Sneh Rana: చరిత్ర సృష్టించిన స్నేహ్ రాణా.. తొలి భారత క్రికెటర్‌గా..
ABN , Publish Date - Jul 01 , 2024 | 04:38 PM
భారత మహిళా క్రికెటర్ స్నేహ్ రాణా అరుదైన ఘనత సాధించారు. సౌతాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో పది వికెట్లు పడగొట్టి.. ఈ ఫీట్ సాధించిన తొలి భారత స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించారు. తొలి ఇన్నింగ్స్‌లో...
భారత మహిళా క్రికెటర్ స్నేహ్ రాణా (Sneh Rana) అరుదైన ఘనత సాధించారు. సౌతాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో పది వికెట్లు పడగొట్టి.. ఈ ఫీట్ సాధించిన తొలి భారత స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించారు. తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల పడగొట్టి సౌతాఫ్రికా బ్యాటింగ్ పతనాన్ని శాసించిన ఆమె, ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీశారు. అయితే.. ఈ జాబితాలో రాణా కంటే ముందు జులాన్ గోస్వామి (Jhulan Goswami) ఉన్నారు. 2006లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆమె 10 వికెట్లు పడగొట్టారు. స్పిన్నర్ల పరంగా మాత్రం, ఈ ఘనత నమోదు చేసిన తొలి భారత స్పిన్నర్‌గా స్నేహ్ రాణా నిలిచారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. మన భారత మహిళల జట్టు ఘనవిజయం సాధించింది. సోమవారం రెండో ఇన్నింగ్స్‌ను 232/2 స్కోరుతో ప్రారంభించిన సౌతాఫ్రికా జట్టు భారత బౌలర్ల ధాటికి 373 పరుగులకి ఆలౌటై, భారత్‌కు 37 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా భారత్ 9.2 ఓవర్లలో పూర్తి చేసింది. అంతకుముందు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత జట్టు ఆరు వికెట్ల నష్టానికి 603 పరుగులు చేసి డిక్లేర్ ప్రకటించింది. షెఫాలి వర్మ (205) ద్విశతకం చేయడం, స్మృతి మందాన (149) శతక్కొట్టడంతో పాటు రిచా (86), హర్మన్‌ప్రీత్ (69), రోడ్రిగ్స్ (55) అర్థశతకాలతో రాణించడం వల్లే.. భారత జట్టు అంత భారీ స్కోరు చేయగలిగింది.
అనంతరం సౌతాఫ్రికా 266 పరుగులకే కుప్పకూలిపోవడంతో.. ఫాలోఆన్ ఆడింది. రెండో ఇన్నింగ్స్‌లో లారా వోల్వార్ట్ (122), సునే లూస్ (109) శతకాలతో రాణించగా.. నాడిన్ డిక్లెర్క్ (61) హాఫ్ సెంచరీ సాధించింది. ఈ ముగ్గురి పుణ్యమా అని 373 పరుగులు సౌతాఫ్రికా చేయగలిగింది. ఫలితంగా.. ఒక ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకొని, తన పరువుని కాపాడుకుంది. బెంగళూరులోని చెపాక్ స్టేడియం వేదికగా ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ జరిగింది.
స్కోర్లు:
భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్: 603/6d
సౌతాఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్: 266 (ఆలౌట్)
సౌతాఫ్రికా సెకండ్ ఇన్నింగ్స్: 373 (ఆలౌట్)
భారత్ సెకండ్ ఇన్నింగ్స్: 37/0
(10 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం)
Read Latest Sports News and Telugu News