Share News

T20 World Cup: బాల్ టాంపరింగ్‌ ఆరోపణలు.. అర్షదీప్ సింగ్ అదెలా చేశాడు?

ABN , Publish Date - Jun 26 , 2024 | 02:51 PM

తమ పరిస్థితి ఎంత దుర్భరంగా ఉన్నా.. ఇతరులపై విషం చిమ్మే తమ దుర్భుద్ధిని మాత్రం పాకిస్తానీయులు మానుకోరు. మరీ ముఖ్యంగా.. భారత్‌ని లక్ష్యంగా చేసుకొని ఏవేవో ఆరోపణలు చేస్తుంటారు.

T20 World Cup: బాల్ టాంపరింగ్‌ ఆరోపణలు.. అర్షదీప్ సింగ్ అదెలా చేశాడు?
Arshdeep Singh

తమ పరిస్థితి ఎంత దుర్భరంగా ఉన్నా.. ఇతరులపై విషం చిమ్మే తమ దుర్భుద్ధిని మాత్రం పాకిస్తానీయులు మానుకోరు. మరీ ముఖ్యంగా.. భారత్‌ని లక్ష్యంగా చేసుకొని ఏవేవో ఆరోపణలు చేస్తుంటారు. ఇప్పుడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ (Inzamam Ul Haq) కూడా భారత జట్టుపై తన అక్కసు వెళ్లగక్కాడు. టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) టైటిల్ దిశగా టీమిండియా దూసుకుపోతుండటం చూసి ఓర్వలేక.. ఏకంగా బాల్ టాంపరింగ్ ఆరోపణలు గుప్పించాడు. సూపర్-8లో భాగంగా.. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌ సింగ్‌ (Arshdeep Singh) అసాధారణమైన రివర్స్‌ స్వింగ్‌ను రాబట్టాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.


‘‘అర్ష్‌దీప్ సింగ్ 16వ ఓవర్‌లో బౌలింగ్ చేసినప్పుడు బంతి రివర్స్ అవుతోంది. సాధారణంగా బంతి పాతబడ్డాక రివర్స్ స్వింగ్ అవుతుంది కానీ.. కొత్త బంతితో అర్ష్‌దీప్ రివర్స్ స్వింగ్ ఎలా రాబట్టాడు? అదెలా సాధ్యం అవుతుంది? ఇలాంటి విషయాలను గుర్తించేందుకు అంపైర్లు అలర్ట్‌గా ఉండాలి. ఒకవేళ పాకిస్తానీ బౌలర్లు రివర్స్ స్వింగ్ చేసి ఉంటే.. అది పెద్ద వివాదంగా మారేది. రివర్స్ స్వింగ్ గురించి మాకు బాగా తెలుసు. 16వ ఓవర్‌లో అర్ష్‌దీప్ బంతిని రివర్స్ స్వింగ్ చేయగలిగాడంటే.. అంతకుముందే ఏదో జరిగే ఉంటుందని అర్థం’’ అంటూ ఇంజమామ్ ఉల్ హక్ చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్‌కు చెందిన ఓ టీవీ ఛానల్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను ఈ వ్యాఖ్యలు చేయగా.. క్రీడావర్గాల్లో ఇవి తీవ్ర దుమారం రేపుతున్నాయి.


కాగా.. భారత జట్టుపై పాకిస్తానీయులు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో హసన్ రజా (Hasan Raza) అందరి ఫ్యూజులు ఎగిరిపోయేలా వ్యాఖ్యలు చేశాడు. 2023 వన్డే వరల్డ్‌కప్ సమయంలో మహమ్మద్ షమీ (Mohammed Shami) అద్భుతంగా బౌలింగ్ వేయడం చూసి.. టీమిండియా బంతిలో కొన్ని చిప్‌లను ఉపయోగించిందని హసన్ ఆరోపించాడు. ఆ టైంలో అతని ఆరోపణలపై స్ట్రాంగ్ కౌంటర్లు కూడా వచ్చాయి. అసలు బంతిలో చిప్ ఎలా పెట్టగలరంటూ అతనితో భారత క్రికెట్ అభిమానులు చెడుగుడు ఆడేసుకున్నారు. అయినా వారి తీరు మారలేదని.. తాజాగా ఇంజమామ్ వ్యవహారంతో తేలిపోయింది.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jun 26 , 2024 | 02:51 PM