Virat Kohli: ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ పేరిట అవాంఛిత రికార్డు
ABN , Publish Date - Apr 07 , 2024 | 11:22 AM
పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ పేరు మీద అంతర్జాతీయ క్రికెట్‌లో చాలా రికార్డులున్నాయి. దేశవాళీ క్రికెట్ లీగ్ ఐపీఎల్‌లోనూ ఎన్నో ఘనమైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే శనివారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌పై మాత్రం కోహ్లీ ఏమాత్రం కోరుకోని రికార్డు అతడి ఖాతాలో పడింది. ఐపీఎల్‌లో సెంచరీ పూర్తి చేయడానికి ఎక్కువ బంతులు ఆడిన క్రిటర్‌గా విరాట్ నిలిచాడు.
పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ (Virat Kohli) పేరు మీద అంతర్జాతీయ క్రికెట్‌లో చాలా రికార్డులున్నాయి. దేశవాళీ క్రికెట్ లీగ్ ఐపీఎల్‌లోనూ (IPL 2024) ఎన్నో ఘనమైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే శనివారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌పై (Rajastan Royals) మాత్రం కోహ్లీ ఏమాత్రం కోరుకోని రికార్డు అతడి ఖాతాలో పడింది. ఐపీఎల్‌లో సెంచరీ పూర్తి చేయడానికి ఎక్కువ బంతులు ఆడిన క్రిటర్‌గా విరాట్ నిలిచాడు. రాజస్థాన్‌పై అద్భుతంగా బ్యాటింగ్ చేసి 72 బంతుల్లో 113 బాదినప్పటికీ సెంచరీ పూర్తి చేయడానికి 67 బంతులు ఆడడంతో ఈ అవాంఛిత రికార్డు విరాట్ కోహ్లీ ఖాతాలో పడింది. అయితే మనీశ్ పాండేతో కలిసి సంయుక్తంగా ఈ రికార్డును కోహ్లీ పంచుకున్నాడు. కాగా 2009లో డెక్కన్ ఛార్జర్స్‌పై (ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్) మనీశ్ పాండే (ఆర్సీబీ తరపున) కూడా 67 బంతుల్లో శతకాన్ని నమోదు చేశాడు.
కాగా రాజస్థాన్ రాయల్స్‌పై 72 బంతుల్లో 113 పరుగులు బాదిన విరాట్ కోహ్లీ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో రికార్డు స్థాయిలో ఎనిమిదవ శతకాన్ని అందుకున్నాడు. అంతేకాదు ఐపీఎల్ కెరియర్‌లో 7,500 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ మైలురాయిని చేరుకున్న తొలి బ్యాటర్‌గా నిలిచాడు. మరోవైపు విరాట్ కోహ్లీ నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడంటూ విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. కోహ్లీ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నప్పటికీ ఇంకా వేగంగా ఆడివుండాల్సిందని రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
చివరి వరకు క్రీజులో ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో రాణించలేదని చెబుతున్నారు. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్‌లను ఎదుర్కొనేందుకు కోహ్లీ ఇబ్బంది పడ్డాడని గుర్తుచేస్తున్నారు. అయితే చివరి వరకు క్రీజులో ఉండాలన్న టీమ్ వ్యూహాన్ని తాను అమలు చేశానని కోహ్లీ సమర్థించుకున్న విషయం తెలిసిందే. కాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై రాజస్థాన్ రాయల్స్ శనివారం రాత్రి విజయం సాధించింది. 184 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ బ్యాటర్లు 19.1 ఓవర్లలోనే ఛేదించారు. జాస్ బట్లర్ కేవలం 58 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. మరోవైపు కెప్టెన్ సంజూ శాంసన్ కూడా 42 బంతుల్లో 69 పరుగులు బాది ఔటయ్యాడు.