India vs Pakistan: పిచ్ రిపోర్ట్ ఏంటి.. వర్షం ముప్పు పొంచి ఉందా?
ABN , Publish Date - Jun 09 , 2024 | 07:41 AM
క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ సమయం రానే వచ్చేసింది. ఈ టీ20 వరల్డ్‌కప్‌లో అసలు సిసలైన సమరానికి రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్...
క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ సమయం రానే వచ్చేసింది. ఈ టీ20 వరల్డ్‌కప్‌లో (T20 World Cup) అసలు సిసలైన సమరానికి రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య మ్యాచ్ మరికొన్ని గంటల్లోనే జరగబోతోంది. నసావు కౌంటీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకూ ఎంతో కీలకమైంది. ఓవైపు ఐర్లాండ్‌ని ఓడించి జోష్‌లో ఉన్న భారత్.. పాక్‌పై కూడా ఆధిపత్యం చెలాయించి సూపర్-8కు చేరువ కావాలని చూస్తోంది. మరోవైపు యూఎస్ఏ చేతిలో ఓడిపోయి అవమానంపాలైన పాకిస్తాన్.. ఈ మ్యాచ్‌తో బోణీ కొట్టాలని చూస్తోంది.
పిచ్ రిపోర్ట్
అయితే.. ఈ మ్యాచ్ కంటే ఎక్కువగా పిచ్ గురించి చర్చ జరుగుతోంది. ఇందుకు కారణం.. నసావు కౌంటీ స్టేడియంలోని డ్రాప్‌ఇన్ పిచ్‌లు బ్యాటింగ్‌కి ప్రమాదకరంగా మారడమే! ఈ పిచ్‌లో బంతులు స్వింగ్, బౌన్స్ అవుతుండటంతో.. బ్యాటర్లు బంతిని అంచనా వేయలేక ఇబ్బంది పడుతున్నారు. కొందరైతే గాయాలపాలయ్యారు. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో తన భుజానికి బంతి తాకడంతో.. రోహిత్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. అటు.. శ్రీలంక-సౌతాఫ్రికా, భారత్-ఐర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో స్వల్ప స్కోర్లే నమోదయ్యాయి. దీంతో.. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఎలా సాగుతుందనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది.
ముఖ్యంగా.. ఈ పిచ్ పేసర్లకు అనుకూలమైనది. దీంతో.. పాక్ పేస్ దళంలోని షహీన్ షా అఫ్రిది, నసీం షా, హారిస్ రవూఫ్, మహమ్మద్ అమీర్ రెచ్చిపోయేందుకు సన్నద్ధమవుతున్నారు. భారత బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాలని ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే.. వారిని తిప్పి కొట్టే అత్యుత్తమ లైనప్ భారత్‌కు ఉంది. రోహిత్, కోహ్లి, పంత్, సూర్యకుమార్, దూబె, హార్దిక్ వంటి వాళ్లు గట్టిగా సమాధానం ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. అటు.. మన పేసర్లు బుమ్రా, అర్ష్‌దీప్, సిరాజ్, హార్దిక్‌లతో పాటు స్పిన్నర్లు సైతం మంచి జోరుమీదే ఉన్నారు. మరి.. హోరాహోరీగా సాగే ఈ పోరులో ఎవరు నెగ్గుతారో చూడాలి.
వరుణుడి ముప్పు
దీనికితోడు.. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు వరుణుడి ముప్పు కూడా పొచ్చి ఉంది. మ్యాచ్ ప్రారంభమైన అరగంట తర్వాత భారీ వర్షం పడేందుకు 51 శాతం అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. ఒకవేళ అదే జరిగితే.. ఈ మ్యాచ్ రద్దయ్యే ప్రమాదం ఉంది. అయితే.. అమెరికా కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ అక్కడ ఉదయం జరుగుతుంది కావడంతో, వర్షం పడినా రద్దు చేయకుండా ఆట కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కానీ.. 20 ఓవర్ల మ్యాచ్ చూస్తామా? లేదా? అనేది మాత్రం మిలిడియన్ డాలర్ ప్రశ్నగా మారింది.
Read Latest Sports News and Telugu News