Share News

PM Modi: టీమిండియాతో ప్రధాని మోదీ ఫోటో వైరల్.. ఇది గమనించారా?

ABN , Publish Date - Jul 04 , 2024 | 03:43 PM

బార్బడోస్ నుంచి టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీతో భారత్‌కు తిరిగొచ్చిన టీమిండియా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా.. ఆటగాళ్లతో కలిసి ఆయన కాసేపు..

PM Modi: టీమిండియాతో ప్రధాని మోదీ ఫోటో వైరల్.. ఇది గమనించారా?
PM Narendra Modi

బార్బడోస్ నుంచి టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup 2024) ట్రోఫీతో భారత్‌కు తిరిగొచ్చిన టీమిండియా (Team India) ప్రధాని నరేంద్ర మోదీతో (PM Narendra Modi) భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా.. ఆటగాళ్లతో కలిసి ఆయన కాసేపు ముచ్చటించారు. ప్రతిఒక్కరి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. అంతే కాదు.. వారితో కలిసి అల్పాహారం సేవించారు. అనంతరం జట్టుతో కలిసి ఫోటోలకు పోజులు కూడా ఇచ్చారు. ఇక్కడే ఓ ఆసక్తికరమైన దృశ్యం వెలుగులోకి వచ్చింది.


ఫోటో దిగే సమయంలో ప్రధాని మోదీ టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీని తాకలేదు. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid), కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఆ ట్రోఫీని చెరోవైపు నుంచి పట్టుకోగా.. ఆ ఇద్దరి మధ్యలో ఉన్న ప్రధాని వారి చేతులను పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ప్రధాని మోదీ చర్య చూసి.. నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. క్రీడా వర్గాల్లో.. ట్రోఫీలు లేదా పతకాలు గెలిచిన జట్లు లేదా అథ్లెట్లే వాటిని తాకాలని ఓ నానుడి ఉంది. అందుకు తగినట్లే ప్రధాని మోదీ ట్రోఫీకి తాకకుండా కోచ్, కెప్టెన్ల చేతులు పట్టుకోవడంతో.. ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మోదీ చర్య హర్షించదగినది అని కొనియాడుతున్నారు.


కాగా.. టీ20 వరల్డ్‌కప్‌లో విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టు జూన్ 30వ తేదీనే భారత్‌కు తిరిగి రావాల్సింది. కానీ.. బెరిల్ హరికేన్ కారణంగా బార్బడోస్‌లోనే చిక్కుకుపోయారు. మూడు రోజులు తమ హోటల్‌లోనే బస చేశారు. ఎట్టకేలకు అక్కడి పరిస్థితులు సద్దుమణగడంతో.. బీసీసీఐ ఓ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి, ఆటగాళ్లను భారత్‌కు తీసుకొచ్చింది. 16 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆటగాళ్లు భారత్‌లో అడుగుపెట్టారు. ఢిల్లీ గడ్డపై కాలుమోపగానే వారికి అపూర్వ స్వాగతం లభించింది. ఒక ప్రత్యేకమైన కేక్‌ని సైతం ఆటగాళ్లు కట్ చేయడం జరిగింది. అంతేకాదు.. ముంబైలోని వాంఖడే స్టేడియంలో సన్మాన కార్యక్రమాన్ని సైతం నిర్వహించారు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 04 , 2024 | 03:43 PM