Sunrisers vs MI: సన్‌రైజర్స్ బోణీ చేసేనా?
ABN , Publish Date - Mar 27 , 2024 | 02:29 AM
కోల్‌కతాతో తొలి మ్యాచ్‌లో త్రుటిలో గెలుపును చేజార్చుకొన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై బోణీ చేయాలన్న కసితో ఉంది. బుధవారం ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో కమిన్స్ సేన తలపడనుంది...
నేడు ముంబైతో హైదరాబాద్ ఢీ
రాత్రి 7.30 నుంచి జియో సినిమా, స్టార్‌స్పోర్ట్స్‌లో..
హైదరాబాద్: కోల్‌కతాతో తొలి మ్యాచ్‌లో త్రుటిలో గెలుపును చేజార్చుకొన్న సన్‌రైజర్స్ హైదరాబాద్(Hyderabad Sunrisers) సొంతగడ్డపై బోణీ చేయాలన్న కసితో ఉంది. బుధవారం ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో కమిన్స్ సేన తలపడనుంది. ముంబై కూడా గుజరాత్ చేతిలో అనూహ్యంగా పరాజయం పాలైంది. ఇరుజట్లూ విజయం కోసం పట్టుదలగా ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశాలున్నాయి. సన్‌రైజర్స్ బ్యాటర్ క్లాసెన్ పవర్‌హిట్టింగ్‌తో కోల్‌కతా వెన్నులో వణుకు పుట్టించాడు. గెలుపు అసాధ్యం అని భావించిన తరుణంలో భారీ సిక్సర్లతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.
కానీ, అతడు అవుట్ కావడంతో హైదరాబాద్ గెలుపు గీత దాటలేక పోయింది. అయితే, అతడి నుంచి జట్టు మరోసారి అదే తరహా ప్రదర్శనను ఆశిస్తోంది. మయాంక్ ఫర్వాలేదనిపించినా..మిగతా బ్యాటర్లు పుంజుకోవాల్సి ఉంది. పేస్ విభాగంలో నటరాజన్ ఆరంభంలో వికెట్లు తీసినా.. కమిన్స్, భువనేశ్వర్ నుంచి అతడికి సహకారం అందలేదు. మరోవైపు ముంబై బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. రోహిత్ శర్మ, బ్రేవిస్ మంచి టచ్‌లో కనిపిస్తున్నారు. అయితే, ఓపెనర్ ఇషాన్ డకౌట్ కాగా.. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందకు జరగడం విమర్శలకు దారి తీసింది. పేసర్ బుమ్రా తొలిమ్యాచ్‌లోనే సత్తాచాటడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే.