IND vs NZ: వాంఖడే పిచ్.. బ్యాటర్లకు స్వర్గధామం.. టాస్ గెలిస్తే మ్యాచ్ మనదే
ABN , Publish Date - Oct 29 , 2024 | 12:20 PM
న్యూజిలాండ్ చేతిలో రెండు మ్యాచుల్లో ఓడి గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటున్న టీమిండియా మరోసారి తలపడనుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాంఖడే పిచ్ ఎలా వ్యవహరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ముంబై: భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి టెస్టు ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన టీమ్ ఇండియా.. ఈ మ్యాచ్ గెలిచి వైట్ వాష్ ఇబ్బందిని తప్పించుకోవాలనుకుంటోంది. స్వదేశంలో, బెంగళూరులో ఆడిన మొదటి టెస్ట్‌లో సీమ్‌పై భారత్ బలహీనంగా కనిపించింది. పూణేలో జరిగిన రెండో టెస్టులో స్పిన్‌తో ఇబ్బంది పడింది. ఇలాంటి పరిస్థితుల్లో వాంఖడే పిచ్ ఎలా వ్యవహరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
టాస్ గెలిచినవారిదే పైచేయి..
సాధారణంగా వాంఖడే స్డేడియంలోని పిచ్ బ్యాట్స్‌మెన్‌లకు స్వర్గధామం లాంటిది. గతంలో మ్యాచ్ ఫలితాలు ఇదే విషయం చెబుతున్నాయి. ఎవరైతే ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ కు వెళ్తారో వారికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉండనుంది. ఇక్కడ పిచ్ ఎర్ర మట్టితో తయారు చేసింది కావడం వల్ల మంచి బౌన్స్ ఇస్తుంది. ఈ పిచ్‌పై బ్యాట్స్‌మెన్‌లు మంచి పరుగులు చేసిన రికార్డ్ ఉంది. ఛేజింగ్ చేసే జట్టుకు కష్టాలు తప్పవు. స్పిన్నర్లు వికెట్లు తీయడానికి చాలా కష్టపడాలి. ఈ మైదానంలో టీమిండియా 26 టెస్టు మ్యాచ్‌లు ఆడగా, అందులో 12 టెస్టుల్లో గెలిచి 7 ఓడిపోయింది. మరో 7 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఈ మైదానంలో కివీ జట్టు మొత్తం 3 టెస్టులు ఆడగా.. అందులో 1 గెలిచి 2 ఓడింది. ఈ పరిస్థితుల దృష్ట్యా టాస్ కీలకం కావచ్చు. తొలి ఇన్నింగ్స్ లోనే భారీ స్కోర్ చేయగలిగిన జట్టు మ్యాచ్ పై ఎక్కువ నియంత్రణ కలిగిఉండే చాన్స్ ఉంది.
తొలి ఇన్నింగ్స్ కీలకం..
వాంఖడేలో భారత్, న్యూజిలాండ్ మధ్య డిసెంబరు 2021లో చివరి టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో భారత్ 372 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్‌లో మయాంక్ అగర్వాల్ 150 పరుగులు తీయగా.. రవిచంద్రన్ అశ్విన్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అద్భుతమైన బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో అశ్విన్ 14 వికెట్లు తీశాడు. ఈ గణాంకాలు ఈ వేదికపై స్పిన్ ఎంత కీలకమో తెలియజేస్తుంది. న్యూజిలాండ్‌కు చెందిన అజాజ్ పటేల్ కూడా భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు, వాంఖడే పిచ్ నుండి స్పిన్నర్లకు ఎలాంటి ప్రయోజనం అందుతుందో దీని ద్వారా తెలుస్తోంది.