IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‌కి ముహూర్తం ఫిక్స్.. ప్రారంభం ఎప్పుడంటే?
ABN , Publish Date - Jan 10 , 2024 | 07:17 PM
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇప్పటివరకూ 16 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుందంటే.. క్రీడాభిమానుల నుంచి దీనికి ఎంత ఆదరణ దక్కుతోందో..
IPL 2024 Season To Start From: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇప్పటివరకూ 16 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుందంటే.. క్రీడాభిమానుల నుంచి దీనికి ఎంత ఆదరణ దక్కుతోందో అర్థం చేసుకోవచ్చు. స్టార్ క్రికెటర్లు సైతం ఈ లీగ్‌లో భాగం అయ్యేందుకు తహతహలాడుతున్నారంటే.. ఈ ఐపీఎల్‌కి ఉన్న పాపులారిటీ ఏంటో స్పష్టమవుతుంది. ఇప్పటికే 17వ సీజన్‌కి సంబంధించిన మెగా ఆక్షన్ ముగిసింది. ఇప్పుడు ఈ లీగ్ ప్రారంభం అవ్వడమే ఆలస్యం. అయితే.. ఈ 2024 ఎడిషన్ ఎప్పుడు ప్రారంభం అవుతుందనే విషయంపై ఇంతవరకూ సరైన క్లారిటీ రాలేదు. సమ్మర్‌లోనే ఉంటుందనేది అందరికీ తెలుసు కానీ.. ఏ తేదీ నుంచి మొదలవుతుందనేది మిస్టరీగానే ఉంది.
ఇప్పుడు ఆ మిస్టరీకి తెరదించుతూ.. ఐపీఎల్ 17వ సీజన్‌కి ముహూర్తం ఫిక్స్ చేశారని బీసీసీఐకి చెందిన ఒక అధికారి తెలిపారు. ఈ కొత్త సీజన్ మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభం అవ్వొచ్చని ఆయన ఒక లీక్ ఇచ్చారు. అదే సమయంలో 2024 లోక్‌సభ ఉన్నప్పటికీ.. ఈ ఐపీఎల్ సీజన్‌ని వాయిదా వేయడం కానీ, భారత్‌కి వెలుపల నిర్వహించడం కానీ జరగదని ఆయన స్పష్టం చేశారు. ఈ సీజన్ కూడా భారత్‌లోనూ నిర్వహించబడుతుందని తెలిపారు. ‘‘ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభం అయ్యే సమయంలోనే సాధారణ ఎన్నికలు ఉన్న సంగతి తెలుసు. అంత మాత్రాన ఈ టోర్నమెంట్‌ని భారత్‌కి వెలుపల మరో దేశానికి షిఫ్ట్ చేయడం కుదరదు. భారత్‌లోనే ఈ టోర్నీని నిర్వహిస్తారు. ఒకవేళ ఎన్నికల సమయంలో ఏదైనా ఒక రాష్ట్రం క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించకూడదని భావిస్తే.. అప్పుడు ఆ మ్యాచ్‌లను ఇతర వేదికలకు మార్చవచ్చు’’ అని ఆయన చెప్పుకొచ్చారు.
ఇదిలావుండగా.. గత నెలలోనే దుబాయ్‌లో ఐపీఎల్ 2024 వేలం ముగిసింది. దీని లైవ్ స్ట్రీమింగ్‌ని మొత్తం 22.8 మిలియన్ల మంది వీక్షించారు. ఇది 2022లో జరిగిన వేలం కంటే చాలా ఎక్కువ. మరోవైపు.. ఫ్రాంచైజీలు అన్ని తమ జట్లను ఈ సీజన్ కోసం పటిష్టంగా సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ఆయా జట్లలో మార్పులు కూడా గణనీయంగా చేయబడ్డాయి. ఈ మెగా టోర్నీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ నిలిచాడు. అతడిని కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే.. ఇన్నాళ్లు ముంబై ఇండియన్స్‌ని నాయకుడిగా ముందుండి నడిపించిన రోహిత్ శర్మ కూడా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఇకపై హార్దిక్ పాండ్యా ఆ జట్టుకి సారథిగా వ్యవహరిస్తాడు.