Mohammad Siraj: మ్యాచ్‌లో గొడవ.. మూల్యం చెల్లించుకున్న సిరాజ్.. తప్పించుకున్న హెడ్
ABN , Publish Date - Dec 09 , 2024 | 06:44 PM
భారత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్, ట్రావిస్ హెడ్ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరి వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వివాదం సద్దుమణిగినప్పటికీ ఐసీసీ మాత్రం ఇంకా సీరియస్ గానే ఉంది. ఈ ఇద్దరు ఆటగాళ్లకి తాజాగా భారీ పెనాల్టీని విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తీసుకున్న తాజా నిర్ణయం మహమ్మద్ సిరాజ్ కు షాకిచ్చింది. ఇటీవల ఆడిలైడ్ లో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన రెండో టెస్టులో ఆ జట్టు క్రికెటర్ ట్రావిస్ హెడ్ తో మాటామాటా పెరిగి వివాదానికి దారితీసింది. ఇది చినికిచినికి గాలి వానలా మారి ఐసీసీ చర్యలు తీసుకునే స్థాయికి వెళ్లింది. సిరాజ్ కు మ్యాచ్ ఫీజులో ఏకంగా 20 శాతం కోత విధిస్తున్నట్టుగా ఐసీసీ తెలిపింది. మైదానంలో దురుసు ప్రవర్తన, అనుచిత వ్యాఖ్యలు, హావభావాలను పరిగణలోనికి తీసుకున్న ఐసీసీ అతడికి ఈ పెనాల్టీని విధించింది. హెడ్ పై చర్యలు తీసుకున్నట్టు తెలిపింది. ఇద్దరు ప్లేయర్లకు ఒక్కో డీమెరిట్ పాయింట్ ను విధించింది.
‘సిరాజ్.. నీకసలు బుర్ర పనిచేస్తుందా..’
ఆసిస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ 140 స్కోరుతో ఆధిక్యంలో ఉన్న సమయంలో టీమిండియా ఆటగాడు మొహమ్మద్ సిరాజ్ చేతిలో ఔటయ్యాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఈ విషయంలో సిరాజ్ పై భారత మాజీలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ సిరాజ్ ను తీవ్రంగా తప్పుబట్టాడు. ‘‘సిరాజ్ నీకసలు బుర్ర పనిచేస్తుందా.. నువ్వే చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా. హెడ్ నీ బౌలింగ్ లో ఎడా పెడా సిక్సులు, ఫోర్లు బాదాడు. సునాయాసంగా 140 స్కోరు చేశాడు. అతడు ఔటైన సమయంలో నువ్వు అభినందించాల్సింది పోయి గేలి చేస్తావా.. దీన్ని ఎవరైనా స్లెడ్జింగ్ అంటారా.. మీరు ఓ పది పరుగుల వద్ద అతడిని ఔట్ చేసుంటే సంబరాలు చేసుకున్నా బాగుండేంది. కానీ 140 పరుగులు చేసిన ఆటగాడికి క్రెడిట్ ఇవ్వకుండా నువ్వు చేసేది ఇదా?’’ అంటూ సిరాజ్ పై మండిపడ్డాడు.