Share News

టీమిండియా వరుస ఓటములు.. గంభీర్ స్పెషల్ పవర్స్ పై బీసీసీఐ నజర్

ABN , Publish Date - Nov 04 , 2024 | 12:42 PM

వరుస ఓటములతో సతమతమవుతున్న టీమిండియాపై అభిమానులు సైతం మండిపడుతున్నారు. పేలవ ప్రదర్శనతో పరువు తీస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు సైతం ఈ వివాదం సెగ తాకుతోంది.

టీమిండియా వరుస ఓటములు.. గంభీర్ స్పెషల్ పవర్స్ పై బీసీసీఐ నజర్
Gautam Gambhir

ముంబై: టీమిండియా పేలవ ప్రదర్శనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న వేళ జట్టు హెడ్ కోచ్ పాత్రపైనా చర్చ జరుగుతోంది. ఈ ఏడాది జులైలో గౌతమ్ గంభీర్ కు బీసీసీఐ కోచ్ పదవి కట్టబెట్టిన సంగతి తెలిసిందే. అతని నియామకం తర్వాత భారత్ శ్రీలంకతో వన్డే సిరీస్‌ను కోల్పోయింది. న్యూజిలాండ్‌తో హోమ్ టెస్ట్ సిరీస్ లో వైట్‌వాష్‌ కు గురైంది. స్వదేశంలో జరిగిన టెస్టులో భారత్‌ వైట్‌వాష్ కావడం ఇది తొలిసారి. గంభీర్ నేతృత్వంలో రెండో సిరీస్ ను భారత్ కోల్పోయింది. దీంతో రాబోయే ఆస్ట్రేలియా పర్యటనపైనా అనుమానాలు తలెత్తుతున్నాయి. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాలో భారత్ ఐదు టెస్టులు ఆడనున్న సంగతి తెలిసిందే. ప్రధాన కోచ్‌ అయిన గంభీర్ భవిష్యత్తు ఈ పర్యటనపైనే ఆధారపడి ఉంది.


సూపర్ పవర్స్ పై కోత..

జట్టు ప్రదర్శన ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో బీసీసీఐ గంభీర్ అధికారాలను పరిమితం చేసే చాన్స్ కనపడుతోంది. రానున్న ఆసిస్ పర్యటనలో గంభీర్ అద్భుతం చేస్తే తప్ప దీని నుంచి తప్పించుకోవడం కష్టం. "గంభీర్‌కు కన్నా ముందు రవిశాస్త్రి, రాహుల్ ద్రవిడ్ వంటి వారు టీమిండియా కోచ్ బాధ్యతలు చేపట్టినప్పటికీ వారెవ్వరికీ ఇవ్వనన్ని పవర్స్ ను బీసీసీఐ గంభీర్ కు ఇచ్చింది. బీసీసీఐ రూల్ బుక్ ప్రకారం.. సెలక్షన్ కమిటీ సమావేశాలలో కోచ్‌లను అనుమతించదు. కానీ ఆస్ట్రేలియా టూర్ ఎంపిక సమావేశానికి గంభీర్ ను ఆహ్వానించారు.


సెలక్షన్ విషయాల్లో గంభీర్ జోక్యం..

ఎంపికల విషయాల్లో గంభీర్ చురుకుగా వ్యవహరించడం కూడా పలు విమర్శలకు తావిస్తోంది. ప్రధాన కోచ్‌ల ఎంపికలో పాల్గొనకూడదని బీసీసీఐ నిబంధనలు పేర్కొన్నప్పటికీ.. ఆస్ట్రేలియా పర్యటనకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా గంభీర్‌కు మినహాయింపు ఇచ్చారు. రోహిత్ శర్మ ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత భారత టీ20 కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాకు బదులు సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపికచేయడంలోనూ గంభీర్ కీలక పాత్ర పోషించాడు.


గంభీర్ ఎంపిక నిర్ణయాలపై చర్చ..

కేవలం తొమ్మిది ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం హర్షిత్ రాణాను ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌కు ఎంపిక చేయాలని గంభీర్ తీసుకున్న నిర్ణయం కూడా చర్చకు దారితీసింది. సీమ్ బౌలింగ్ ఆల్ రౌండర్‌గా హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయంగా నితీష్ రెడ్డి ఎంపికలోనూ గంభీర్ వైఖరి స్పష్టంగా కనిపించింది. అతడు తీసుకున్న ఈ నిర్ణయాలన్నీ కోచ్ గా గంభీర్ భవిష్యత్తుపై ప్రభావం చూపనున్నాయి.

పరువూ దక్కలేదు


Updated Date - Nov 04 , 2024 | 12:42 PM