IND vs NZ: భారత్ ఎదుట భారీ లక్ష్యం..కివీస్ కట్టడి కష్టమేనా..
ABN , Publish Date - Oct 25 , 2024 | 06:01 PM
కివీస్ జట్టుతో రెండో రోజు ఆటలోనూ టీమిండియా రాణించలేకపోయింది. దీంతో శనివారం నాటి మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారనుంది.
పూణె: న్యూజిలాండ్, భారత్ మధ్య రెండో రోజు ఆట ముగిసింది. పూణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న న్యూజిలాండ్ ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు నష్టపోయింది. మొత్తం 198 పరుగులు చేసింది. ప్రస్తుతం కివీస్ జట్టు 301 పరుగుల ఆధిక్యంలో ఉంది. శనివారం జరగనున్న మ్యాచ్ లో కూడా కివీస్ ఇదే దూకుడుగా ముందుకెళ్తే టీమిండియా ముందు భారీ లక్ష్యాన్ని నిలిపే అవకాశం ఉంది.
ఇప్పటికే తొలి మ్యాచ్ లో చతికిలపడ్డ భారత జట్టు నేటి మ్యాచ్ లోనూ కివీస్ జట్టు ధాటికి ఒక్కొక్కరుగా పెవిలియన్ బాట పట్టారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్పా ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవడం కష్టమని ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు రోహిత్ శర్మ కెప్టెన్సీపై పలువురు మండిపడుతున్నారు. మూడో రోజు ఆటలో న్యూజిలాండ్ 50-100 పరుగులు జోడించినా.. కివీస్ జట్టును కట్టడి చేయడం కష్టమనే వాదనలు వినిపిస్తున్నాయి.
న్యూజిలాండ్ ప్లేయర్లు మాత్రం భారత్ పై గెలుపే లక్ష్యంగా సాగుతున్నారు. టామ్ లాథమ్ (86; 133 బంతుల్లో 10×4) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. విల్ యంగ్ (23), డేరియల్ మిచెల్ (18) రాణించారు. ప్రస్తుతం టామ్ బ్లండెల్ (30), ఫిలిప్స్ (9) క్రీజులో ఉన్నారు. భారత్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు తీయగా, రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ పడగొట్టాడు.