Share News

India vs England: మూడో టెస్టు భారత్‌దే.. ఇంగ్లండ్‌పై ఘనవిజయం

ABN , Publish Date - Feb 18 , 2024 | 05:05 PM

ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా.. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. భారత జట్టు నిర్దేశించిన 557 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు.. టీమిండియా స్పిన్నర్ల ధాటికి 122 పరుగులకే కుప్పకూలింది.

India vs England: మూడో టెస్టు భారత్‌దే.. ఇంగ్లండ్‌పై ఘనవిజయం

ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా.. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. భారత జట్టు నిర్దేశించిన 557 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు.. టీమిండియా స్పిన్నర్ల ధాటికి 122 పరుగులకే కుప్పకూలింది. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లలో ఏ ఒక్కరూ కూడా క్రీజులో ఎక్కువసేపు నిలదొక్కుకోలేకపోయారు. వచ్చిన వాళ్లు వచ్చినట్టే పెవిలియన్ బాట పట్టారు. దీంతో.. భారత్ ఏకంగా 434 పరుగుల భారీ తేడాతో విజయం కైవసం చేసుకుంది.


తొలుత 126 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన భారత జట్టు.. నాలుగు వికెట్ల నష్టానికి 430 పరుగులు చేసి డిక్లేర్ ప్రకటించింది. యశస్వీ జైస్వాల్ (214) ద్విశతకం, శుభ్‌మన్ గిల్ (91) & సర్ఫరాజ్ ఖాన్(68)ల అర్థశతకాల పుణ్యమా అని టీమిండియా అంత భారీ స్కోరు చేయగలిగింది. దీంతో.. ఇంగ్లండ్ ముందు 557 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం లక్ష్య ఛేధనలో భాగంగా.. ఇంగ్లండ్ జట్టు పేకమేడలా కుప్పకూలింది. కేవలం 122 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మార్క్ వుడ్ ఒక్కడే 33 పరుగులతో హయ్యస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. ఆరుగురు బ్యాటర్లు రెండెంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తీసి.. ఇంగ్లండ్ బ్యాటింగ్ పతనాన్ని శాసించాడు.

అంతకుముందు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత జట్టు 445 పరుగులకి ఆలౌట్ అయ్యింది. రోహిత్ శర్మ (131), రవీంద్ర జడేజా (112) శతకాలతో ఊచకోత కోయగా.. సర్ఫరాజ్ ఖాన్ 62 పరుగులతో అంతర్జాతీయ టెస్టుల్లోకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ (46) సైతం మెరుగ్గా రాణించాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 319 పరుగులకి ఆలౌట్ అయ్యింది. బెన్ డకెట్ (153) ఒంటరి పోరు పుణ్యమా అని.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో అంత స్కోరు చేసింది. కానీ.. సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం అందరూ చేతులెత్తేయడంతో.. ఈ అవమానకరమైన పరాభావాన్ని చవిచూడాల్సి వచ్చింది.

Updated Date - Feb 18 , 2024 | 05:05 PM