Mohammed Shami: క్రికెట్ అభిమానులారా క్షమించండి.. మహ్మద్ షమీ ఎమోషనల్ పోస్ట్
ABN , Publish Date - Oct 27 , 2024 | 08:56 PM
భారత్ వేదికగా 2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో గాయపడి.. ఆ తర్వాత లండన్‌లో శస్త్ర చికిత్స చేయించుకున్న టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధించలేకపోయాడు. దీంతో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య వచ్చే నెలలో జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సెలక్టర్లు ఎంపిక చేయలేదు.
భారత్ వేదికగా 2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో గాయపడి.. ఆ తర్వాత లండన్‌లో శస్త్ర చికిత్స చేయించుకున్న టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధించలేకపోయాడు. దీంతో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య వచ్చే నెలలో జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఈ మధ్యనే కసరత్తు మొదలు పెట్టడంతో సంపూర్ణంగా సిద్ధం కాలేకపోయాడు. దీంతో సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. ఫిట్‌నెస్ సాధించి జట్టుకు ఎంపిక కాలేకపోయినందుకు క్షమించాలని క్రికెట్ అభిమానులు, బీసీసీఐని మహ్మద్ షమీ కోరాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టాడు.
‘‘ నా వంతు కృషి చేస్తూ ఫిట్‌నెస్ విషయంలో రోజు రోజుకీ మెరుగుపడుతున్నాను. మ్యాచ్‌కు, దేశవాళీ క్రికెట్‌లో టెస్ట్ ఫార్మాట్ క్రికెట్ ఆడేందుకు ప్రతి రోజు కష్టపడుతూ ఉంటాను. క్రికెట్ అభిమానులందరికీ, బీసీసీఐకి నా క్షమాపణలు. అయితే అతి త్వరలో రెడ్ బాల్ క్రికెట్ ఆడటానికి నేను సిద్ధంగా ఉంటాను. లవ్ యూ ఆల్’’ అంటూ రాసుకొచ్చారు. ఈ సందేశంతో పాటు తన ఫిట్‌నెస్ కసరత్తులకు సంబంధించి ఒక వీడియోను కూడా పోస్ట్ చేశాడు.
కాగా గతేడాది భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో షమీకి చీలమండ గాయం అయ్యింది. శస్త్రచికిత్స జరగడంతో ఆటకు దూరమయ్యాడు. అయితే బెంగళూరు, ఇండోర్‌లో జరిగే బెంగాల్ చివరి రెండు రంజీ ట్రోఫీ మ్యాచ్‌లలో షమీ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటే ఆస్ట్రేలియా పర్యటన రెండవ భాగంలో భారత జట్టులో షమీ చోటుదక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.
ఆస్ట్రేలియాతో తలపడనున్న జట్టులో మహ్మద్ షమీ లేకపోవడం భారత్‌కు పెద్ద నష్టమని ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ వ్యాఖ్యానించారు. అయితే అతడి స్థానంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో ఆడబోయే పేసర్లను అంత తేలికగా తీసుకోబోమని వ్యాఖ్యానించాడు. కాగా ఆస్ట్రేలియాలో 2018/19, 2020/21లలో జరిగిన చివరి రెండు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలను భారత్ గెలుచుకుంది.