Jay Shah: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడాల్సిన అవసరం లేదు.. బీసీసీఐ కార్యదర్శి జై షా ఏమన్నారంటే..
ABN , Publish Date - Aug 16 , 2024 | 11:23 AM
జాతీయ జట్టు తరఫున ఆడుతున్న ప్రముఖ క్రికెటర్లు కూడా దేశవాళీ మ్యాచ్‌లు ఆడాలని బీసీసీఐ ఎప్పట్నుంచో ఒత్తిడి తీసుకొస్తుంది. దేశవాళీ ట్రోఫీలకు దూరంగా ఉంటున్న క్రికెటర్లను కాంట్రాక్టులు కూడా ఇవ్వకూడదని నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 5వ తేదీ నుంచి దులీప్ ట్రోఫీ ప్రారంభం కాబోతోంది.
జాతీయ జట్టు తరఫున ఆడుతున్న ప్రముఖ క్రికెటర్లు కూడా దేశవాళీ మ్యాచ్‌లు ఆడాలని బీసీసీఐ (BCCI) ఖరాఖండీగా చెబుతోంది. ఈ మేరకు ఎప్పట్నుంచో ఒత్తిడి తీసుకొస్తుంది. దేశవాళీ ట్రోఫీలకు దూరంగా ఉంటున్న క్రికెటర్లకు కాంట్రాక్టులు కూడా ఇవ్వకూడదని నిర్ణయం తీసుకుంది. ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ విషయంలో ఇదే జరిగింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 5 నుంచి ఆరంభం కానున్న దులీప్ ట్రోఫీలో (Duleep Trophy) భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు క్రికెటర్లు బరిలోకి దిగుతున్నారు. అయితే విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) మాత్రం ఆడే అవకాశం కనిపించడం లేదు.
దులీప్ ట్రోఫీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడకపోవడం గురించి బీసీసీఐ కార్యదర్శి జై షా (BCCI Secretary Jay Shah) స్పందించారు. ‘‘రోహిత్, కోహ్లీ వంటి ఆటగాళ్లను దులీప్ ట్రోఫీలో ఆడాల్సిందిగా ఒత్తిడి చేయలేం. వాళ్లకు గాయాలు అయ్యే ప్రమాదం ఉంది. అయినా వాళ్లు దేశవాళీ మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం లేదు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి దేశాల్లో జాతీయ క్రికెటర్లందరూ దేశవాళీ మ్యాచ్‌లు ఆడరు. కొందరు ఆటగాళ్లకు మనం గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది’’ అని జై షా పేర్కొన్నారు.
ఇక, వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు పాల్గొనడం గురించి కూడా షా స్పందించారు. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయంపై ఒక ప్రకటన చేశారు. ‘‘ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు టీమిండియా పాకిస్థాన్‌కు వెళ్లే విషయంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. టోర్నీ దగ్గర పడ్డాక నిర్ణయం తీసుకుంటాం’’ అని షా వెల్లడించారు. ఐసీసీకి పాకిస్థాన్స మర్పించిన షెడ్యూల్ ప్రకారం.. ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 19, 2025 నుంచి మార్చి 9, 2025 వరకు జరగాల్సి ఉంది. కాగా, పాకిస్థాన్ సమర్పించిన ముసాయిదా షెడ్యూల్‌ను ఐసీసీ ఇప్పటి వరకు ఆమోదించలేదు.
ఇవి కూడా చదవండి..
తీర్పుపై స్విస్ కోర్టుకు.. వినేశ్ ఫొగట్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..