Share News

Virat Kohli: బార్బడోస్‌లో చిక్కుకున్న భారత్.. విరాట్ కోహ్లీ ఏం చేశాడో తెలుసా?

ABN , Publish Date - Jul 03 , 2024 | 01:03 PM

బార్బడోస్‌లో బెరిల్ తుఫాను కారణంగా భారత జట్టు అక్కడే చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీ ఓ అనూహ్యమైన పని చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే..

Virat Kohli: బార్బడోస్‌లో చిక్కుకున్న భారత్.. విరాట్ కోహ్లీ ఏం చేశాడో తెలుసా?
Virat Kohli

విదేశాల్లో భారత జట్టుకి ప్రాతినిథ్యం వహించే సమయంలో.. ఆటగాళ్లందరూ తమ ఫ్యామిలీని (భార్య, పిల్లలు) కూడా తీసుకెళ్తారు. కానీ.. కొందరు మాత్రం అనుకోని కారణాల వల్ల ఒంటరిగా వెళ్లాల్సి వస్తుంది. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) సైతం.. టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) కోసం అమెరికా, వెస్టిండీస్‌లకు సింగిల్‌గానే వెళ్లాడు. పిల్లల ఆలనాపాలనా కోసం అనుష్క శర్మ (Anushka Sharma) ఇంట్లోనే ఉండిపోయింది. ఈ నేపథ్యంలోనే.. కోహ్లీ తన భార్యాపిల్లలతో ఫోన్‌లో సంభాషిస్తూ మైదానంలో చాలాసార్లు కనిపించాడు. ముఖ్యంగా.. ఫైనల్ మ్యాచ్ తర్వాత గ్రౌండ్‌లోనే వీడియో కాల్ చేసి, కప్ గెలిచిన మధుర క్షణాలను వారితో పంచుకున్నాడు.


ఇప్పుడు తాజాగా కోహ్లీకి సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో అతను మరోసారి అనుష్కతో మాట్లాడుతూ కనిపించాడు. ఈసారి కోహ్లీ బార్బడోస్‌లోని భయంకరమైన బెరిల్ హరికేన్‌ దృశ్యాలను తన భార్యకు ఫోన్‌లో చూపించాడు. ఈ వీడియోలో కోహ్లీ సీ-ఫేసింగ్ రిసార్ట్‌లోని బాల్కనీలో నిలబడి.. బలమైన అలలు, గాలులను అనుష్కకు చూపుతూ కనిపించాడు. అంతేకాదు.. ఓ వైపు నుంచి సీన్ చూపించిన తర్వాత బాల్కనీకి మరోవైపు కోహ్లీ వెళ్లడాన్ని కూడా ఆ వీడియోలో మనం చూడొచ్చు. దీనికితోడు.. బెరిల్ తుఫానుకు సంబంధించిన ప్రమాదకర దృశ్యాలు సైతం ఈ వీడియోలో రికార్డ్ అయ్యాయి. ఆ తుఫాను కారణంగా పరిస్థితులు భయంకరంగా ఉండటం వల్లే.. తాము బార్బడోస్‌లోనే చిక్కుకున్నామని కోహ్లీ వీడియో కాల్‌లో అనుష్కకి వివరిస్తున్నాడని మనం అర్థం చేసుకోవచ్చు.


ఇదిలావుండగా.. 11 నిరీక్షణ తర్వాత భారత జట్టు ఎట్టకేలకు ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుంది. 2013లో ధోనీ సారథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత్.. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఫైనల్ పోరులో సౌతాఫ్రికాపై సంచలన విజయం నమోదు చేసి, టీ20 వరల్డ్‌కప్ టైటిల్‌ని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ ముగిసిన మరుసటి రోజే (జూన్ 30) టీమిండియా భారత్‌కు తిరిగి రావాల్సింది. కానీ.. బెరిల్ హరికేన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. విమాన సేవలను నిలిపివేయడంతో పాటు కర్ఫ్యూ విధించడంతో.. ఆటగాళ్లంతా తమకు కేటాయించిన గదుల్లోనే బస చేశారు. అయితే.. అక్కడ పరిస్థితులు సద్దుమణిగాక బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో ప్లేయర్ తిరుగుపయనమయ్యారు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 03 , 2024 | 01:11 PM