Share News

India vs England: ఇంగ్లండ్‌పై భారత్ విజయం.. మరోసారి విషం చిమ్మిన పాకిస్తాన్

ABN , Publish Date - Jun 28 , 2024 | 03:07 PM

టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు మరో గండం గట్టెక్కింది. సెమీ ఫైనల్స్‌లో ఇంగ్లండ్‌పై ఘనవిజయం సాధించి ఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. దీంతో భారత క్రీడాభిమానుల సంబరాలు అంబరాన్ని...

India vs England: ఇంగ్లండ్‌పై భారత్ విజయం.. మరోసారి విషం చిమ్మిన పాకిస్తాన్
Inzamam Ul Haq

టీ20 వరల్డ్‌కప్‌లో (T20 World Cup) భారత జట్టు మరో గండం గట్టెక్కింది. సెమీ ఫైనల్స్‌లో ఇంగ్లండ్‌పై ఘనవిజయం సాధించి ఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. దీంతో భారత క్రీడాభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇది చూసి ఓర్వలేకపోతున్న పాకిస్తాన్.. మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది. భారత జట్టుకి మాత్రమే ప్రత్యేక రూల్స్ ఉన్నాయంటూ పాక్ మాజీ ఆటగాడు ఇంజమామ్ ఉల్ హక్ (Inzamam Ul Haq) విషం చిమ్మాడు. ఇదివరకే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ బాల్ టాంపరింగ్‌కి పాల్పడిందని ఆరోపణలు చేసిన ఆయన.. ఇప్పుడు భారత్-ఇంగ్లండ్ మ్యాచ్‌ని ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.


‘‘ఒకసారి సెమీ ఫైనల్స్‌ను పరిశీలిస్తే.. సౌతాఫ్రికా-ఆఫ్ఘనిస్తాన్‌కు మధ్య జరిగిన మ్యాచ్‌కు రిజర్వ్ డే కేటాయించారు కానీ, భారత్-ఇంగ్లండ్‌కు మాత్రం రిజర్వ్ డే ఇవ్వలేదు. ఎందుకంటే.. గ్రూప్ దశ, సూపర్-8లో భారత జట్టు అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించింది. వర్షం కారణంగా సెమీ ఫైనల్స్ రద్దయితే.. భారత్ నేరుగా ఫైనల్స్‌కు వెళ్తుంది. బీసీసీఐ ముందుగానే ఈ ప్లాన్ చేసింది. అందుకే రిజర్వ్ డే కేటాయించలేదు’’ అని ఇంజమామ్ ఆరోపించాడు. ఒక్కో మ్యాచ్‌కు ఒక్కో రూల్‌ ఎలా ఉంటుందని ప్రశ్నించాడు. ఐసీసీని బీసీసీఐ (BCCI) శాసిస్తోందని, ఈ వరల్డ్‌కప్ షెడ్యూల్‌ని భారత జట్టుకి అనుగుణంగా బీసీసీఐ సిద్ధం చేయించుకుందని నిరాధారమైన ఆరోపణలు గుప్పించాడు.


భారత జట్టుకి లభిస్తున్న ప్రయోజనాలు పాకిస్తాన్‌కు ఎప్పుడూ లభించలేదని ఇంజమామ్ పేర్కొన్నాడు. ఆసియా కప్‌లో పాకిస్తాన్ బలమైన స్థితిలో ఉన్నప్పుడు, ఉన్నట్లుండి ఒక మ్యాచ్‌రి రిజర్వ్ డే కేటాయించారని గుర్తు చేసుకున్నాడు. భారత్ ఇప్పుడు ఎంతో శక్తివంతంగా తయారైందని, ఎంతలా అంటే చివరికి ఇంగ్లండ్ కూడా ఏమీ చేయలేదని చెప్పాడు. కేవలం ఒక శక్తి మాత్రమే క్రికెట్‌ని నడిపిస్తోందంటూ.. బీసీసీఐని పరోక్షంగా విమర్శించాడు. అటు.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సైతం ఈ మెగా టోర్నీ నిర్వహణ కేవలం భారత జట్టుకు మాత్రమే అనుకూలంగా సాగుతోందంటూ ఆరోపణలు చేశాడు. అన్ని జట్లకు సమానమైన ప్రాధాన్యం దక్కలేదని వాపోయాడు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jun 28 , 2024 | 03:07 PM