ICC T20I Rankings: అగ్రస్థానం నుంచి సూర్యకుమార్ ఢమాల్.. నంబర్ వన్ ఎవరంటే?
ABN , Publish Date - Jun 26 , 2024 | 04:02 PM
గత ఏడాదిన్నర కాలం నుంచి టీ20 నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగిన సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు ఆ అగ్రస్థానాన్ని కోల్పోయాడు. కొంతకాలం నుంచి సరైన ప్రదర్శన కనబర్చకపోవడం వల్ల..
గత ఏడాదిన్నర కాలం నుంచి టీ20 నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగిన సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఇప్పుడు ఆ అగ్రస్థానాన్ని కోల్పోయాడు. కొంతకాలం నుంచి సరైన ప్రదర్శన కనబర్చకపోవడం వల్ల రెండో ప్లేస్‌కి పడిపోయాడు. ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్ (Travis Head) ఏకంగా నాలుగు స్థానాలు ఎగబాకి.. నంబర్ వన్ స్పాట్‌ని కొట్టేశాడు. ఈమధ్య కాలంలో అతను నిలకడగా రాణిస్తుండటం వల్లే మొదటి స్థానాన్ని సొంతం చేసుకోగలిగాడు. అయితే.. సూర్యకి, హెడ్‌కి కేవలం రెండు పాయింట్లు మాత్రమే తేడా ఉండటం గమనార్హం.
ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్ ప్రకారం.. 844 రేటింగ్ పాయింట్లతో హెడ్ అగ్రస్థానానికి ఎగబాకగా, 842 రేటింగ్ పాయింట్లతో సూర్య రెండో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో ట్రావిస్ హెడ్ మొత్తం ఏడు మ్యాచ్‌ల్లో 158.38 స్ట్రైక్‌రేట్, 42.50 సగటుతో 255 పరుగులు చేశాడు. ఇక సూర్యకుమార్ మొదట్లో సత్తా చాటలేకపోయినా, ఆ తర్వాత పుంజుకున్నాడు. మొత్తం ఆరు ఇన్నింగ్స్‌లలో అతను 139.25 స్ట్రైక్‌రేట్, 29.80 సగటుతో 149 పరుగులు చేశాడు. ఈ ఇద్దరి తర్వాత ఫిల్ సాల్ట్ (816 రేటింగ్ పాయింట్లు), బాబర్ ఆజం (755 రేటింగ్ పాయింట్లు), మహ్మద్ రిజ్వాన్ (746 రేటింగ్ పాయింట్లు) వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు.
అటు.. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో హార్దిక్ పాండ్యా మూడో స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుత టీ20 వరల్డ్‌కప్‌లో అతను ఫామ్‌లోకి తిరిగొచ్చి.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. మొత్తం ఆరు ఇన్నింగ్స్‌లలో 8 వికెట్లు తీసిన అతను.. నాలుగు ఇన్నింగ్స్‌లలో 58 సగటు, 145 స్ట్రైక్‌రేట్‌తో 116 పరుగులు చేశాడు. అందుకే.. ర్యాంకింగ్స్‌లో అతని స్థానం మెరుగుపడింది. అగ్రస్థానంలో మాత్రం ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ కొనసాగుతున్నాడు. అతని తర్వాత రెండో స్థానాన్ని ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ కైవసం చేసుకున్నాడు.
Read Latest Sports News and Telugu News