Ishan Kishan: అందులో అర్థం ఎక్కడుంది.. కాంట్రాక్ట్ రద్దుపై ఇషాన్ కిషన్ రియాక్షన్
ABN , Publish Date - Jul 08 , 2024 | 03:16 PM
తన సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు చేయడంతో పాటు జట్టు నుంచి పక్కకు తప్పించడంపై యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ తొలిసారి స్పందించాడు. తాను బాగా ఆడుతున్న సమయంలోనే తనతో ఇలా జరిగిందని..
తన సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు చేయడంతో పాటు జట్టు నుంచి పక్కకు తప్పించడంపై యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) తొలిసారి స్పందించాడు. తాను బాగా ఆడుతున్న సమయంలోనే తనతో ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకుంటే.. దేశవాళీ క్రికెట్ ఆడాలని అనడంలో అర్థం ఎక్కడుందని ప్రశ్నించాడు. ఇదే సమయంలో తాను దేశవాళీ క్రికెట్ ఎందుకు ఆడలేదో కూడా అతను క్లారిటీ ఇచ్చాడు.
ఓ ఇంటర్వ్యూలో ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. ‘‘నేను మంచి ప్రదర్శన కనబరుస్తున్న సమయంలో బెంచ్‌పై కూర్చోవాల్సి వచ్చింది. అప్పుడప్పుడు క్రీడల్లో ఇలా జరగడం సహజమే! అయితే.. ప్రయాణం చేయడం వల్ల నేను అలసటకు గురయ్యాను. దీంతో.. నాకు ఆరోగ్యం బాగోలేదని తెలిసి, విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయాన్ని నా ఫ్యామిలీ, స్నేహితులు మినహాయిస్తే ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. నా సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు అవ్వడంపై బాధపడటం లేదు. నేను నా బెస్ట్ ఇవ్వడంపై ఫోకస్ పెట్టాను’’ అని చెప్పాడు.
ఇషాన్ కిషన్ ఇంకా మాట్లాడుతూ.. ‘‘నేను బ్రేక్ తీసుకోవడం అనేది సాధారణమైన విషయం. అయితే.. ఇప్పుడు ఓ నిబంధన ఉంది. జట్టులో పునరాగమనం చేయాలంటే.. దేశవాళీ క్రికెట్‌లో రాణించాలి. ఇప్పుడు నాకు దేశవాళీ క్రికెట్ ఆడటమనేది ఎంతో భిన్నమైంది. నా ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడం వల్లే నేను అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరామం తీసుకున్నా. ఇలా బ్రేక్ తీసుకున్నంత మాత్రాన.. జట్టులో కంబ్యాక్ ఇవ్వడం కోసం దేశవాళీ క్రికెట్ ఆడాలన్న దాంట్లో అర్థం ఎక్కడుంది’’ అని విరుచుకుపడ్డాడు.
తనను ఇలా పక్కకు తప్పించడం పట్ల తీవ్ర నిరాశలో ఉన్నానని, నాకే ఎందుకిలా జరుగుతోందని తాను మనోవేదన చెందుతున్నానని ఇషాన్ కిషన్ తెలిపాడు. ఏదేమైనప్పటికీ తాను తన ఆటని మరింత మెరుగుపరచుకోవడంపై పూర్తి దృష్టి సారించానని అన్నాడు. తాను మూడు ఫార్మాట్లలోనూ ఆడగలనని, వాటిల్లో భాగం కావాలని కోరుకుంటున్నానని చెప్పాడు. తాను గతంలో టీ20, వన్డే, టెస్టుల్లోనూ మంచి ప్రదర్శన చేశానని గుర్తు చేసుకున్నాడు.
Read Latest Sports News and Telugu News