంగా మారాయని తన కేసులో మహిళ పేర్కొంది. తన క్లయింట్ విషయంలో విమానయాన సంస్థ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మహిళ తరపు లాయర్ పేర్కొన్నారు. గాయాలైన తరువాత ఆమెకు సరైన సాయం అందించడంలో విమాన సిబ్బంది తడబడ్డారని పేర్కొన్నారు.