Ind vs Aus: భారత జట్టు దారుణ ఓటమి.. నెటిజన్ల రచ్చ
ABN , Publish Date - Dec 30 , 2024 | 12:12 PM
ఆస్ట్రేలియా జట్టుకు చెందిన ఆటగాళ్లు నాలుగో టెస్ట్‌లో భారత జట్టుని చిత్తుగా ఓడించారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో భారత జట్టును ఓడించి, సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది.
ఆస్ట్రేలియా (Australia) 12 సంవత్సరాల తర్వాత టీమిండియాపై (team india) బాక్సింగ్ డే టెస్ట్‌ను గెలుచుకుంది. మెల్‌బోర్న్‌లో జరిగిన నాలుగో టెస్టులో 184 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్‌లోని ఐదో, చివరి టెస్ట్ జనవరి 3, 2025 నుంచి సిడ్నీలో జరుగుతుంది. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌కు 340 పరుగుల విజయ లక్ష్యం ఉంది. దీంతో భారత జట్టు 155 పరుగులకే కుప్పకూలింది. భారత 9వ వికెట్‌గా జస్ప్రీత్ బుమ్రా ఔట్ అయ్యాడు. బోలాండ్ అతడిని పెవిలియన్ పంపాడు. సున్నా పరుగులకే బుమ్రా ఔటయ్యాడు. స్మిత్ చేతికి చిక్కాడు.
ఒంటరి పోరాటం
భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ మాత్రమే అత్యధికంగా 84 పరుగులు చేశాడు. భారత్ తరఫున యశస్వి జైస్వాల్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 86 పరుగుల స్కోరు వద్ద రనౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఒంటరిగా 208 బంతులు ఆడాడు. అందులో 84 పరుగులు చేశాడు. ఆ క్రమంలో ఆయన ఔట్ కూడా వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే ఒకవైపు స్నికోమీటర్‌లో స్పైక్ కనిపించలేదు. మరోవైపు జైస్వాల్ బ్యాట్, గ్లోవ్ దగ్గర బంతి వెళ్ళినప్పుడు, అది కొద్దిగా దిశను మార్చుకుంది. అయినా కూడా జైస్వాల్‌ను థర్డ్ అంపైర్ అవుట్ చేశాడు. జైస్వాల్ ఔటైన 15 పరుగుల సమయంలోనే ఇతర భారత ఆటగాళ్లు కూడా ఔటయ్యారు.
సీనియర్ల విఫలం
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులు చేయగా, భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులు చేసింది. నితీష్ రెడ్డి సెంచరీ చేశాడు. ఆ క్రమంలో ఫాలో-ఆన్‌ను కాపాడుకోవడంలో భారత్ విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌కి వచ్చే సరికి కంగారూ జట్టు 234 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ నాలుగో ఇన్నింగ్స్‌లో 340 పరుగుల భారీ లక్ష్యాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ వంటి ముఖ్యమైన ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. దీంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 155 పరుగులు మాత్రమే సాధించగలిగింది.
నెటిజన్ల కామెంట్లు
ఈ క్రమంలో ఆస్ట్రేలియా 46 మ్యాచులను గెలిచి, 30 మ్యాచులను డ్రా చేయగా, భారత్ 33 విజయాలకు పరిమితమైంది. ఈ పర్యటనలో ఆస్ట్రేలియా అభిమానులు ఆనందంగా ఈ విజయాన్ని జరుపుకుంటున్నారు. కానీ టీమిండియా అభిమానులు మాత్రం నిరాశకు గురవుతున్నారు. అంతటితో ఆగకుండా ఈ మ్యాచ్ చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. భారత టెస్ట్ జట్టుకు ఇది మోయలేని భారమని అంటున్నారు. మరికొంత మంది మాత్రం సీనియర్ ఆటగాళ్లు ఒక్కరూ కూడా స్టాండ్ కాలేదని అంటున్నారు. అంతేకాదు జైస్వాల్, రిషబ్ పంత్ మినహా ఏ ఒక్కరూ కూడా 10కిపైగా స్కోర్ చేయలేదని చెబుతున్నారు. జట్టులో ఇలా ఆడకుండా ఉన్న సీనియర్లకు విరామం ఇవ్వాలని మరింకొంత మంది సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..
Read More National News and Latest Telugu News