Virat Kohli: విరాట్ కోహ్లీకి కీలక బాధ్యతలు.. అది సాధ్యమయ్యేనా?
ABN , Publish Date - Jul 02 , 2024 | 03:56 PM
సుమారు 11 ఏళ్ల నిరీక్షణ తర్వాత భారత జట్టు ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుంది. 2013లో చాంఫియన్స్ ట్రోఫీ గెలిచిన భారత్.. 2024లో టీ20 వరల్డ్‌కప్‌ని సొంతం చేసుకుంది. ఇదే ఊపులో..
సుమారు 11 ఏళ్ల నిరీక్షణ తర్వాత భారత జట్టు ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుంది. 2013లో చాంఫియన్స్ ట్రోఫీ గెలిచిన భారత్.. 2024లో టీ20 వరల్డ్‌కప్‌ని (T20 World Cup 2024) సొంతం చేసుకుంది. ఇదే ఊపులో.. ఛాంపియన్స్ ట్రోఫీ-2025తో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) టైటిల్స్‌ని కూడా కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ తరుణంలోనే.. భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి (Virat Kohli) రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) కీలక బాధ్యతలు అప్పగించాడు.
కోహ్లీ.. ఆ ఒక్క పని చేసి పెట్టు
కోచ్‌గా ఆఖరి రోజు కూడా ద్రవిడ్ తన విధులను నిర్వర్తిస్తూ.. కోహ్లీని ఓ కోరిక కోరాడు. టెస్టుల్లోనూ భారత జట్టుని ఛాంపియన్‌గా నిలబెట్టాలని చెప్పాడు. ‘‘వైట్ బాల్‌తో మనం మూడూ సాధించాం. ఇక మిగిలింది ఎరుపు ఒక్కటే. అది కూడా సాధించండి’’ అని డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీతో ద్రవిడ్ చెప్పాడు. అంటే.. టీ20, వన్డే వరల్డ్‌కప్స్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీని నెగ్గామని.. మిగిలింది టెస్టు ఛాంపియన్‌షిప్ (World Test Championship) మాత్రమేనని.. దాన్ని కూడా సొంతం చేసుకోవాలని ఆయన వివరించాడు. ఆ మూడు టైటిల్స్ గెలిచినప్పుడు.. భారత జట్టులో కోహ్లీ ఉన్నాడు.
ప్రస్తుతం మూడో టెస్టు ఛాంపియన్‌షిప్ (2023-25) ఎడిషన్ కొనసాగుతోంది. గత రెండు ఎడిషన్స్‌లో భారత జట్టు ఫైనల్స్ దాకా వెళ్లింది కానీ, టైటిల్ మాత్రం సాధించలేదు. రెండు ఫైనల్స్‌లోనూ పరాజయాలు చవిచూసింది. కానీ.. మూడోసారి మాత్రం అలా రిపీట్ అవ్వకుండా, ఎట్టి పరిస్థితుల్లోనైనా టైటిల్ కొట్టాలని భారత్ భావిస్తోంది. ఈ జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కోహ్లీ కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి జైషా ప్రకటించాడు. ఈ నేపథ్యంలోనే.. భారత్‌ని టెస్టు ఛాంపియన్‌గా నిలబెట్టే బాధ్యతను కోహ్లీకి అప్పగించాడు రాహుల్ ద్రవిడ్.
బీసీసీఐ ప్రత్యేక విమానం
టీ20 వరల్డ్‌కప్‌లో విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టు.. ఇంకా బార్బడోస్‌లోనే ఉంది. నిజానికి.. వీళ్లు ఎప్పుడో స్వదేశానికి తిరిగి రావాల్సింది కానీ.. బెరిల్ హరికేన్ కారణంగా అక్కడే చిక్కుకుపోవాల్సి వచ్చింది. అక్కడ విమాన సేవల నిలిపివేయడంతో పాటు కర్ఫ్యూ విధించడంతో.. ఆటగాళ్లందరూ తమతమ హోటల్ గదుల్లోనే ఉండిపోయారు. ఇప్పుడు అక్కడ పరిస్థితులు కాస్త సద్దుమణగడంతో.. బీసీసీఐ ఓ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. అక్కడ వాళ్లు బుధవారం తెల్లవారుజామున 3:30 గంటలకు బయలుదేరి, రాత్రి 7:45కి ఢిల్లీకి చేరుకోనున్నారు.
Read Latest Sports News and Telugu News